Politics

నాకు మాతృభాష ప్రాణంతో సమానం

Telugu Is My Life Says India's Vice-President M Venkaiah Naidu

భారతదేశ చట్టసభలు తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడే హక్కు పొరుగు దేశాలకు లేదని వెంకయ్యనాయుడు తేల్చిచెప్పారు. భారతీయ పౌరులు ఎవరైనా వారిపై వివక్షత లేదన్నారు. భారతదేశం ఎవరిపైనా దండయాత్ర చేయలేదన్నది చరిత్ర గుర్తుచేస్తోందన్నారు. 50 ఏళ్ల రాజకీయాల్లో క్రమశిక్షణతో ఉన్నాను కాబట్టే తాను ఈ స్థాయికి ఎదిగానని వివరించారు. అందరూ మాతృభాషలో చదువుకోవాలని, ఇంగ్లీష్ కూడా అవసరమేనని చెప్పారు. తనకు మాతృభాష ప్రాణంతో సమానమన్నారు. విద్యా సంస్థలు విద్యతో పాటు వినయం, సంస్కరాన్ని పిల్లలకు నేర్పాలని కొరారు. విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పు రావాల్సి ఉందన్నారు.చట్టసభల్లో రాజకీయపార్టీల నాయకుల తీరుపై ఉపరాష్ట్రపతి అసహనం వ్యక్తం చేశారు. నిన్న పార్లమెంట్లో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో నాయకులు వాడుతున్న భాష సిగ్గుచేటుగా ఉంటోందన్నారు. రాజకీయ నాయకులు ప్రత్యర్ధులమే గానీ శత్రువులు కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో పుస్తకావిష్కరణ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ దేశ, రాష్ట్ర రాజకీయనేతల తీరుపై చురకలు వేశారు. అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో ఇదే పద్ధతి కొనసాగుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలన్నారు. కోట్లాది మంది చట్టసభల్లో జరుగుతున్న తీరును చూసి ఏం నేర్చుకోవాలని ప్రశ్నించారు. సీఏఏ సహా అన్ని చట్టాలపై దేశవ్యాప్తంగా ప్రజలు అధ్యయనం చేయాలన్నారు. ఆక్రమిత కశ్మీర్‌ సహా కశ్మీర్ ముమ్మాటికీ భారత్‌లో భాగమే ఆయన మరోమారు స్పష్టం చేశారు.