ఎట్టకేలకు బెంజిసర్కిల్ పై వంతెనపై వాహనాల రాకపోకలను అనుమతించారు. రూ.80కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్న వంతెనపై ట్రయల్ రన్‌ను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావులు సోమవారం సాయంత్రం లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. గన్నవరం వైపు నుంచి వెళ్లే వాహనాలను నోవాటెల్ వద్ద నుంచి అనుమతించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ 2016లో దిలీప్ బిల్డ్‌కాన్ సంస్థకు పైవంతెన నిర్మాణ నులను అప్పగించామన్నారు. కొన్ని సాంకేతిక కారణాలు, డిజైన్ల మార్పులతో నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. త్వరలో కేంద్ర మంత్రితో అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. రెండోవైపు పై వంతెన నిర్మాణానికి డీపీఆర్ పూర్తి అయిందని, రెండేళ్ళ కాల వ్యవధిలో దానిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వంతెనపై విద్యుత్తు దీపాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని విద్యుత్తు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. స్క్యూ బ్రిడ్జి నుంచి భారతీనగర్ నోవాటెల్ వరకు 2.35 కిలోమీటర్ల పొడవున వంతెనకు అన్ని హంగులు పూర్తి చేశామని వివరించారు. పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ పై వంతెన అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని చెప్పారు. కొన్ని రోజుల పాటు ట్రయల్ రన్ పరిశీలించి, లోటుపాట్లను సరిదిద్దుతామని తెలిపారు. వాహనాలు దిగే సమయంలో వాలు ఎక్కువగా ఉండడంతో వేగాన్ని నియంత్రించేందుకు రెండు వైపులా వేగ నియంత్రికలు ఏర్పాటు చేస్తామన్నారు. నోవాటెల్ వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ట్రయల్ రన్ ప్రారంభ కార్యక్రమంలో జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్, డీసీపీలు టి.నాగేంద్ర కుమార్, వి.హర్షవర్థన్ రాజు, ట్రాన్స్ కో అధికారులు సుధాకర్, ఏడీఈ ప్రవీణ్ కుమార్, ఏఈ మురళీ కృష్ణ, ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.
బెంజిసర్కిల్ వంతెన ప్రారంభం

Related tags :