DailyDose

ఇండియా పర్యటనకు సత్యనారాయణ-తాజావార్తలు

Microsoft CEO To Visit India-Telugu Breaking News Roundup Today

* ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల ఈ నెలాఖర్లో భారత పర్యటనకు రానున్నారు. ఈ మేరకు కంపెనీ అధికారికంగా వెల్లండించింది. కానీ, ఆయన పర్యటనకు సంబంధించిన ప్రత్యేక తేదీలను మాత్రం ప్రస్తావించలేదు. ‘ఈ నెలాఖర్లో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల భారత పర్యటనకు వస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ వినియోగదారులు, యువత, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు’ అని మైక్రోసాఫ్ట్‌ అధికారులు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆయన ఫిబ్రవరి 24-26 మధ్య తేదీల్లో రావచ్చని తెలుస్తోంది. దిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాధికారులతో సమావేశం కానున్నట్లు సమాచారం.

* తెలుగు రాష్ట్రాలు, దిల్లీ, పుణె సహా 40 చోట్ల జరిపిన సోదాలపై ఆదాయపన్ను (ఐటీ)శాఖ కీలక ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణలో సుమారు రూ.2వేల కోట్ల విలువైన అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఆ ప్రకటనలో ఐటీ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌, విజయవాడ, కడప, విశాఖపట్నం, దిల్లీ, పుణె నగరాల్లో దాడులు జరిపామని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో కీలక పత్రాలు లభించాయిని.. మూడు ఇన్‌ఫ్రా కంపెనీల్లో నకిలీ బిల్లులను గుర్తించామని ఐటీ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.

* ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలిని గవర్నర్‌ ప్రొరోగ్‌ చేశారు. ఉభయ సభలను ప్రొరోగ్‌ చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. శాసనసభ, మండలిని ప్రొరోగ్‌ చేసిన నేపథ్యంలో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణకు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

* తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పే సమాఖ్య స్ఫూర్తితో దేశం నడిచే రోజు వస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేటాయించిన నిధులపై లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టైమ్స్‌ నెట్‌వర్క్‌ నిర్వహించిన ‘యాక్షన్‌ ఫర్‌ ఇండియా’ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం మరింత ఉదారంగా వ్యవహరించాలని హితవు పలికారు. దక్షిణాది రాష్ట్రాల్లో జాతీయ పార్టీల ఉనికే లేదని.. రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలు మరింత బలపడతాయని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

* ఇటీవల జరిగిన దిల్లీ శాసనసభ ఎన్నికల్లో భాజపా పరాజయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలపై తన అంచనా తప్పయిందన్నారు. గెలుపోటముల కోసం ఎన్నికల్లో తలపడలేదన్న ఆయన.. తమ భావజాలాన్ని విస్తరించుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు చెప్పారు. దిల్లీ ఎన్నికల ఫలితాలు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై ప్రజలు ఇచ్చిన తీర్పుకాదన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తమ పార్టీ నాయకులు కొందరు ‘గోలీమారో, ఇండో-పాక్‌ మ్యాచ్‌’ వంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు.

* వంట గ్యాస్ ధరను భారీగా పెంచిన నేపథ్యంలో భాజపాకు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. యూపీఏ హయాం నాటి భాజపా నేతల ఫొటో షేర్‌ చేస్తూ ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యూపీఏ హయాంలో వంట గ్యాస్‌ ధరను పెంచినప్పుడు భాజపా నేతలు స్మృతి ఇరానీ తదితరులు రోడ్లపైకి చేరి గ్యాస్‌ సిలిండర్లతో ఆందోళన చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోను రాహుల్‌ తాజాగా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

* ముచ్చటగా మూడోసారి దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు అరవింద్‌ కేజ్రీవాల్‌ సిద్ధమవుతున్నారు. ఈ నెల 16న చారిత్రక రామ్‌లీలా మైదానంలో అశేష జనవాహిని మధ్య కేజ్రీ ప్రమాణస్వీకారం జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేక అతిథి రానున్నారట. ఎన్నికల ఫలితాల రోజున కేజ్రీవాల్‌ గెటప్‌లో కన్పించి తెగ వైరల్‌ అయిన ‘బేబీ మఫ్లర్‌మ్యాన్‌’ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. ‘సిద్ధంగా ఉండు జూనియర్‌!’ అని చిన్నారికి చెప్పింది.

* బ్రిటన్‌ నూతన ఆర్థిక మంత్రిగా భారత సంతతి వ్యక్తి, ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్‌ గురువారం నియామకం అయ్యారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి సజిద్‌ జావిద్‌ తన పదవికి రాజీనామా చేయడంతో రిషిని తన కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. రిషి సునక్‌ ప్రస్తుతం ట్రెజరీ విభాగానికి ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. భారత సంతతికి చెందిన 39 ఏళ్ల రిషి సునక్‌.. ఇంగ్లాండ్‌లో హాంప్‌షైర్‌ కౌంటీలో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి.. 2014లో రాజకీయాల్లోకి వచ్చారు.

* ప్రజలకు కొత్తదనాన్ని పరిచయం చేయడంతో పాటు కాసులు రాబట్టుకొనే లక్ష్యంతో వినూత్న పథకంతో ముందుకొచ్చింది యూపీలోని నోయిడా మెట్రో. బర్త్‌డే పార్టీ.. ప్రీ వెడ్డింగ్‌.. ఇలాంటి కార్యక్రమాలేవైనా మెట్రో రైలులోనే జరుపుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. గౌతమబుద్ధ నగర్‌ జిల్లాలోని జంట నగరాల మధ్య సేవలందిస్తున్న నోయిడా మెట్రో.. ఇప్పటికే స్టేషన్‌ పరిసరాల్లో సినిమా షూటింగ్‌లు, ఫొటోగ్రఫీలను అనుమతిస్తోంది. తాజాగా మెట్రో రైళ్లలో పుట్టినరోజు వేడుకలు తదితర కార్యక్రమాలు నిర్వహించుకొనే వెసులుబాటును కూడా కల్పించనున్నట్లు పేర్కొంది.

* భారత క్రికెట్లో అత్యుత్తమ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ అని వెటరన్‌ క్రికెటర్‌ సురేశ్ రైనా అన్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్ డ్రస్సింగ్‌ రూమ్‌లో అతడి ప్రభ ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొన్నాడు. ‘ది సూపర్‌ కింగ్స్‌ షో’ అనే కార్యక్రమంలో రైనా తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఒకటి. సారథిగా ఎంఎస్‌ ధోనీ మూడు సార్లు ఆ ఫ్రాంచైజీని విజేతగా నిలిపాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి సురేశ్‌రైనా ఒకప్పుడు పరుగులు వరద పారించిన సంగతి తెలిసిందే.