DailyDose

ఏలూరులో క్షుద్రపూజల కలకలం-నేరవార్తలు

Telugu Crime News Roundup Today-Black Magic In Eluru

* రెడ్డప్ప అనే వ్యక్తి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఏపీ మంత్రి తానేటి వనిత పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలో అసైన్డ్‌ భూమి పొందటం కోసం తన లెటర్‌ ప్యాడ్‌పై రెడ్డప్ప అనే వ్యక్తి ఫోర్జరీ సంతకం చేసి సిఫార్సు లేఖ వలే కలెక్టర్‌కు పంపినట్టు పేర్కొన్నారు.  తన సంతకం  ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆమె కోరారు.

* క‌ర్నాట‌క‌లో ఇవాళ బంద్ పాటిస్తున్నారు. స‌రోజ‌ని మ‌హిషి నివేదిక‌ను అమ‌లు చేయాల‌ని ఆ రాష్ట్రానికి చెందిన అనేక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  స్థానిక క‌న్న‌డీయుల‌కు ఉద్యోగాల్లో కోటా క‌ల్పించాల‌ని ప‌లు సంఘాలు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాయి. ప్రైవేటు, ప‌బ్లిక్ సెక్టార్ కంపెనీల్లో ఆ కోటా ఉండాల‌ని క‌న్న‌డ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  ఇవాళ బంద్ నేప‌థ్యంలో.. ఫరంగిపేట వ‌ద్ద ఓ బ‌స్సుపై రాళ్లు రువ్వారు. తిరుప‌తి నుంచి మంగుళూరు వెళ్తున్న బ‌స్సు ఆ దాడిలో ధ్వంస‌మైంది. క‌న్న‌డ ఐక్య కూట‌మి ఆధ్వ‌ర్యంలో బంద్ కొన‌సాగుతున్న‌ది. బెంగుళూర్‌తో పాటు రాష్ట్రంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో జ‌న‌జీవ‌నం స్తంభించింది. ఉద‌యం 6 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు బంద్ పాటిస్తున్నారు. ఓలా, ఊబ‌ర్ డ్రైవ‌ర్లు కూడా బంద్‌కు స‌హ‌క‌రిస్తున్నారు.

* చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం కొనసాగుతోంది. జిల్లాలోని పలు మండలాల్లో గత నాలుగైదు రోజుల నుంచి పంట పొలాలపై ఏనుగులు దాడులు చేస్తున్నాయి. గుడిపాల బంగారుపాలెం మండలంలోని పంట పొలాలపై ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. అలాగే గుడిపాల మండలం లోని పళ్లూరు, పానాటూరు, ముత్తువాళ్ళ ఊరు, పిళ్ళారి కుప్పం, బట్టువాళ్ళ గ్రామాల్లో ఏనుగులు దాడులు చేస్తున్నాయి. ఏనుగుల దాడిలో అరటి, చెరకు, వరి, కూరగాయల పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. అటు బంగారుపాలెం మండలంలోని కీరమంద, టేకుమంద గ్రామాల్లోని పంటపొలాలపైనా ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి.

* ఓ కుక్క నిరంతరం మొరుగుతుందని.. దాని యజమానురాలిపై కొందరు దాడి చేశారు. దీంతో ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయింది. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని దామ్‌బివ్లిలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ మహిళ కుక్కను పెంచుకుంది. ఇతరులను చూస్తే ఆ శునకం నిరంతరం మొరుగుతూనే ఉంటుంది. దీంతో తీవ్ర అసహనానికి గురైన పక్కింటివారు కుక్క యజమానురాలిని కొట్టారు. దాడి చేసిన కాసేపటికే ఆమెకు ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో.. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాధితురాలు చనిపోయిందని వైద్యులు తెలిపారు. గుండెపోటు వల్లే బాధితురాలు మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* మధ్యప్రదేశ్‌లో ఓ పోలీస్‌ఉన్నతాధికారి తన భార్యపై దాడికి పాల్పడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎస్‌డీఓపీ మునావర్‌ మాట్లాడుతూ..బాధిత మహిళ ఫిర్యాదు మేరకు నరేంద్రసూర్యవంశీపై కిడ్నాప్‌, రేప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. గంధ్వాని పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జి నరేంద్ర సూర్యవంశీ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో..అతని భార్య వద్దని వారించింది. దీంతో నరేంద్రసూర్యవంశీ అతని భార్యపై దాడికి దిగాడు. దీంతో స్థానికులు కలగజేసుకుని ఆ మహిళను రక్షించారు.

* పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. వారం క్రితం లోకేష్ అనే యువకుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. రెండు లక్షలు ఇవ్వాలంటూ లోకేష్ తల్లిదండ్రులకు కిడ్నాపర్లు ఫోన్ చేశారు. కాగా లోకేష్‌ను విశాఖ జిల్లా భీమిలికి తీసుకెళ్లిన కిడ్నాపర్లు అతడిని కొట్టారు. దీంతో లోకేష్‌కు తీవ్ర గాయాలు అవడంతో వెంటనే అతడిని కిడ్నాపర్లు భీమవరంలో వదిలేశారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన లోకేష్‌ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్రికెట్ బెట్టింగ్‌ల వ్యవహారమే కిడ్నాప్‌కు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

* మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఈరోజు ఉదయం పాదాచారులు నడిచే వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు త్రీవంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు వంతెన కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నవాబ్‌పేటలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఇంటి ముందు ముగ్గులు వేసి, కోడిగుడ్లు పగులకొట్టారు. దీంతో ఇంట్లోని వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడకు చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. క్షుద్ర పూజలు స్థానికులను సైతం కలవరానికి గురిచేశాయి.

* సామాన్యులను ఆర్థికంగా చిదిమేస్తున్న మట్కా, పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్పీ సత్యఏసుబాబు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 8 పోలీసు సబ్‌ డివిజన్లలో ముమ్మరంగా దాడులు చేశారు. తాడిపత్రి, హిందూపురం, గుంతకల్లు, కదిరి, గుత్తి తదితర ముఖ్య పట్టణాల్లో నియంత్రణకు ప్రత్యేక నిఘా వేశారు. గత నెలలో మట్కా నిర్వాహకులపై 432 కేసులు, పేకాట ఆడుతున్న వారిపై 25 కేసులు నమోదు చేశారు.