Movies

నేడు ఘంటసాల వర్ధంతి

Today Marks Ghantasala's Death Anniversary-Feb 11th 2020

కొన్ని దశాబ్దాల పాటు అమృతతుల్యమైన తన గానాన్ని అందించి పరవశింపజేసిన మహా గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఈ లోకం విడిచివెళ్లి నాలుగున్నర దశాబ్దాలైనా ఆయన పాట వినందే తెలుగువారికి రోజు మారదు. ఆయన భౌతికంగా అమరుడై నేటికి సరిగ్గా 46 సంవత్సరాలు. కృష్ణా జిల్లా టేకుపల్లిలో 1922 డిసెంబర్ 4 జన్మించారు ఘంటసాల.సూరయ్య (సూర్య నారాయణ), రత్తమ్మ దంపతులకు మూడో సంతానం. గానకళ ఘంటసాలకు ఆజన్మవిద్యే అనుకోవాలి. అది 1930వ సంవత్సరం. మండు వేసవి.ఎర్ర లంగోటా, కొండి చుట్టుకుని ఓ ఆరేడేళ్ల పిల్లవాడు ‘ఇందిరా హృదయారవింద’ అని నారాయణతీర్థుల తరంగాన్ని నృత్యం చేస్తూ పాడగా… చూసి పరవశించినట్లు సముద్రాల రాఘవాచార్యులు రాశారు. పదేళ్ల వయస్సులో బెజవాడలో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట జరిగిన సప్తాహంలో పాల్గొన్నారు ఘంటసాల. ఆ సందర్భంగా నారాయణ తీర్థుల తరంగాన్ని పాడుతూ, నాట్యం చేయడం అక్కడున్నవారిని ఆనందంలో ముంచెత్తింది.
*తండ్రి మాటే శిరోధార్యంగా…
మృదంగాన్ని చంకకు తగిలించుకుని, భుజం మీద తన సంగీత వారసుడ్ని మోసుకుంటూ సూరయ్య ఊరూరా తిరుగుతూ తరంగ గానం చేసేవారు. దాంతోనే కుటుంబాన్ని పోషించేవారు. ఆయన చివరి ఘడియల్లో కుమారుణ్ణి దగ్గరికు తీసుకుని సంగీత విద్యలో తరించమని చెప్పారు. ఆ మాటే ఘంటసాలకు శిరోధార్యమైంది. తండ్రి మరణానంతరం ఆశ్రయం, పోషణ లేక తల్లి తన తమ్ముడింటికి వెళ్లిపోయారు. కానీ ఘంటసాల మాత్రం తండ్రి మాట ప్రకారం ఎలాగైనా సంగీతం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. 40 రూపాయల విలువ చేసే ఉంగరాన్ని 8 రూపాయలకే ఇచ్చేసి, రైలెక్కి విజయనగరం చేరుకున్నారు.
*విజయనగరం వెళ్లి…
ఆ నాడు విజయనగరం సంగీత కళాశాలకు వెళ్లేనాటికి వేసవి సెలవులు. ఉండడానికి నెలవు లేదు. తినడానికి తిండి లేదు. పాఠశాల్లో కొంత ఆశ్రయం చూసుకుంటూ ఇంటింటికీ వెళ్లి యాచించారు. తర్వాతి కాంలో అనేక వేదికల మీద ‘నాడు ఏ తల్లి నా మొదట నా జోలెలో భిక్ష వేసిందో… ఆమె వాత్యల్యపూరి తమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తునే ప్రసాదించింది’ అని కృతజ్ఞతగా చెప్పుకున్నారు ఘంటసాల. పగలు తెచ్చుకున్న అన్నంలో మిగిలింది రాత్రికి దాచుకోవడానికి ఆయన వద్ద గిన్నె కూడా లేదు. బట్టలో చుట్టి పెట్టుకొనేవారు. కొన్నిసార్లు దానికి చీమలు పట్టి, రాత్రిళ్లు పస్తులుండాల్సి వచ్చేది. చివరకు పట్రాయని సీతారామశాస్త్రి గారి ఇంట ఆశ్రయంతో పాటు తొలినాళ్ల సంగీత విద్య కూడా ఘంటసాలకు లభించింది.
