* పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ వచ్చే ఏడాది జరగబోయే శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించారు. మరోవైపు త్వరలోనే 107 స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరగనుండటంతో బడ్జెట్‌ను ప్రజాకర్షకంగా తీర్చిదిద్దారు. ఈ పదవీ కాలంలో ఆమె నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టే తుది సంపూర్ణ బడ్జెట్ ఇదే కావడంతో, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలను ఆకట్టుకోవడానికి కృషి చేశారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా సోమవారం శాసన సభకు బడ్జెట్‌ను సమర్పించారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపిన వర్గాలను తిరిగి టీఎంసీవైపు తిప్పుకునేందుకు ఈ బడ్జెట్లో ప్రయత్నం చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన మతువా సామాజిక వర్గాన్ని తిరిగి టీఎంసీవైపు ఆకర్షించేందుకు గట్టిగానే ప్రయత్నించారు. ర్గ్రామ్లో బిర్సా ముండా విశ్వవిద్యాలయం, ఎస్సీలు అధికంగా కల ప్రాంతంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం, ఓబీసీల విద్యాభివృద్ధికి దోహదపడేందుకు మరొక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మమత బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం ఓ విశ్వవిద్యాలయానికి మన దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు పెట్టబోతున్నారు. ఈ మూడు విశ్వవిద్యాలయాలను రాబోయే రెండేళ్ళలో ఏర్పాటు చేస్తారు. 60 ఏళ్ళ వయసు పైబడిన ఎస్సీ, ఎస్టీలకు నెలకు రూ.1,000 పింఛను ఇస్తామని బడ్జెట్లో ప్రకటించారు.
* పోరాటానికి శ్రేణులు సిద్ధం కావాలి:చంద్రబాబు
సీఎం జగన్‌కు అవగాహన లేకే అమరావతి నిర్మాణంపై అవివేకంగా మాట్లాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. విజయవాడలోని కానూరులో నిర్వహించిన తెదేపా రాష్ట్రస్థాయి విస్తృత సమావేశానికి ఆయన హాజరై నేతలనుద్దేశించి ప్రసంగించారు. అమరావతి పోరాటంలో మృతిచెందిన రైతులకు నేతలు సంతాపం తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో అడ్డుకున్న పార్టీ ఎమ్మెల్సీలను ఈ సందర్భంగా చంద్రబాబు సన్మానించారు.
* దుర్భాషలాడినందుకే వసంత్‌పై చర్యలు: రమేష్ రెడ్డి
గాంధీ ఆస్పత్రి ఘటనపై డీఎంఈ రమేష్ రెడ్డి స్పందించారు. వైద్యులను దుర్భాషలాడినందుకే డాక్టర్ వసంత్‌పై చర్యలు తీసుకున్నామని తెలిపారు. వసంత్ ఇష్టారీతిన బుతులు తిట్టినట్లు ఇతర వైద్యులు ఫిర్యాదు చేశారని, దాంతో వసంత్‌పై సూపరింటెండెంట్ చర్య తీసుకున్నారని చెప్పారు. కరోనాపై నోడల్ ఆఫీస్ తప్ప ఎవరూ మాట్లాడొద్దని డీఎంఈ స్పష్టం చేశారు. తప్పు జరిగినప్పుడు ఆ విషయాన్ని వసంత్ తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని రమేష్ రెడ్డి ప్రశ్నించారు. డీఎంఈ కింద ప్రమోషన్లు ఇస్తామంటే అర్హత కలిగిన వారు లేరని వివరించారు. వసంత్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంఈ తెలిపారు.
* కాంగ్రెస్ ఘోర పరాజయంపై మాజీ రాష్ట్రపతి కుమార్తె రియాక్షన్
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం మూటగట్టుకోవడంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, కాంగ్రెస్ నేత షర్మిష్ఠ ముఖర్జీ స్పందించారు. పై స్థాయిలో ఉన్న నేతలు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇంతటి దుస్థితి దాపురించిందని ఫైర్ అయ్యారు. ‘‘మేము ఢిల్లీలో మళ్లీం ఓడాం. ఆత్మపరిశీలనకు సమయం చాలించి, నేరుగా చర్యలకై రంగంలోకి దిగాల్సిందే’’ అని స్పష్టం చేశారు. పై స్థాయిలో ఉన్న నేతల ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం, వ్యూహం లోపించడం, నేతల మధ్య సమన్వయం లేకపోవడం, కార్యకర్తల ఆశలపై నీళ్లు చల్లడం, కార్యక్షేత్రంలోని కార్యకర్తలతో నేతలకు సత్సంబంధాలు లేకపోవడం… ఇవన్నీ పార్టీ ఘోర ఓటమికి కారణాలని ఆమె తేల్చారు. ఈ ఓటమికి నైతికంగా తానూ బాధ్యత వహిస్తానని షర్మిష్ఠ ప్రకటించారు.
* రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలం: కోదండరాం
దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మంగళవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, పన్నుల వసూళ్లతో పాటు రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయం తగ్గుతోందని చెప్పారు. బిల్లులపై కేంద్రానికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది కానీ… రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్రాలకు నిధులు తగ్గించి జమ్మూకశ్మీర్‌కి కేటాయించడం సరికాదన్నారు. జమ్మూకశ్మీర్‌కు గ్రాంట్ల రూపంలో నిధులు ఇవ్వాలని తెలిపారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎన్ని, నిధులు ఎందుకు రాబట్టలేకపోతున్నారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎల్ఐసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం సరైంది కాదని కోదండరాం అన్నారు.
*పవర్ ప్రాజెక్టులు మెగా కంపెనీకి అప్పగించేందుకు యత్నం-ఎంపీ రేవంత్‌రెడ్డి
భద్రాద్రి, యాదాద్రి విద్యుత్తు ప్రాజెక్టులను బీహెచ్ఈఎల్, ఇండియాబుల్ సంస్థల నుంచి మెగా కంపెనీకి అప్పగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భద్రాద్రిలో 1040 మెగావాట్ల విద్యుత్తు ప్లాంటు నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్కు అప్పగిస్తే ఆ సంస్థ నుంచి ఇండియాబుల్కు ఇచ్చారన్నారు. ఇప్పుడు మెగా కంపెనీకి కట్టబెట్టేందుకు చూస్తున్నారని చెప్పారు. సోమవారం ఆయన కొడంగల్‌లోని నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2011లో అప్పగించిన భద్రాద్రి ప్రాజెక్టు పనులు 2016లోపు పూర్తి చేయాల్సి ఉండగా నేటికీ పూర్తవ్వలేదన్నారు. అలాగే 4 వేల మెగావాట్ల యాదాద్రి విద్యుత్తు ప్రాజెక్టును రూ.30 వేల కోట్లకు బీహెచ్ఈఎల్ తీసుకొంటే, దానినీ మెగా కంపెనీకి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ విషయాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేస్తానని రేవంత్ చెప్పారు.
*కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రం: వామపక్షాలు
ప్రజాసంపదను కొల్లగొట్టి, కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతోందని, అందుకు అనుగుణంగానే కేంద్ర బడ్జెట్‌ను రూపొందించిందని వామపక్షాలు విమర్శించాయి. సోమవారం హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పోటు రంగారావు తదితర వామపక్ష నేతలతో నిర్వహించిన సమావేశంలో కొన్ని తీర్మానాలను ఆమోదించారు. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ ఈ నెల 12 నుంచి 18 వరకూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని, ఈనెల 16న సదస్సు నిర్వహించాలని తీర్మానించారు. సీఏఏ, ఎన్ఆర్సీల రద్దు డిమాండ్‌పై మార్చిలో లక్ష మందితో హైదరాబాద్‌లో బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు.
*తక్షణం మంత్రివర్గ సమావేశం నిర్వహించాలి: కేశవరావు
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తక్షణమే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని కేంద్రానికి తెరాస ఎంపీ కేశవరావు సూచించారు. ఉద్యోగాల్లో పదోన్నతులకు రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం రాజ్యసభలో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లోత్ ఓ ప్రకటన చేశారు. దీనిపై కేశవరావు స్పందిస్తూ.. ‘‘సుప్రీంకోర్టు తీర్పుతో దేశం మొత్తం షాక్‌కు గురైంది. తక్షణమే కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలి. ఒకవేళ సాధ్యం కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఓ ప్రతిపాదనతో సభకు వస్తే రాజ్యాంగ సవరణ చేద్దాం’’ అని కేశవరావు పేర్కొన్నారు.
*తెలంగాణపై కేంద్రం శీతకన్ను
చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి
తెలంగాణపై కేంద్ర ఆర్థిక మంత్రి శీతకన్ను వేశారని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి విమర్శించారు. లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై సోమవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలకు షాక్ ఇచ్చారు. 2011 జనాభా లెక్కలు కాకుండా 1971 లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘానికి దక్షిణాది రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. పట్టించుకోలేదు. ఫలితంగా తెలంగాణ రూ.2,383 కోట్లు నష్టపోయింది. ఇతర పన్నులకు సంబంధించి చిన్న రాష్ట్రమైన తెలంగాణకు రూ.3,731 కోట్ల కోత పెట్టారు. ఇలా అయితే మేం ఎలా ఆర్థిక ప్రణాళిక చేసుకోవాలి? వనరులు ఎలా సమకూర్చుకోవాలి? ప్రగతి పథంలో ఉన్న చిన్న రాష్ట్రమైన తెలంగాణను శిక్షించకూడదు. ఆర్థిక మంత్రి వీటిని సవరించాలి’’ అని రంజిత్‌రెడ్డి అన్నారు.
