Politics

నాకు ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా ఉన్నడో లేడో తెలీదు

Pawan Kalyan Speaks Of His MLA In Mandadam

ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకొని ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మందడంలో రైతులు, మహిళల నిరసనకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రాజధాని మహిళలు తమ సమస్యలను జనసేనానికి వివరించారు. అనంతరం పవన్‌ మాట్లాడుతూ.. అధికార వికేంద్రీకరణపై జగన్‌ ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. పదవిలో లేకుంటే ఒకలా.. ఉంటే మరోలా మాట్లాడతారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధాని ఉద్యమంలో రైతులకు అండగా పోరాటం చేస్తానని పవన్‌ పునరుద్ఘాటించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వైపు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు అమరావతి రైతుల కన్నీళ్లపై రాజధాని వస్తే మాకేం ఆనందం ఉంటుందని అంటున్నారని పవన్‌ చెప్పారు. ‘‘నాకు అధికారం లేదు.. ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఉన్నారో, లేదో తెలియదు. నేను ఓట్ల కోసం రాలేదు.. మీకు ఆసరాగా ఉండాలని వచ్చా. రైతులపై జరిగిన దాడిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాను. నేను ప్రతిరోజూ వార్తల్లో కనిపించే వ్యక్తిని కాదు. పత్రికల్లో కనిపించడం కోసం వార్తలను సృష్టించను.. లేని వార్తలను సృష్టించను. ఉన్న సమస్యను బలంగా వినిపిస్తా. జగన్‌ ఇప్పుడే కళ్లు తెరిచిన పసిపాపలా మాట్లాడుతున్నారు. రాజకీయ క్రీడలో పోలీసులు భాగం కాకూడదు’’ అని పవన్‌ అన్నారు.