*శ్రవణానందం… శాస్త్రసమ్మతం…
తీరని తపన, నిరంతర సాధనతో నాలుగేళ్ల కోర్సు రెండేళ్లలోనే పూర్తి చేశారు ఘంటసాల. శ్రవణానందము… శాస్త్రసమ్మతము కావాలనే సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఈ సిద్ధాంతాన్ని ఆచరించి తన గానాన్ని సంగీత శాస్త్ర సమ్మతంగానే గాక శ్రవణానంద సముపేతంగా పంచిపెట్టారు. గాత్ర సంగీతంలో పట్టా పొంది విజయనగరం విడిచిపెట్టే తరుణంలో సుప్రసిద్ధ హరికథా విద్వాంసుడు చొప్పలి సూర్యనారాయణ భాగవతారు పురపాలక సంఘం ఉన్నత పాఠశాలో ఘంటసాల సంగీత కచ్చేరీ ఏర్పాటు చేశారు. నాటి సభలో ఆదిభట్ల నారాయణదాసు… ఘంటసాల ప్రతిభకు మెచ్చి తంబూరా బహూకరించారు. అది తన జీవితంలోనే పర్వదినంగా చెప్పుకున్నారు ఘంటసాల.
*ఖైదీలకు సంగీత పాఠాలు…
సంగీత విద్యలో పట్టభద్రుడైన తర్వాత కూడా ఘంటసాల జీవనం కష్టతరంగానే సాగింది. పర్వదినాల్లో చేసిన కచేరీలు, సంగీత పాఠాలు కడుపునింపలేదు. దీంతో నాటకాలు, హరికథల వైపు మొగ్గు చూపారు. అంతలో స్వాతంత్యోద్య్రమం తీవ్రమైంది. క్విట్ ఇండియా ఉద్యమకాలమది. ఆ ప్రభావం ఘంటసాలపై కూడా పడింది. ‘నా వ్యక్తిగత జీవితం, కుటుంబ బాధ్యత, సంగీత సాధన… అన్నీ దేశ భవితవ్యం దృష్ట్యా చాలా అల్పం’ అని భావించి ఉద్యమంలో దూకారు. 1943 ఏప్రిల్ 24న 22 ఏళ్ల వయసులో బళ్లారి అల్లీపురం జైలులో శిక్ష అనుభవించారు ఘంటసాల. ఆ జైలులోనేపొట్టి శ్రీరాములు వద్ద హిందీ నేర్చుకున్నారు. ఎర్నేని సుబ్రహ్మణ్యం, ఎలమంచిలి వెంకటప్పయ్యలు గాంధీజీ సిద్ధాంతాలను బోధించారు. అవగాహన పెరిగింది. అక్కడా ఆయన జాతీయోద్యమ గీతాలు ఆలపించారు. ఖైదీలకు సంగీత పాఠాలు బోధించారు. జైలు నుంచి విడుదలయ్యాక మోపిదేవిలో నటరాజ నాట్యమండలి వారు ప్రదర్శించిన నాటకాల్లో వివిధ పాత్రలు ధరించారు ఘంటసాల. సుమధుర సంగీతంతోనూ అలరించారు.
*సముద్రాల పరవశం…
1944 మార్చి 3న సావిత్రితో ఘంటసాల వివాహం జరిగింది. తన పెళ్లిలో తానే సంగీత కచ్చేరీ చేశారు. తర్వాత కొన్నాళ్లకు సముద్రాల సీనియర్ను కలిశారు. తన గాన మాధుర్యంలో ఆయన్ను ముంచెత్తారు. మద్రాసు వచ్చి తనను కలుసుకోమన్నారు సముద్రాల. రెండు నెలలు దీక్షగా నాటకాలు వేసి, రూ.50 కూడబెట్టుకుని 1944 మేలో మద్రాసు వెళ్లారాయన. సముద్రాల వారు చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డి వంటి ఎంతో మంది ప్రముఖులకు ఘంటసాల పాట వినిపించారు. సిఫారసు ఉత్తరాలు రాశారు. పాట చాలా బావుందన్నారు. అవకాశాలిస్తామన్నారు. కానీ అవి అంత సులభంగా రాలేదు. ఆశ్రయం కష్టమైంది. పగలు అవకాశాల కోసం తిరగటం, రాత్రివేళల్లో పానగల్ పార్కులో నిద్ర.
