అత్తా – కోడళ్ల మధ్య ‘పోరు’ అనే మాట దాదాపు అందరూ వినే ఉంటారు. అత్త… అంటే కోడళ్లను నిత్యం రాచి రంపాన పెట్టే ఒక వ్యక్తిగా చూపిస్తూ అనేక సినిమాలు కూడా వచ్చాయి. ఆ ‘అత్త’ ఇప్పుడు ఒక పరిశోధనా అంశంగా మారారు.
కోడళ్ల మీద అత్తల ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై పరిశోధకులు అధ్యయనం జరిపారు. ఇలాంటి పరిశోధన జరగడం బహుశా ఇదే మొదటిసారి అయ్యుంటుంది.
2018లో బోస్టన్, దిల్లీ నగరాల్లోని విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు… ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్పూర్ జిల్లాలో ఉన్న 28 గ్రామాలకు చెందిన 18 నుంచి 30 ఏళ్ల వయసున్న 671 మంది వివాహిత మహిళలతో మాట్లాడారు.
ఈ సర్వేలో పాల్గొన్నవారి వయసు సగటున మహిళలకు 26 ఏళ్లు, వారి భర్తల సగటు వయసు 33 సంవత్సరాలు.
వారిలో ఎక్కువ మంది హిందువులు, అట్టడుగు వర్గాలకు చెందినవారు. అందులో 60 శాతం మందివి వ్యవసాయ కుటుంబాలు. వారిలో 70 శాతం మంది అత్తలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.
సర్వేలో పాల్గొన్న ఆ మహిళలను వారి సామాజిక బాంధవ్యాల గురించి (బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, ఇంటి బయట వ్యక్తులతో పరిచయాలు) గురించి పరిశోధకులు పలు ప్రశ్నలు అడిగారు.
మీరు సామాజిక సంబంధాలు ఏర్పరచుకోవడంపై మీ అత్తగారు ఎంతమేర ప్రభావం చూపారు? మీరు స్వతంత్రంగా జీవించడం, వైద్య సదుపాయాలు పొందడం, సంరక్షణ కోరటం వంటి విషయాలపై ఆమె (అత్త) ఎలాంటి ప్రభావం చూపారు? వంటి ప్రశ్నలు అడిగారు.
అత్తలతో కలిసి నివసించే మహిళలకు స్వేచ్ఛ, ఇంటి బయట సామాజిక సంబంధాలను ఏర్పరచుకునే వెసులుబాట్లు చాలా పరిమితంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.
నాలుగు గోడల మధ్య పరిమిత స్వేచ్ఛతో ఉండకుండా బయటి సమాజంలో కలివిడిగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
ప్రపంచంలో జరుగుతున్న అనేక కొత్త విషయాలు తెలుసుకునేందుకు వీలుంటుంది. తద్వారా వివిధ అంశాలపై అవగాహన పెరుగుతుంది. విస్తృతంగా ఆలోచించగలుగుతారు.
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు వీలుంటుంది. ఆరోగ్యం, సంతానోత్పత్తి, కుటుంబ నియంత్రణ వంటి అనేక విషయాలపై అవగాహన పెంచుకునేందుకు కూడా సామాజిక బాంధవ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
కానీ, ఈ సర్వేలో పాల్గొన్న మహిళల్లో దాదాపు 36 శాతం మందికి తమ వ్యక్తిగత విషయాలను పంచుకునేందుకు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎక్కడా సన్నిహితులు లేరు.
14 శాతం మంది మహిళలకు మాత్రమే వైద్యం కోసం ఆస్పత్రికి ఒంటరిగా వెళ్ళేందుకు వారి అత్తలు అనుమతి ఇస్తున్నారు.
12 శాతం మందికి మాత్రమే తమ గ్రామంలో ఉండే స్నేహితులు, బంధువుల ఇళ్లకు ఒంటరిగా వెళ్లేందుకు అత్తలు అనుమతిస్తున్నారు.
భర్త, అత్తలతో కాకుండా, ఈ మహిళలు తమ ముఖ్యమైన వ్యక్తిగత విషయాల గురించి కనీసం ఇద్దరితో (సగటున) కూడా మాట్లాడట్లేదని ఈ సర్వేలో వెల్లడైంది.
ఇక్కడి మహిళల సామాజిక బాంధవ్యాలు ఎంత బలహీనంగా ఉన్నాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
సర్వేలో పాల్గొన్న మహిళలను పరిశోధకులు రెండు గ్రూపులుగా విభజించారు. అత్తలతో కలిసి ఉంటున్నవారు ఒక గ్రూపులో, అత్తలతో కలిసి ఉండని మహిళలు మరో గ్రూపులో ఉన్నారు.
