Fashion

టీ-షర్టులపై తెలుగు వచనాలు

telugu creative quotes on tshirts deddimaag fashions

ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్నో అడుగులు ముందుకుపడుతున్నాయి. కొత్త ట్రెండులు పుట్టుకొస్తున్నాయి. పాతగయినా కొద్ది కొత్తవి వస్తున్నాయి. ఇప్పటికే రకరకాల ఫ్యాషన్‌లు చూశాం. ఫాలో అయ్యాం. కానీ మన యాసతో, మన భాషతో ఉన్న ఫ్యాషన్ ఎప్పుడైనా కనబడిందా? ఇక్కడ చూడండి. అచ్చం మన యాస, భాషలనే ఉంటది. మన భాష, యాసల్లో బ్రాండింగ్ ఎక్కడైనా చూశారా? పక్కా లోకల్ డైలాగ్స్‌తో ఓ ఫ్యాషన్ బ్రాండ్ పుట్టుకొచ్చింది. మన కుర్రాళ్లు హరీశ్ చౌదరి, మహి ఇల్లింద్ర చేసిన ఓ వినూత్న ఆలోచనతో మన యాసే ఫ్యాషనైంది, మన భాషే బ్రాండ్ అయింది. దేడ్‌దిమాగ్ పేరుతో వాళ్లు విసిరిన ఫ్యాషన్ బాణానికి యూత్ కనెక్ట్ అవుతున్నారు. దీని గురించి పదండి మన భాష, యాసల ఫ్యాషన్ ప్రపంచంలోకి మనమూ వెళ్లొద్దాం. ఒక టీషర్ట్ కొంటే దాని మీద ఏ ఇంగ్లీష్ కొటేషనో, ఏ హిందీ డైలాగో ఉంటుంది. ఏం! మనకంటూ తెలుగులో డైలాగ్స్ లేవా? కొటేషన్లు దొరకవా? మన ప్రాంతీయ భాషను ఎందుకు ఫ్యాషన్ బ్రాండ్‌గా చూడకూడదు? ఎందుకంటే మన భాషతో ఉన్న టీషర్ట్‌లు వేసుకుంటే కొందరికి లోకల్ అనే ఆత్మనూన్యతా భావం, ఇంగ్లీష్, హిందీ టీషర్ట్‌లు వేసుకుంటే ట్రెండ్ అనే మోజు. ఎప్పటి నుంచో వస్తున్న ఫ్యాషన్ కాబట్టి గుడ్డిగా ఫాలో అవుతున్నాం. ఇప్పుడు సీన్ మారిపోతున్నది. మన తెలంగాణ యాసనే ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నది. మన తెలుగు డైలాగ్‌లే యువత టీషర్ట్‌ల మీద కనిపిస్తున్నాయి. తెలుగులో ఫేమస్ డైలాగుల, పదాలతో టీషర్ట్‌లను తయారు చేసి కొత్త బ్రాండ్‌ను పరిచయం చేశారు హరీశ్, మహి. ఇకపై టీషర్ట్‌ల మీద తెలుగు డైలాగ్‌లు ఒక ఫ్యాషన్‌గా మారుతాయి. ఫసక్, నిలదీస్ఫై, అది నా పిల్ల బే, లైట్‌తీస్కో, పనిచూస్కో, మాస్.. ఊరమాస్, ఇంట్లో చెప్పే వచ్చా, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావుగారు వంటి క్రేజీ డైలాగ్‌లతో టీషర్ట్స్ కనిపిస్తాయి. అవన్నీ హరీశ్, మహి దేడ్ దిమాగ్ పేరుతో తయారు చేసిన ఫ్యాషన్ బ్రాండ్‌లే అయి ఉంటాయి.deddimaag.com ఈ కామ ర్స్ వెబ్‌సైట్ ద్వారా ఈ బ్రాండ్ బట్టలు మనం కొనవచ్చు. ఇది మొదలు పెట్టి రెండు నెలలే అవుతున్నా యువత నుంచి మంచి స్పందన వస్తున్నది. మొదట్లో రోజుకూ ఐదు నుంచి పది టీషర్ట్‌లే అమ్ముడుపోయాయి. ఇప్పుడు రోజుకూ 200 నుంచి 250 టీషర్ట్‌ల ఆర్డర్లు వస్తున్నాయి. మున్ముందు ఇది మరింత పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల యూత్‌తో పాటు తమిళ్, కన్నడ నుంచి కూడా ఇలాంటి టీషర్ట్ తమ లోకల్ లాంగ్వేజీలో తయారు చేయాలని అడుగుతున్నారు. హరీశ్, మహి ఇద్దరూ ఇంజినీరింగ్ విద్యార్థులు. మొదటి నుంచి ఫైన్ ఆర్ట్స్ మీద అభిరుచి ఉన్న యువకులు. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరినా వాళ్లకు విజయాన్ని రుచి చూసినట్టు అనిపించలేదు. ఏదో వెలితి కనిపించింది. కళాత్మక రంగాల్లో, కొత్తగా ఆలోచించే వీళ్లకు సాఫ్ట్‌వేర్ రంగం సంతృప్తినివ్వలేదు. ఉద్యోగానికి రాజీనామా చేశారు. హరీశ్ రచనలపై తన అభిరుచిని పెంచుకున్నాడు. సీరియల్స్‌కి స్క్రిప్ట్ అందించాడు. ఇలా రోజులు గడిచాయి. సృజనాత్మకంగా ఇంకేదో చేయాలనే తపన పెరిగింది. స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే తన కాళ్ల మీద తను నిలబడే మార్గాలను అన్వేషించాడు. ప్రాంతీయ భాష, యాసలను ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. ఈ విషయం మీద యూత్‌లో క్రేజ్ పెంచేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. యాస, భాషలకు సినిమాల్లోలాగే బయట కూడా ట్రెండ్ కావాలని సంకల్పించాడు. మిత్రుడు మహితో కలిసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. ఫ్యాషన్ ప్రపంచంలో తెలుగుకు చోటు లేదు, తెలుగు కొటేషన్లకు గుర్తింపు లేదు ఈ విషయాన్ని గుర్తించి దాన్నే బ్రాండ్‌గా చేయాలని ఇద్దరూ ఫిక్స్ అయ్యి అడుగు ముందుకేశారు. ఈ ఫ్యాషన్ బ్రాండ్ టీషర్ట్స్ కొనాలనుకుంటే మీరు హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో ఉంటే బట్టల దుకాణాల్లో అడగాల్సిన పని లేదు. జస్ట్ ఇంటర్నెట్ చేతిలో ఉంటే చాలు 3 రోజుల్లో మీకు నచ్చిన టీషర్ట్ మీ చేతిలో ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ తీసుకుని మూడు నుంచి నాలుగు రోజుల్లో దీన్ని డెలివరీ చేస్తున్నారు. సుమారు రూ. 250 నుంచి రూ. 500 లోపు ధరలున్నాయి. చేతికి అందిన టీషర్ట్ నచ్చకపోతే రిటర్న్ తీసుకుని డబ్బులు వెనక్కి ఇచ్చే సదుపాయాన్ని కూడా పొందుపరిచారు. కానీ ఇప్పటి వరకూ డెలివరీ అయిన టీషర్టులు ఒక్కటి కూడా రిటర్న్ రాలేదని వారు తెలిపారు. కస్టమర్ల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ వస్తుందని అన్నారు. ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు నా భవిష్యత్ గురించి నాన్న కలలు కనేవారు.అందరూ స్థిరపడుతున్నారు నేను మాత్రం ఇంకా ఏమీ చేయట్లేదనే వారు. నా భవిష్యత్ గురించి ఆందోళన పడేవారు. చుట్టుపక్కల వాళ్ల మాటలతో మా నాన్న తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవారు. ఒక దశలో అనారోగ్యానికి గురయ్యారు. ఏడాది పాటు నాన్న బాగోగులు దగ్గరుండి చూసుకున్నాను. అప్పటి నా గెలుపుని నాన్నకు చూపించాలనుకున్నాను. నాన్నకు సాయం చేస్తూనే వ్యాపారాత్మక ఆలోచనలు మొదలుపెట్టాను. ఫ్రెండ్ మహితో విషయాలు షేర్ చేసుకుంటే పెట్టుబడికి సహకరించాడు. హైదరాబాద్‌లో రెండు నెలల క్రితం ఈ బిజినెస్ ప్రారంభించాం. చాలా మంచి స్పందన వస్తున్నది. ఒక రకంగా సక్సెస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇదంతా చూడటానికి ఇప్పుడు మా నాన్న లేరు. ఇది ప్రారంభించడానికి ముందే ఆనారోగ్యంతో కన్నుమూశారు అని అన్నాడు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన హరీశ్. ఈ బిజినెస్ గురించి ఆలోచన ఇచ్చినప్పుడు ప్రయోగం చేద్దాం అనుకున్నాం. అందుకే తక్కువ పెట్టుబడితో ప్రారంభించాం. బెంగళూర్, చైన్నె నగరాల్లో క్లాత్‌ను పరిశీలించి తయారీకి అక్కడ ఒప్పందం కుదుర్చుకున్నాం. డిజైనింగ్ వర్క్ మొత్తం మేమే చేస్తున్నాం. ఇక్కడ డిజైన్ చేసి తయారీ కంపెనీకి ఫార్వర్డ్ చేసి టీషర్ట్‌ను నేరుగా కస్టమర్‌కు అందించేలా ఈ కామర్స్ వెబ్‌సైట్ రూపొందించాం. ఇలా ప్రారంభమైన మా బిజినెస్‌కు ఇప్పుడు ఊహించని రెస్సాన్స్ అందుకున్నది. త్వరలోనే బాక్సర్స్, షాట్స్, ఉమెన్ లెగ్గిన్స్, ఉమెన్ టీషర్ట్స్, కిడ్స్‌వేర్ డ్రెస్సుల్లోనూ ఈ బ్రాండ్‌ను పరిచయం చేయబోతున్నాం. కన్నడ, మళయాల ప్రాంతీయ భాషల్లోనూ టీషర్ట్‌లు తయారు చేయబోతున్నాం అని చెప్పాడు సహ వ్యవస్థాపకుడు మహీ ఇల్లింద్ర.