* భారతీయ బ్యాంకులకు తాను రుణపడిన మొత్తంలో 100 శాతం అసలును తిరిగి తీసుకోవాలని లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యా మరోసారి కోరారు. తనను భారత్‌కు అప్పగించాలని ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మాల్యా వేసిన పిటిషన్‌పై బ్రిటిష్ హైకోర్టులో మూడు రోజుల విచారణ గురువారం పూర్తయ్యింది. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన మాల్యా.. న్యాయస్థానం బయట మీడియాతో మాట్లాడారు. ‘నేను రుణపడిన మొత్తంలో 100శాతం అసలును తక్షణమే తీసుకోవాలని బ్యాంకులను చేతులు జోడించి కోరుతున్నా. నేను ఏ నేరం చేయలేదు. కానీ తీసుకున్న రుణాలు చెల్లించలేదని బ్యాంకులు ఫిర్యాదు చేయడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నా ఆస్తులను అటాచ్ చేసింది. కానీ నేను చెబుతున్నది ఒక్కటే బ్యాంకులు.. దయచేసి మీ డబ్బు మీరు తీసుకోండి’ అని మాల్యా చెప్పుకొచ్చారు. సీబీఐ, ఈడీ అకారణంగా తనపై చర్యలు తీసుకుంటున్నాయని ఆయన మరోసారి ఆరోపించారు. అయితే భారత్‌కు తిరిగెళ్లే యోచన ఉందా అని ప్రశ్నించగా.. ‘నా కుటుంబం ఎక్కడ ఉంటుందో.. నాకు ఎక్కడ ప్రయోజకరంగా ఉంటుందో అక్కడే ఉంటా’ అని మాల్యా సమాధానమిచ్చారు. మాల్యా కేసులో ఏడాదిపాటు విచారణ జరిపిన లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ న్యాయస్థానం.. అతడిని భారత్‌కు అప్పగించాలని 2018 డిసెంబరులో కీలక తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పును మాల్యా బ్రిటిష్ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై గత మంగళవారం నుంచి వాదనలు విన్న న్యాయస్థానం.. త్వరలోనే తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
* తయారీ రంగంలో స్తబ్ధత, ఇతర కారణాలతో మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అనేక ప్రతిపాదనలు చేసింది. అయితే, అవసరమనుకుంటే బడ్జెట్ ప్రకటనలో లేని మరిన్ని చర్యలు తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అస్సెట్ మేనేజ్‌మెంట్, వెల్త్ అడ్వైజరీ, ట్యాక్స్ కన్సల్టెన్సీలకు చెందిన ప్రతినిధులతో శుక్రవారం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈక్విటీ, బాండ్, కరెన్సీ మార్కెట్లపై 2020-21 బడ్జెట్ ప్రభావం సానుకూలంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు అవసరమైతే బడ్జెట్‌లో లేని కొత్త చర్యలు చేపడతామని తెలిపారు.
* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు రానున్న వేళ అందరి దృష్టి వాణిజ్య ఒప్పందంపైనే ఉంది. అయితే సరైన ప్రతిపాదన వస్తే ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలు ట్రంప్ ఇప్పటికే ఇచ్చారు. ఈ నేపథ్యంలో భారత్ కొన్ని ప్రతిపాదనలు ముందుకు తెచ్చినట్లు సమాచారం. కోడి మాంసం, పాల ఉత్పత్తులను భారత మార్కెట్లోకి అనుమతించడానికి సిద్ధమైనట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. పాలఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న మనదేశంలో ప్రస్తుతం దిగుమతులపై పరిమితులు ఉన్నాయి. దాదాపు ఎనిమిది కోట్ల కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నాయి. వీరిని దృష్టిలో ఉంచుకుని దిగుమతులపై ఆంక్షలు విధించారు.
* కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని భావిస్తున్న తుక్కుపాలసీకి సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వస్తోంది. మార్చిలో దీనికి కేబినెట్ అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఆయన నేడు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ 11వ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ మా స్క్రాపింగ్ పాలసీ రూపకల్పన తుదిదశకు చేరింది. మేము కేబినెట్ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాం. వచ్చే నెల లేదా.. 15 రోజుల్లో దీనికి గ్రీన్ సిగ్నల్ లభించవచ్చు’’ అని పేర్కొన్నారు.
* బకాయి పడిన మొత్తాన్ని చెల్లించని టెలికాం కంపెనీలకు టెలి కమ్యూనికేషన్ల డిపార్ట్‌మెంట్ డెడ్‌లైన్ విధించింది. బకాయిలు రాబట్టడంలో విఫలమయ్యారంటూ కేంద్రంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు అర్ధరాత్రి 11.59 గంటల కల్లా బకాయిలను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. సర్కిల్, జోనళ్ల వారీగా టెలికాం శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం ప్రారంభించినట్టు పీటీఐ పేర్కొంది. టెలికం సర్వీసు ప్రొవైడర్లు శుక్రవారం అర్ధరాత్రి కల్లా బకాయిలన్నీ క్లియర్ చేయాలని యూపీ (పశ్చిమ) టెలికం సర్కిల్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి.