Devotional

శ్రీశైలంలో శివరాత్రి ప్రత్యేక సేవలు

Telugu Devotional News-Srisailam Special Events For Sivaratri

1. ఢమరుకం మోగ…శ్రీశిఖరమూగ!-ఈ నెల 14 నుంచి శ్రీశైల బ్రహ్మోత్సవాలు – ఆద్యాత్మిక వార్తలు – 11/02
ఢమ ఢమ ఢమ ఢమ… ఢమరుక శబ్దాలు, భేరీనాదాలు,నమశ్శివాయ నినాదాలు…ఆనంద తాండవాలు…భక్తజన సముద్రాలు…అవి భ్రమరాంబసమేత మల్లికార్జునస్వామి బ్రహ్మోవాలు…నందీశ్వరుడు ధ్వజమై ఎగరగా…చండీశ్వరుడు ముందుండి నడవగా…ప్రమథ గణాలు పాంచజన్యాలు పూరించగా…అత్యంత కోలాహలంగా జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతి ఘట్టం ప్రత్యేకం…ప్రతి సన్నివేశం అపురూపం!స్థలం – శ్రీశైలంశివుడు – మల్లికార్జునస్వామిపార్వతీదేవి – భ్రమరాంబాదేవి
ఈ ఆది దంపతులకు నిత్య, వార, మాస, సంవత్సర ఉత్సవాలెన్నో జరుగుతాయి. వాటన్నింటిలో మహాశివరాత్రి సందర్భంగా మాఘమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు అతి ముఖ్యమైనవి. పరమశివుడు లింగరూపుడుగా ఆవిర్భవించే మహా ఘట్టంలో జరిగే అద్భుత వేడుకలివి.
**వాహన సేవలు
బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు నుంచి రోజూ సాయంత్రం మల్లికార్జునస్వామి, భ్రమరాంబాదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులు రోజుకొక్క వాహనం అధిరోహించి తిరువీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. అంతకు ముందు ఉత్సవ మూర్తులను ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉంచి పూజలు చేస్తారు. ఈ సేవల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. శివనామస్మరణతో శ్రీశైలం మార్మోగుతుంది.
*తొలిరోజు
* శ్రీశైల మహాక్షేత్రంలో ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి సందర్భంగా ఒకసారి, మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా రెండోసారి జరుగుతాయి. సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షతో ఏడు రోజుల పాటు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు నిర్వహిస్తారు.
* ఇక్కడ జరిగే ఉత్సవాలను బ్రహ్మదేవుడు స్వయంగా నిర్వహిస్తాడని భక్తులు నమ్ముతారు. క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి పర్యవేక్షణలో, శివపరివార దేవతల్లో ఒకడైన చండీశ్వరుడు సారథ్యం వహిస్తాడని చెబుతారు.
****తొలిరోజు ఉదయం అర్చకులు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా యాగశాలలో ప్రవేశించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. ముందుగా ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగాలని వినాయకుడిని పూజించి, సంకల్పం చెబుతారు. వేడుకలకు సారథ్యం వహించమని చండీశ్వరుడిని ఆహ్వానిస్తారు.
* చండీశ్వరుడి పూజల తర్వాత అర్చకస్వామలు, ఆలయ అధికారులు కంకణాలు ధరిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వివిధ వైదిక కర్మలను నిర్వహించమని కోరుతూ రుత్వికులకు దీక్షా వస్త్రాలను అందజేసి, ఆహ్వానిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆచార్యవరణం అని పిలుస్తారు. అదేరోజు సాయంత్రం ఆలయప్రాంగణంలో నిర్ణీత పవిత్ర ప్రాంతంలోకి వెళ్లి, అక్కడి మట్టిని సేకరిస్తారు. దాన్ని తొమ్మిది పాలికల్లో వేసి, నవధాన్యాలను పోసి ప్రతిష్ఠిస్తారు.
* బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు సాయంత్రం ధ్వజారోహణం జరుగుతుంది. నూతన వస్త్రంపై నందీశ్వరుడి చిత్రాన్ని వేస్తారు. దీన్నే నంది ధ్వజం అంటారు. దీన్ని ఊరేగింపుగా ధ్వజస్తంభం దగ్గరకు తీసుకొచ్చి చండీశ్వరుడి సమక్షంలో పూజలు చేస్తారు. తర్వాత భేరీపూజ జరుగుతుంది. సంగీత వాయిద్యాల్లో ఒకటైన డోలుకు చేసేదే భేరీపూజ. తర్వాత నాదస్వరంతో వివిధ రాగాలను ఆలపిస్తూ వివిధ దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఇక ధ్వజస్తంభంపై నంది ధ్వజాన్ని ఎగరేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
**ఎనిమిదో రోజు
పదకొండురోజులు సాగే బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ప్రధానమైంది. ఆ రోజు మహాశివరాత్రి. నాటి సాయంత్రం స్వామికి ప్రభోత్సవం జరుగుతుంది. రాత్రి ఏడు గంటల వరకు స్వామి దేవేరి సమేతుడై దివ్యమైన అలంకారాలతో తనకు అత్యంత ఇష్టమైన నంది వాహనంపై ఊరేగుతారు. భక్తులకు నయనానందాన్ని కలిగిస్తారు. రాత్రి పదిగంటల తర్వాత మల్లికార్జునస్వామికి లింగోద్భవకాల మహారుద్రాభిషేకం చేస్తారు. పదకొండు మంది వేద పండితులు ఏకకాలంలో మహాన్యాసపూర్వకంగా నిరంతరాయంగా రుద్రాన్ని పఠిస్తుండగా ఈ అభిషేకం జరుగుతుంది. పవిత్ర జలాలతో, పంచామృతాలతో, వివిధ ఫలోదకాలతో మూడు గంటల పాటు దీన్ని నిర్వహిస్తారు.
* వివాహ సమయంలో పెళ్లికుమారుడి తలకు చుట్టేది తలపాగా. ఈ అలంకారమే శ్రీశైలంలోనూ ఉంటుంది. కాకుంటే అది పరమశివుడికి కాదు ఆలయానికి. దేశంలో ఎక్కడా లేని ఆచారమిది. ఆలయంలో కొలువుదీరిన అర్చారూపమే కాదు ఆలయం కూడా స్వామివారి విరాట్రూపమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ భావనకు నిదర్శనంగా నిలుస్తుంది శ్రీశైలంలో జరిగే వేడుక. మహాశివరాత్రి నాటి రాత్రి గర్భాలయంలో రుద్రాభిషేకం జరుగుతుండగా, ఆలయంపై పాగాలంకరణ జరుగుతుంది. గర్భాలయ శిఖరం నుంచి ముఖమండపం పైభాగంలో ఉన్న నందులను కలుపుతూ వస్త్రాన్ని అలంకరిస్తారు. ఈ పాగా తయారీ కూడా ఆసక్తికరమే. 365 మూరల పొడవున్న వస్త్రాన్ని రోజుకొక్క మూరచొప్పున ఏడాది పాటు నియమనిష్ఠలతో తయారుచేస్తారు. పాగాలంకరణ చేసే వ్యక్తి దిగంబరుడై అలంకరిస్తాడు. అందుకే ఆ సమయంలో ఆలయంలో విద్యుత్తు సరఫరా నిలిపేస్తారు. ‘ఓంనమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని భక్తులు పారాయణ చేస్తుండగా… ఆ నాదంతో ఆలయ ప్రాంగణం మార్మోగుతుండగా చీకట్లో ఈ అలంకరణ జరుగుతుంది.
**శ్రీశైలంలో పరమశివుడికి నిత్యం కల్యాణోత్సవం జరుగుతున్నా మహా శివరాత్రినాటి రాత్రి పాగాలంకరణ తర్వాత జరిగే కల్యాణం ప్రత్యేకమైంది. స్వామివారు తలపై ఒకవైపు గంగమ్మను, మరోవైపు నెలవంకను, మెడలో రుద్రాక్షలను, పట్టువస్త్రాలను ధరించి నయనానందకరంగా తయారవుతారు. అమ్మవారు బుగ్గన చుక్కతో, స్వర్ణాభరణాలు, పట్టుచీర ధరించి స్వామికి సరిజోడుగా తయారవుతుంది. వేదమంత్రాల మధ్య సంప్రదాయబద్ధంగా ఈ వేడుక జరుగుతుంది.
*తొమ్మిదో రోజు
మహాశివరాత్రి మరుసటి రోజు సాయంత్రం సదస్యం జరుగుతుంది. స్వామి, అమ్మవార్లను వేదమంత్రాలతో స్తుతిస్తారు. అనంతరం జరిగే నాగవల్లి కార్యక్రమంలో అమ్మవారికి నల్లపూసలు, మెట్టెలు అలంకరిస్తారు. అనంతరం రథోత్సవం, అదే రోజు రాత్రి తెప్పోత్సవం వైభవంగా జరుగుతాయి.
*పదో రోజు
ఆ తర్వాతి రోజు త్రిశూలస్నానం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు సారథ్యంవహించే చండీశ్వరుడికి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. అదే రోజు సాయంత్రం నంది ధ్వజాన్ని అవరోహణం చేస్తారు.
*పదకొండో రోజు
చివరి రోజు అశ్వవాహనాన్ని అధిరోహించి స్వామి క్షేత్ర పర్యటన చేస్తారు. తర్వాత పుష్పోత్సవం జరుగుతుంది. 18 రకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అర్చిస్తారు. నాటి రాత్రి ఏకాంతసేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
2.17 నుంచి రోజువారీ విచారణ
శబరిమల కేసులో పునఃసమీక్ష పరిధిలో ఉన్న పరిమిత అధికారాలను వినియోగించుకుంటున్నప్పుడు చట్టపరమైన కొన్ని ప్రశ్నల్ని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం… విస్తృత ధర్మాసనానికి నివేదించవచ్చని సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చని 2018లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పునఃసమీక్ష పిటిషన్లు దాఖలయ్యాయి. వాటి సంగతి తేల్చకుండా కొన్ని అంశాలను విస్తృత ధర్మాసనానికి నివేదించడం తప్పు అంటూ సీనియర్ న్యాయవాదులు ఎఫ్.ఎస్.నారీమన్, శ్యాం దివాన్ తదితరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది
3.రామ మందిర ట్రస్టు తొలి భేటీ 19న
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్టు తొలిసారిగా ఈ నెల 19న సమావేశం కానుంది. ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు తేదీని ఖరారు చేయడం, ఇద్దరు ధర్మకర్తలను నియమించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ట్రస్టు సమావేశం దిల్లీలో జరుగుతుందని కమిటీ సభ్యుడు, భాజపా నేత కామేశ్వర్ చౌపాల్ చెప్పారు. ‘రామ మందిర న్యాస్’ అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ను ట్రస్టులోకి తీసుకునే అంశంపై చర్చిస్తామని మరో సభ్యుడు స్వామి వాసుదేవానంద సరస్వతి చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రామాలయం నిర్మాణానికి సీనియర్ న్యాయవాది కె.పరాశరన్ అధ్యక్షతన ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 5న ప్రకటించిన సంగతి తెలిసిందే. మెజార్టీ తీర్మానం ద్వారా మరో ఇద్దరు ప్రముఖులను సభ్యులుగా ట్రస్టు నామినేట్ చేయాల్సి ఉంది.
4. శ్రీవారి దర్శనార్ధం శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే తిరుమలకు చేరుకున్నారు.. అంతకు ముందు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి శాసనసభ సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి, ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన ఆయన తిరుమలకు వచ్చారు.. తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న ఆయనకి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టిటిడి అదనపు ఈవో ధర్మారెడ్డి పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు.. ఇవాళ రాత్రి పద్మావతి అతితథి గృహంలో ఆయనకు బస ఏర్పాటు చేశారు.. శ్రీలంక ప్రధానితో పాటుగా ఆయన కుమారుడు యోషితా రాజ పక్సే, ఆదేశ మంత్రి ఆర్ముగం తొండమాన్ . అధికారులు తిరుమలకు చేరుకున్నారు.. రేపు ఉదయం తెల్లవారుజామున అష్టదళ పాద పద్మారాధన సేవ, వి.ఐ.పి బ్రేక్ లో తిరుమల శ్రీవారిని శ్రీలంక ప్రధాని రాజ పక్సే దర్శించుకోనున్నారు.
5. తిరుమల\|/సమాచారం****
ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు మంగళవారం,
11.02.2020
ఉదయం 6 గంటల
సమయానికి,
తిరుమల: 16C°-26C°
• నిన్న 76,468 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 01 కంపార్ట్మెంట్
లలో సర్వదర్శనం కోసం
భక్తులు వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
06 గంటలు
పట్టవచ్చును,
• నిన్న 22,466 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.16 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
/ / గమనిక / /
• ఫిబ్రవరి 21న గోగ‌ర్భ
తీర్థంలోని క్షేత్ర‌పాల‌కునికి
మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు,
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ
పూర్వా సంధ్యా ప్రవర్తతే,
ఉత్తిష్ఠ నరశార్దూల
కర్తవ్యం దైవమాహ్నికమ్‌
తా: కౌసల్యాదేవికి
సుపుత్రుడవగు ఓ
రామా! పురుషోత్తమా!
తూర్పు తెల్లవారుచున్నది.
దైవ సంబంధములైన
ఆహ్నికములను
చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free
#18004254141
6. ఓం నమో వెంకటేశాయ శుభోదయం 10.02.2020 తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య: 76,468 . 11.02.2020 ఉదయం 5 గంటల సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులతో నిండి ఉన్న కంపార్ట్మెంట్లు : 01, సర్వ దర్శనానికి పట్టే సమయం 6 గంటలు. నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య : 22,466. హుండీ ఆదాయం : రూ. 3.16 కోట్లు. Uhttp://www.edukondalu.com/
7. బాబా సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం: ధోనీ
సత్యసాయి బాబా చేపట్టిన సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయని టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ అన్నారు. మంగళవారం ఉదయం అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి మహా సమాధిని ఆయన సందర్శించారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చిన ధోనీకి ట్రస్టు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయిలో ప్రశాంతి నిలయానికి చేరుకుని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం పుట్టపర్తిలోని హిల్‌ వ్యూ స్టేడియంను పరిశీలించారు. సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి చేరుకుని రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. సత్యసాయి సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలను ట్రస్టు సభ్యులు ధోనీకి వివరించారు. ట్రస్టు సేవలను ఈ సందర్భంగా ధోనీ కొనియాడారు.
8. అన్నదాన భవనంలో అగ్నిప్రమాదం
సింహాద్రి అప్పన్న అన్నదాన భవనంలో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో అన్నదాన భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో అన్నదానానికి వినియోగించే ప్లేట్లు, గ్లాసులు, ఫర్నీచర్‌ పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. భవనంలో సిబ్బంది ఎవరూ లేనందున పెనుప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.