* జనసేన పార్టీకి గట్టి షాక్ తగిలింది. సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు పంపారు. పవన్‌లో నిలకడైన విధివిధానాలు లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. లక్ష్మీనారాయణ పవన్‌కు రాసిన రాజీనామా లేఖ యథాతథంగా.. ‘‘పూర్తి జీవితం ప్రజాసేవకే అని.. సినిమాల్లో నటించనని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధివిధానాలు లేవని తెలుస్తోంది. కావున నేను జనసేన పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో నా వెంటన నడిచిన ప్రతి కార్యకర్తకు, ఓటు వేసిన ప్రతి ఓటరుకి నా కృతజ్ఞతలు. నేను వ్యక్తిగత స్థాయిలో జనసైనికులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు, పౌరులకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ వారందరికీ.. మీకు, మీ కుటుంబసభ్యులకు ఎప్పుడూ మంచి జరగాలని..భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు..’’ అని లక్ష్మీనారాయణ లేఖలో పేర్కొన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో లక్ష్మీనారాయణ విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
* బాలుడిపై నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపిందికర్నూలు జిల్లాలో అవుకులో ఈ దారుణం చోటు చేసుకుంది.బాలుడు కేకలు వేస్తున్నా కనికరం చూపకుండా నలుగురు యువకులు పైశాచికంగా ప్రవర్తించారు.బాలుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు.దీంతో సదరు బాలుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించారు.తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
* గంజాయి మత్తులో యువకుడు హల్చల్..విజయవాడ రామలింగేశ్వరపేట స్క్రూ బ్రిడ్జ్ వద్ద ఓ యువకుడు హల్చల్..పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.సంఘటనా స్థలానికి చేరుకుని, యువకుడి వద్ద గంజాయి ప్యాకెట్ స్వాదీనం చేసుకున్న పోలీసులు..గంజాయి మత్తులో జాతీయ రహదారిపై హల్చల్ చేశాడని, పడమట పోలీస్ స్టేషన్ కు తరలింపు.
* అనంతపురం జిల్లా హిందూపురం పర్యటనలో ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది.ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించినందుకు సొంత నియోజకవర్గంలో స్థానికులు నిరసన తెలిపారు.అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారంటూ ఆందోళనకు దిగారు.రాయలసీమ ద్రోహి బాలకృష్ణ అంటూ స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అమరావతిలో మాత్రమే ఎందుకు అభివృద్ధి కోరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాయలసీమలో హైకోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తున్న బాలకృష్ణ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.బాలకృష్ణ కాన్వాయ్‌ను ప్రజా సంఘాలు, వైసీపీ కార్యకర్తలు అడ్డకున్నారు.మరోవైపు బాలకృష్ణకు మద్దతుగా ఆయన కాన్వాయ్ వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
* భారత్‌లో కరోనా వైరస్ తొలి కేసు నమోదైంది. కేరళకు చెందిన ఓ విద్యార్థికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. వుహాన్‌లో సదరు విద్యార్థి విద్యనభ్యసిస్తున్నాడు. కరోనా కలకలంతో అతడు భారత్ తిరిగివచ్చాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థిమితంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే త్రిపురకు చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడి మలేషియా ఆసుపత్రిలో మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
* తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన సమత హత్యోదంతం కేసులో నిందితులకు ఉరిశిక్ష పడింది. షేక్‌బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మఖ్దూంలను దోషులుగా నిర్ధారిస్తూ ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. తీర్పు నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గత నవంబర్ 24న కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ గ్రామం సమీపంలో సమతపై నిందితులుసామూహిక హత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.
* రాష్ట్రంలో 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నిక జరిగినా తెరాసకే ప్రజలు పట్టం కట్టారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో భవన్లో తనను కలిసేందుకు వచ్చిన మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు శతవిధాలా ప్రయత్నించాయన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన నేతలంతా అభివృద్ధిపైనే దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. తప్పులు చేసి తలవంపులు తేవొద్దని హెచ్చరించారు. తప్పులు చేస్తే పదవులు ఊడుతాయని.. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కఠినంగా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు.
* పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. గత పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరింది. సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలను వినేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారన్నారు. ఏ అంశంపైనా చర్చకు సిద్ధమేనన్నారు.
* ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ కేసులో తీవ్రమైన లోటుపాట్లను ఈడీ గుర్తించింది. ఈ విషయాన్ని బుధవారం ప్రత్యేక న్యాయస్థానం ఎదుట ప్రస్తావించింది. దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ లక్ష నకిలీ ఖాతాలకు రూ.12,733 కోట్లను రుణాలుగా ఇచ్చినట్లు చూపిందని వెల్లడించింది. వీటిల్లో 80 డమ్మీ కంపెనీలని పేర్కొంది. డీహెచ్ఎఫ్ఎల్ ఛైర్మన్, ఎండీ కపిల్ వాద్వాన్ రిమాండ్‌పై విచారణ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయన కస్టడీని జనవరి 30వరకు న్యాయస్థానం పొడిగించింది.
* ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేరళలోని వయనాడ్ జిల్లా కాల్పెట్టలో గురువారం సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ సందర్భంగా నాథూరాం గాడ్సే, మోదీలను సరిపోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే సిద్ధాంతం, ప్రధాని నరేంద్ర మోదీ విశ్వసించిన సిద్ధాంతం ఒక్కటేనన్నారు. గాడ్సేను విశ్వసిస్తున్నానని చెప్పే ధైర్యం ప్రధానికి లేదు తప్ప వారిద్దరు విశ్వసించిన సిద్ధాంతంలో మాత్రం తేడా లేదని ఆరోపించారు.
* దేశంలో కరోనా వైరస్ సోకిన మొట్టమొదటి కేసు కేరళలో నమోదైన నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేస్తూ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు. చైనా నుంచి రాష్ట్రానికి వచ్చే వారందరినీ వైద్య పరిశీలనలో ఉంచాలని ఈటల ఆదేశించారు. చైనా నుంచి వచ్చిన వారు ఇంటి దగ్గర ఉన్నప్పటికీ వారిని పర్యవేక్షించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఐసొలేషన్ వార్డులో చికిత్స అందించేందుకు అన్ని రకాలుగా వైద్యులు సన్నద్ధంగా ఉండాలని ఈటల పేర్కొన్నారు.
* దిల్లీలోని జామియా విశ్వవిద్యాలయ ప్రాంతంలో గురువారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు ర్యాలీగా వెళ్తుండగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి వారిపై తుపాకీతో కాల్పులకు తెగబడటంతో భయాందోళన వాతావరణం నెలకొంది. మీడియా వర్గాల వివరాల ప్రకారం.. సీఏఏకు వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు జామియా మిలియా ఇస్లామియా వర్శిటీ నుంచి రాజ్‌ఘాట్‌కు ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో నల్లటి కోటు ధరించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ బయటకు తీసి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కాల్పులకు తెగబడ్డాడు.
* మహాత్మాగాంధీ సిద్ధాంతాలే కాంగ్రెస్ సిద్ధాంతమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ దేశం పరమత సహనంతో ఉండాలని గాంధీ కోరుకున్నారని, కానీ, భాజపా మాత్రం గాంధీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని ఆరోపించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. మజ్లిస్ పార్టీతో భాజపా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని విమర్శించారు.
* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గుజరాత్లో పర్యటించనున్న ఆయన.. అక్కడి సబర్మతి నదీ తీరాన్ని సందర్శిస్తారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు. దిల్లీలోని శాస్త్రీనగర్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ రూపానీ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే నెలలో ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నట్లు భారత్, అమెరికా ప్రభుత్వాలు ఇప్పటికే వెల్లడించాయి. అయితే పర్యటన తేదీలను మాత్రం ఇంకా ఖరారుచేయలేదు. ట్రంప్ షెడ్యూల్‌పై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
* జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఈ రోజును అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నామని ట్విటర్ వేదికగా తెలిపారు. దేశ ప్రజల సంక్షేమానికి, సమైక్యతకు, శాంతియుత జీవనం కోసం కృషి చేస్తూ ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ చంద్రబాబు గౌరవవందనం సమర్పించారు. ‘మన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వహించడమే దేశసేవ’ అనే గాంధీ సూక్తి తనకు ఆదర్శమని చంద్రబాబు అన్నారు.
* ప్రసిద్ధ బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవోపేతంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల కోలాహలం నడుమ అమ్మవారి పుట్టిన రోజువేడులను అంగరంగ వైభంగా నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి ఒంటిగంటకు అమ్మవారికి అభిషేకంతో ఉత్సవానికి అంకురార్పణ చేశారు. అనంతరం మంగళ వాయిద్య సేవ, సుప్రభాతం, హారతి కార్యక్రమం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే నాలుగు మండపాల్లో సామూహిక అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి.
* శాసనమండలిని రద్దు నిర్ణయం దురదృష్టకరమని తెదేపా నేత డొక్కా మాణిక్య వరపసాద్ అన్నారు. పార్టీ ఆలోచన తన వ్యక్తిగత ఆలోచనకు భిన్నంగా ఉన్నందువల్లే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానన్నారు. గుంటూరు హిమనీ సెంటర్లో గాంధీ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తుల మీద కక్షతో వ్యవస్థలను రద్దు చేయడం సరికాదని హితవు పలికారు. అమరావతి రైతుల బాధలను స్వయంగా చూశానని, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
* ఖమ్మం మిర్చి యార్డులో ఉద్రిక్తత నెలకొంది. మిరప ధర పతనాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ఒకేసారి మిర్చిధరను రూ. 5 వేలు తగ్గించి క్వింటాల్‌కు రూ.13,000 కేటాయించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా జెండా పాట రూ.17000లుగా పెట్టి.. ఇవాళ ఒకేసారి తగ్గించటంతో ఆందోళనకు దిగారు. పంటను అమ్మేది లేదంటూ మార్కెట్ గేట్లు మూసి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సర్ది చెప్పేందుకు వచ్చిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెంకటరమణను రైతులు చుట్టుముట్టారు.
* రాజధాని పోరులో మరో గుండె ఆగింది. రాయపూడికి చెందిన తోట రాంబాబు (36) అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు.ఆయన రాజధాని కోసం ఎకరన్నర పొలాన్ని ఇచ్చారు. రాజధాని తరలిపోతుందనే మనస్తాపంతోనే ఆయన చనిపోయారని బంధువులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా రాజధాని రైతుల ఆందోళనల్లో రాంబాబు పాల్గొన్నారు. మరోవైపు రాజధాని పరిరక్షణ కోసం అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 44వ రోజుకు చేరాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు.
* చైనాలో కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. గురువారం నాటికి చైనాలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 170కి చేరింది. మరో 1700 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య 7,711కి చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా హుబెయి ప్రావిన్స్‌కు చెందినవాళ్లే ఉన్నారు. 37 మంది ఆ ప్రాంతానికి చెందిన వాళ్లు ప్రాణాలు కోల్పోగా.. సిచుయాన్ ప్రావిన్స్‌లో ఒకరు మరణించారు.
* ఓవైపు ఆర్థిక మందగమనం.. మరోవైపు రికార్డు స్థాయిలో పెరిగిన ధరలతో గతేడాది పసిడికి గిరాకీ పడిపోయింది. 2019లో భారత్‌లో బంగారానికి డిమాండ్ 9శాతం తగ్గి 690.4 టన్నులుగా ఉందని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూసీజీ) గురువారం తాజా నివేదికలో వెల్లడించింది. 2018లో 760.4 టన్నుల పుత్తడికి గిరాకీ లభించింది. 2019 చివరి నాటికి దేశంలో 10 గ్రాముల పసిడి ధర రూ. 39వేల పైనే ఉంది. 2018తో పోలిస్తే ఇది దాదాపు 24శాతం ఎక్కువ కావడం గమనార్హం.
* యువతిపై అనుచిత ప్రవర్తన ఆరోపణలతో గుంటూరు అరండల్‌పేట ఎస్సై బాలకృష్ణ, కానిస్టేబుల్ రామును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ యువకుడు మోసం చేశాడని ఫిర్యాదు చేసిన తనతోపాటు, తన తల్లిపై అనుచితంగా ప్రవర్తించారంటూ యువతి ఆరోపించింది. గత నెల 31న ఎస్సై బలాత్కారం చేశారంటూ హోంమంత్రి, ఎస్పీ కార్యాలయాలను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గుంటూరు డీఎస్పీ సుప్రజకు బదిలీ చేశారు. విచారణ చేపట్టిన అధికారులు తాజాగా చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం వారిని సస్పెండ్ చేస్తూ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషులకు ఉరి ఎప్పుడు పడుతుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ వాళ్లు మాత్రం ఉరిని ఎలా ఆపాలా అని ప్రయత్నాలు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో వారిని ఉరితీయాల్సి ఉండగా నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ క్యురేటివ్ పిటిషన్ వేయగా వినయ్‌శర్మ క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వారి ఉరి మరోసారి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా గురువారం ఉరి శిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ దిల్లీ పటియాలా హౌజ్ కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.