కొవిడ్-19(కరోన వైరస్) నిరోధక టీకా అందుబాటులో రావడానికి 18నెలల సమయం పట్టే అవకాశం ఉందని ప్రపంచ అరోగ్య సంస్థ ప్రకటించింది. వైరస్‌కు సంబంధించిన నమూనాలను వివిధ దేశాలతో పంచుకోవడం.. టీకాలు, మందుల పరిశోధనలను మరింత వేగవంతం చేయడం కోసం డబ్ల్యూహెచ్‌వో రెండు రోజుల పాటు సమావేశమయ్యింది. 2019 డిసెంబరులో బయటపడ్డ ఈ వైరస్ శరవేగంగా ప్రపంచదేశాలకు వ్యాపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీనిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నప్పటికీ..టీకా అందుబాటులోకి రావడానికి మరో 18నెలల సమయం పట్టే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రాస్ అధానోమ్ గెబ్రెయేసస్ తెలిపారు. అప్పటిదాక అందుబాటులో ఉన్న వనరులతోనే ఈ వైరస్‌పై పోరాడాల్సిందేనని ప్రపంచదేశాలకు సూచించారు. దీనికి ఇంకా భౌగోళిక సంబంధాలు లేని కారణంగా కొవిడ్-19 అనే నామకరణం చేసినట్లు తెలిపారు. ప్రపంచానికి అత్యంత ప్రమాదకారిగా మారిన ఈ వైరస్‌ను ‘నెం 1 ప్రజా శత్రువుగా’ చూడాలని పేర్కొన్నారు. ఒకవేళ నిర్లక్ష్యం వహించి మన శత్రువుగా పరిగణించకుంటే రాబోయే రోజుల్లో గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కొన్ని దేశాలు తీసుకుంటున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ఉదహరిస్తూ..ఒక ఉగ్రదాడి వలన కలిగే నష్టం కంటే ఈ వైరస్ సృష్టించే బీభత్సం రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలను కకావికలం చేస్తుందని పునరుద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా 30దేశాల్లోని ప్రజలు బలహీన ఆరోగ్య వ్యవస్థలు కలిగివుండటంతో ఇది అక్కడ మరింత విజృంభించే ప్రమాదం ఉందన్నారు. ఆయా దేశాలు ఈ వైరస్‌ను ఆరంభంలోనే గుర్తించి ఎదుర్కొనేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొరోనా టీకాకు 18నెలలు పడుతుంది
Related tags :