ScienceAndTech

బాస్మతి జన్యురాశి తెలిసిపోయింది

Telugu Science News - Basmati Rice Genome Decoded

బాస్మతి బియ్యం జన్యురాశి గుట్టును శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఛేదించారు! అందులోని రెండు వంగడాల జన్యు క్రమాన్ని సంపూర్ణంగా విశ్లేషించారు. రెండు వేర్వేరు వరి వంగడాల కలయికతో బాస్మతి ఆవిర్భవించినట్లు తేల్చారు. ‘బాస్మతి’ అనేది హిందీ పదం. ‘పరిమళంతో కూడినది’ అని దానికి అర్థం. బిర్యానీ వంటి వంటకాలతో బాస్మతి బియ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అమెరికాలోని న్యూయార్క్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా పాకిస్థాన్కు చెందిన బాస్మతి-334, ఇరాన్కు చెందిన డామ్ సూఫిడ్ వంగడాలపై విస్తృత పరిశోధనలు నిర్వహించారు. అత్యాధునిక ‘నానోపోర్ సీక్వెన్సింగ్’ సాంకేతికత సహాయంతో వాటి జన్యు క్రమాన్ని గుర్తించారు. తూర్పు ఆసియాలో ఎక్కువగా కనిపించే జపోనికా, బంగ్లాదేశ్లో లభించే ఆస్ అనే రెండు వరి వంగడాలకు సంబంధించిన జన్యు పదార్థం బాస్మతి జన్యురాశిలో ఎక్కువగా ఉందని నిర్ధారించారు. బాస్మతి-334 కరవు పరిస్థితులను ఎదుర్కోగలదని, హానికర బ్యాక్టీరియాను తట్టుకోగలదని పరిశోధకులు తెలిపారు.