ఏ గ్రూపు వారికి సగటున ఎంతమంది సన్నిహితులు ఉన్నారన్న వివరాలు సేకరించారు.
మహిళలు తమ ఆరోగ్యం, సంతానోత్పత్తి, కుటుంబ నియంత్రణకు సంబంధించిన విషయాలను అత్యంత సన్నిహితంగా ఉండేవారితో పంచుకుంటారు. అలాంటి వారిని ‘క్లోజ్ పీర్స్’ అంటారు.
అత్తలతో కలిసి ఉంటున్న మహిళల్లో 18 శాతం మందికి మాత్రమే తమ ఊరిలో ‘క్లోజ్ పీర్స్’ ఉన్నారని సర్వేలో వెల్లడైంది.
కోడళ్లు ఇంటి బయట ఎవరితోనూ తమ విషయాలను చెప్పకుండా ఉండేందుకు అత్తలు ఆంక్షలు పెడుతుంటారని ఈ అధ్యయనం పేర్కొంది.
కొంత మంది అత్తలు… తమ కోడళ్లు ఎక్కువ మంది పిల్లలను ప్రత్యేకించి ఎక్కువ మంది కొడుకులను కనాలని కోరుకుంటున్నారు.
తాము కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటామంటే అత్త వద్దని వారించారని 48 శాతం మంది మహిళలు చెప్పారు.
ఒకవేళ కొడుకు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి, కోడలు ఇంటిదగ్గరే ఉంటే… ఆమె మీద అత్త ఆధిపత్యం మరింత ఎక్కువగా ఉంటుందని ఈ సర్వేలో వెల్లడైంది.
ఇంటి బయట తక్కువ మంది క్లోజ్ పీర్స్ (సన్నిహితులు) ఉన్న మహిళలు చాలా విషయాల్లో వెనకబడి ఉంటున్నారు. అందువల్ల పునరుత్పత్తి, ఆరోగ్యం, కుటుంబ నియంత్రణకు సంబంధించి వారు సరైన సేవలు పొందే అవకాశాలు తక్కువ. వారికి కుటుంబ నియంత్రణ గురించి, ఆధునిక గర్భనిరోధక పద్ధతుల గురించి సరైన అవగాహన ఉండట్లేదని బోస్టన్ విశ్వవిద్యాలయం, దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, బోస్టన్ కళాశాలలకు చెందిన పరిశోధకులు అంటున్నారు.
భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది యువ వివాహిత మహిళలు తమ వ్యక్తిగత విషయాలు, సమస్యల గురించి తమ భర్త, అత్తతో కాకుండా చాలా కొద్దిమందితోనే మాట్లాడుతున్నారు.
అమెరికాలో చూస్తే… 2004 గాలప్ పోల్ ప్రకారం, ఒక్కో మహిళకు కనీసం ఎనిమిది మంది సన్నిహితులు ఉంటున్నారు.
భారతదేశంలో కేవలం 33 శాతం మంది మహిళలే మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. కాబట్టి, సుదూర ప్రాంతాల్లో ఉండే బంధువులతో సంబంధాలు మెరుగుపరచుకోవడంలోనూ వారికి అవకాశాలు చాలా పరిమితంగానే ఉన్నాయి.
అయితే, అత్తలతో కలిసి ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని కాదు. గర్భంతో ఉన్న సమయంలో ఆరోగ్యం వంటి కొన్ని విషయాల్లో కోడళ్లకు అత్తల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడతాయని అధ్యయనంలో వెల్లడైంది.
కానీ, మొత్తంగా చూస్తే మాత్రం… అత్తలతో కలిసి ఉండటం వల్ల మహిళల స్వతంత్రత చాలా వరకు తగ్గిపోతుందని పరిశోధకులు భావిస్తున్నారు.
పరిశోధకులు విడుదల చేసిన పత్రానికి ‘కర్స్ ఆఫ్ ది మమ్మీజీ’ అని పేరు పెట్టారు. ఆ శీర్షిక పెట్టడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే, ది ఎకనమిస్ట్ మ్యాగజైన్ కూడా గతంలో భారతీయ అత్తలపై ఒక వ్యాసం ప్రచురించింది. దేశంలో చిన్న కుటుంబాలు పెరిగిపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ అది రాశారు.