ScienceAndTech

అనంతపురంలో అల్ట్రా మెగా సోలార్ పార్క్

Technology News In Telugu-Ultra Mega Solar Park In Ananthapur

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లాలో మూడు అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్కుల నిర్మాణం చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. భారత ప్రభుత్వం ఇటీవల అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్ అనే పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మూడు అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్కుల నిర్మాణం కోసం వ్యవసాయానికి ఉపయోగపడని, వృధాగా ఉన్న ప్రైవేట్ భూముల్లో 58, 328 ఎకరాలను గుర్తించినట్లు తెలిపారు. ఆయా పార్కుల్లో 11, 665 మెగావాట్ల పవర్ ను ఉత్పత్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ముదిగుబ్బలో ఒకటి, తాడిపత్రి మండలం ఊరుచింతలపల్లిలో ఒకటి, నల్లమాడ, ఓ డి చెరువు, ఆమడగూరు మండలాలు కలిపి ఒక పార్క్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ముదిగుబ్బ మండలం లోని 8 గ్రామాలలో 9559 ఎకరాల్లో 1911 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, తాడపత్రి మండలం ఉరుచింతలపల్లిలో 2589 ఎకరాలలో 518 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి, నల్లమాడ మండలంలో ఐదు గ్రామాలలో, ఓ డి చెరువు మండలంలో 6 గ్రామాలలో, ఆమడగూరు మండలంలో రెండు గ్రామాల్లో మొత్తం 13 గ్రామాల పరిధిలో 46, 180 ఎకరాల్లో 9236 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రైవేటు భూములను గుర్తించామని తెలిపారు. ఆయా గ్రామాల పరిధిలో గుర్తించిన భూముల్లో సోలార్ పవర్ పార్కులు, వాటికి సంబంధించిన విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.