ఇప్పటి వరకు చాలా రెస్టారెంట్లు చూసి ఉంటాం. ఏసీ గదుల్లోనో.. మూన్ లైట్ వెలుగులోనో తినుంటాం. ఇంకాస్త ముందుకెళ్తే.. కొన్ని రెస్టారెంట్లు పార్కు వాతావరణాన్ని కల్పించి కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. అలా కాకుండా.. దాదాపు 150 అడుగుల ఎత్తులో.. గాల్లో విహరిస్తూ.. మిత్రులందరితో కలిసి భోజనం చేస్తే.. ఆ థ్రిల్లే వేరు కదా! మీకు కూడా అలా డిన్నర్ చేయాలనుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఆగ్రాకు పదండి.ఆగ్రాలోని కలాకుర్తిలో తాజ్‌మహాల్‌కు సమీపంలో ఓ రెస్టారెంట్‌ను నిర్మించారు. ఇక్కడికి వచ్చే అతిథులకు 150 అడుగుల ఎత్తులో భోజనాలు పెట్టడం దీని ప్రత్యేకత. దీనిని వచ్చే వారంలో ప్రారంభించనున్నారు. ఇది భారత్‌లో రెండో రెస్టారెంట్. దాదాపు 24 మంది కలిసి ఒకేసారి కూర్చొని భోజనాలు చేసేలా దీనిని తయారు చేశారు. ఓ భారీ బల్లపై కుర్చీలు, డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసి, అతిథుల్ని కూర్చోబెడతారు. అనంతరం హైడ్రాలిక్ క్రేన్ సాయంతో పైకెత్తుతారు. రోప్స్ సాయంతో ఈ రెస్టారెంట్ ఆకాశంలో విహరిస్తుందని, అతిథులకు అక్కడే భోజనాలు వడ్డిస్తామని రెస్టారెంట్ డైరెక్టర్ మనోజ్ అగర్వాల్ మీడియాకు తెలిపారు.ఒక్కో బ్యాచ్‌కు 45 నిమిషాలు కేటాయించనున్నట్లు మనోజ్ అగర్వాల్ చెప్పారు. భారత్‌కు వచ్చే పర్యాటకుల్ని ఈ రెస్టారెంట్ ఎంతగానో ఆకర్షిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగ్రాకు ఇది మరో మకుటంగా మారుతుందన్నారు. ఇక్కడికి వచ్చేవారికి ఆత్మీయులతో కలిసి గాల్లో విహరిస్తూ రుచికరమైన భోజనం చేస్తూనే తాజ్‌మహల్‌ను వీక్షించే అవకాశం ఉంటుందని చెప్పారు. మరోవైపు రెస్టారెంట్‌కు అవసరమైన అన్ని అనుమతులను మంజూరు చేసినట్లు జిల్లా అదనపు మెజిస్ట్రేట్ ప్రభాకాంత్ మిశ్రా వెల్లడించారు.
ఆకాశంలో భోజనం. భూమ్మీద తాజ్‌మహల్.
Related tags :