*కుప్పకూలే దశలో దేశ ఆర్థిక రంగం
దేశంలో అనిశ్చితి, భయం నెలకొన్నాయని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితిలో ఉందని కాంగ్రెస్ సభ్యుడు పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ ఆర్థిక రంగం దిగజారుతున్నా ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించే పరిస్థితిలో లేదన్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని అంటున్నారు. అది కాదు..ఆర్థిక వ్యవస్థను ఐసీయూ బయటే ఉంచారు. సమర్థత లేని వైద్యులు దానికి చికిత్స చేస్తున్నారు. ఇది ప్రమాదకరం. సమర్థులైన వైద్యులు (రఘురాం రాజన్, అరవింద్ సుబ్రమణియన్, అరవింద్ పనగడియా, ఊర్జిత్ పటేల్ వంటి ఆర్థిక రంగ నిపుణులు) బయటకు వెళ్లిపోతున్నారు. మీ వైద్యులు ఎవరో చెప్పండి. ప్రభుత్వం ఇతర ప్రతిపక్షాల్లోని మంచి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేదు’’ అని వ్యాఖ్యానించారు.
*సీఏఏకు మద్దతుగా భాజపా భారీ సభ
పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) మద్దతుగా హైదరాబాద్‌లో భాజపా భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఈ నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సీఏఏపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భాజపా ఈ నెల 11 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ప్రచారంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో సదస్సులు నిర్వహించనుంది. ఈ ప్రచారం ముగింపు కార్యక్రమంగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. సభకు హాజరు కావాలని అమిత్‌షాకు లేఖ రాశామని భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను సభకు ఆహ్వానించాలని భాజపా నిర్ణయించింది.
*చట్టం కాకుండానే ‘దిశ’ స్టేషన్లేంటి?:ఆదిరెడ్డి
సామాజిక మాధ్యమాల్లో తనపై అభ్యంతరకర పోస్టుల పట్ల తక్షణం విచారణ చేసి దోషులను శిక్షించాలని తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ నేతలతో కలిసి రాజమహేంద్రవరం ‘దిశ’ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శాసనసభలో మద్యంపై తాను మాట్లాడిన అనంతరం సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ‘దిశ’ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
*కర్నూలులో 12న పవన్ సభ
కర్నూలు కోట్ల కూడలిలో ఈ నెల 12న నిర్వహించే బహిరంగసభలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పాల్గొంటారు. విద్యార్థిని అత్యాచారం, హత్య ఘటనలను నిరసిస్తూ, బాధ్యులను శిక్షించాలనే డిమాండ్‌తో ఆ రోజు ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటుచేశారని పార్టీ నాయకుడు హరిప్రసాద్ పేర్కొన్నారు. పవన్ 13న కర్నూలు, ఎమ్మిగనూరుల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సమస్యలను తెలుసుకుంటారు
*పిచ్చోడి చేతిలో రాయిలా జగన్ పాలన: జవహర్
పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా సీఎం జగన్ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. ‘అమరావతి ఉద్యమంలో పాల్గొన్నందుకు నన్ను 5 రోజులు గృహ నిర్బంధంలో ఉంచారు. అమరావతి కోసం జైలుకైనా వెళ్తాను. వెనక్కి తగ్గేది లేదు. త్వరలో నేనూ మీ దీక్షలో పాల్గొంటాను’ అని పేర్కొన్నారు అమరావతి పరిరక్షణ సమితి కో-కన్వీనర్ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు జనం కోసం కాకుండా సీఎం జగన్ కోసం పనిచేస్తున్నారని విమర్శించారు.వైకాపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి వచ్చి ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ మండిపడ్డారు.
*కర్నూలు రాజధాని మా ప్రాంత హక్కు
‘కర్నూలును రాజధానిగా కోరుకోవడం మా ప్రాంత హక్కు’ అని శాసనమండలి విప్, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కర్నూలులో జ్యుడిషియల్ రాజధాని మాత్రమే కాదు.. మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని సీఎంను కోరినట్లు చెప్పారు. 2024 వరకు హైదరాబాద్‌ను రాజధానిగా కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి నాయకులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు రాత్రికి రాత్రే విజయవాడకు వచ్చి ఒక పరిపాలనా భవనం ఏర్పాటు చేశారన్నారు. బస్సుల్లోనే తిరుగుతూ నాలుగు నెలలు అప్పట్లో చంద్రబాబు పరిపాలన చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే పరిపాలన ఎలా చేస్తారని అడుగుతున్నారని మండిపడ్డారు. అమరావతి పెట్టిన రోజు రాయలసీమ, ఉత్తరాంధ్ర వారి అభిప్రాయాలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు.
ఢిల్లీలో కాంగ్రెస్ భాజపాలకు చావుదెబ్బ-రాజకీయం
Related tags :