DailyDose

మాస్క్‌ల మీద మూడింతలు లాభాలు-వాణిజ్యం

Japnese Company Profits On Coronavirus Masks-Telugu Business News Roundup

* పెళ్లిళ్ల సీజన్‌ వచ్చేసింది. దేశీయ మార్కెట్లో బంగారానికి మళ్లీ రెక్కలొచ్చాయి. గురువారం ఒక్కరోజే రూ. 400 పెరగడంతో దేశ రాజధానిలో 10 గ్రాముల పుత్తడి ధర రూ. 41,524కు చేరింది. అటు వెండి కూడా నేడు పసిడి దారిలోనే పయనించింది. రూ. 737 పెరగడంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 47,392 పలికింది.అంతర్జాతీయంగా బంగారం ధరలు పుంజుకోవడంతో పాటు దేశీయంగా పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో ఈ లోహాలకు గిరాకీ పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. రానున్న నెలల్లో శుభకార్యాలు జరగనున్న నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని తెలిపింది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది.

* చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచవ్యాప్త మార్కెట్లు డీలా పడిన వేళ జపాన్‌లో మాత్రం ఓ కంపెనీ షేర్లు భారీగా పుంజుకుంటున్నాయి. గడచిన ఏడు ట్రేడింగ్ సెషన్లలో ఆ కంపెనీ దాదాపు మూడు రెట్ల లాభాలను నమోదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. జపాన్‌కు చెందిన కవమోటో కార్పొరేషన్‌ వైద్య పరికరాలను తయారుచేస్తుంది. ఇటీవల చైనాలో విజృంభించిన కరోనా వైరస్‌ కారణంగా ముఖానికి తగిలించుకునే మాస్కులకు భారీగా డిమాండు పెరిగింది. దీంతో కంపెనీ గత ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో మూడు రెట్ల లాభాలను నమోదు చేసినట్లు సమాచారం. జపాన్‌ స్టాక్‌ ఎక్స్చేంజీ (జేపీవై)లో మంగళవారం ఈ సంస్థ మార్కెట్‌ షేర్లు 23.65శాతం పెరగాయి. అదేవిధంగా అమెరికాకు చెందిన మరో వైద్య పరికరాల తయారీ సంస్థ అల్ఫా ప్రో టెక్‌ లిమిటెడ్‌ సైతం జనవరి 17 మార్కెట్‌ షేర్లతో పోలిస్తే ప్రస్తుతం 2.2 రెట్ల లాభాల్ని నమోదు చేసింది. సోమవారం నాడు ఈ కంపెనీ షేర్లు దాదాపు 28శాతం పెరిగినట్లు సమాచారం. చైనాలో వేగంగా విజృంభిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ ధాటికి ఇప్పటికే 132 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 6వేల మందికి ఈ వ్యాధి సోకినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఒకరి నుంచి ఒకరికి వేగంగా సోకుతుండటంతో చైనా అధికారులు ముఖానికి మాస్కులు ధరించమని ప్రజలకు సూచిస్తున్నారు. దీంతో వాటికి బాగా డిమాండు పెరిగడం గమనార్హం.

* ఎలన్‌ మస్క్‌ సంపాదన ఒక్క గంటలోనే దాదాపు 2.3 బిలియన్‌ డాలర్లు(రూ.16 వేల కోట్లకు పైగా) పెరిగిపోయింది. టెస్లా షేర్లు మార్కెట్లో బలంగా ట్రేడవుతున్నాయి. అంచనాల కంటే నాలుగో త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉంటాయనే అంచనాలు.. మోడల్‌ వై క్రాసోవర్‌ కారు తయారీ వేగవంతం చేయడం వంటి కారణాలతో నిన్న వాల్‌స్ట్రీట్‌లో ఈ షేర్లు పరుగులు తీశాయి. 580.99 డాలర్లు వద్ద ఈ షేరు ట్రేడింగ్‌ ముగించింది. ఒక దశలో 12శాతం పెరిగి 649 వద్దకు చేరింది. ఈ కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌ సంపద దీంతో 36బిలియన్‌ డాలర్లుగా బ్లూమ్‌బెర్గ్‌ అంచనా కట్టింది.