*రూ.116 పారితోషికం…
సముద్రాలవారే ఘంటసాలను మద్రాసు రేడియో ప్రయోక్త బాలాంత్రపు రజనీకాంతరావుకు పరిచయం చేశారు. 1944 సెప్టెంబర్ 30న మద్రాసు రేడియోలో మొదటిసారి ఘంటసాల కర్ణాటక సంగీత కచ్చేరీ ప్రసారమైంది. తరచుగా సంగీత రూపకాల్లో, బృంద గానాల్లో, సంగీత నాటకాల్లో పాడే అవకాశం వచ్చింది. బలరామయ్య ‘సీతారామ జననం’లో చిన్న చిన్న వేషాలకు ఘంటసాల నెలకు రూ.75 జీతానికి కుదిరారు. అది అక్కినేని నాగేశ్వరరావు సినిమా. పూర్వ పరిచయం వల్ల నాగేశ్వరరావు, ఘంటసాల ఇంకా దగ్గరయ్యారు. పేకేటి శివరాం ఇన్ఛార్జిగా ఉన్న హెచ్ఎంవీలో ఘంటసాల పాట రికార్డు చేశారు. బి.ఎన్.రెడ్డి 116 రూపాయల పారితోషికమిచ్చారు. ‘బాలరాజు’లో సుబ్బరాయన్ వద్ద సహాయ సంగీత దర్శకునిగా పని చేయడమే గాక తొలిసారి అక్కినేనికి పాడారు ఘంటసాల.
*సంగీత దర్శకునిగా…
‘లక్ష్మమ్మ’ ఘంటసాల సంగీత దర్శకునిగా తొలిచిత్రం. తర్వాత ‘కీలుగుర్రం’. ఆ మరుసటి సంవత్సరం ‘షావుకారు’లో ఎన్టీఆర్కు ఘంటసాల నేపథ్యగానం తొలిసారి. ఈ ఇద్దరు కథానాయకుల నటనాయాత్రకు ఘంటసాల పాట వైభవం కలిగిస్తే, వారికి పాడడం ద్వారా ఘంటసాల గాన యాత్ర ఉజ్వలంగా వెలిగింది. ‘గాంభిర్యం, మాధుర్యం, మార్దవం, ఆర్జవం కలబోసిన స్వరం ఘంటసాలది’ అన్న కె.వి.రెడ్డి ప్రశంసలు ఆయనకు యోగ్యతాపత్రాలు. పాటైనా, పద్యమైనా, శ్లోకమైనా, దండకమైనా నవరసాలొలికే గానం ఘంటసాలది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, తుళు, హిందీ భాషల్లో కలిపి పది వేలకు పైగా పాటలు పాడారు. 100కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఐక్యరాజ్యసమితి వేదికపై పాడిన ఘనత దక్కించుకున్నారు.
*అన్నమయ్య తరువాత ఆయనే…
తిరుమల శ్రీవారి ఎదుట అన్నమాచార్యుడి తరువాత మళ్లీ పాడింది ఘంటసాలే! ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’లో ‘శేషశైలావాసా’ అంటూ తన్మయత్వంతో పాడిన ఆ దృశ్యం తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. పాటైనా, పద్యమైనా, దండకమైనా రసరంజకంగా ఆలపించడం ఘంటసాలకే చెల్లింది. బిచ్చమెత్తి సంగీత విద్య నేర్చారు. తరతరాలకూ తరగని సంగీత భిక్ష పెట్టారు. అందుకే పాట ఉన్నంత కాలం ఘంటసాల జీవించే ఉంటారు.