DailyDose

దుబాయ్ డబ్బుల కోసం పాతబస్తీలో హత్యలు-నేరవార్తలు

Telugu Crime News Roundup Today-Murders In Old City

* అప్పుడే ఆ వృద్ధుడు ఇంటి నుంచి అలా బయటకు వెళ్లి చాయ్‌ తాగాడు.. అనంతరం ఓ దర్జీ దుకాణంలో కూర్చొన్న అతనికి పోలీసు వాహనాలు వరుసగా వెళ్తూ కనిపించాయి. ఏం జరిగిందోనని ముందుకు కదిలాడు. పోలీసులు తన ఇంటి వైపే వెళ్లేసరికి ఆందోళనకు గురయ్యాడు.. ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు.. ‘నీకు తెలియదా.. ఇంట్లో రెండు హత్యలు జరిగాయి’ అంటూ వారు చెప్పడంతో కుప్పకూలిపోయాడు.. రక్తపు మడుగులో భార్య, కుమార్తె విగతజీవులై కనిపించడంతో శోకానికి అంతులేకుండా పోయింది. చాంద్రాయణగుట్ట తాళ్లకుంటలో శుక్రవారం జరిగిన హత్యలు కలకలం రేపాయి. ఇక్కడ నివసిస్తున్న మహ్మద్‌ హుస్సేన్‌ భార్య షహజాదీబేగం, కుమార్తె ఫరీదాబేగంలు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతమంతా స్థానికులతో నిండిపోయింది. ఈ సందర్భంగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఫరీదాబేగం(32)కు పదహారేళ్ల వయసులోనే దుబాయికి చెందిన అబ్దుల్‌ అలీ బదర్‌తో నిఖా జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు నాసర్‌ అలీ, ఉమ్రా ఫాతిమా ఉన్నారు. భర్త చనిపోవడంతో కుమారుడు దుబాయ్‌లోనే ఉండిపోగా కుమార్తెను తీసుకుని ఫరీదా తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. బ్యుటీషియన్‌ కోర్సు నేర్చుకుని ఎనిమిదేళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం సౌదీఅరేబియాకు వెళ్లింది. అక్కడ మాంసం దుకాణంలో పనిచేసే గుల్బర్గాకు చెందిన మహతాబ్‌ ఖురేషిని ప్రేమవివాహం చేసుకుంది. వారికి కుమార్తె తయ్యబా జన్మించింది.దంపతుల మధ్య గొడవల నేపథ్యంలో ఖురేషి జైలుకెళ్లాడు. తరువాత ఫరీదా స్వదేశానికి వచ్చేసింది. భర్తతో అప్పడప్పుడూ చరవాణిలో మాట్లాడేది. ఫరీదాను నిఖా చేసుకోక ముందే ముంబయిలో ఖురేషికి మొదటిభార్య ఉండడం విశేషం. ఫరీదాతో గొడవల తరువాత బండ్లగూడకు చెందిన జరీనాను నిఖా చేసుకున్నాడు. ప్రస్తుతం అతడి సోదరుడు అబ్దుల్‌ రహమాన్‌ పాతబస్తీలో ఇల్లు కొనమని తన వదిన ఫరీదాకు డబ్బు పంపడం, అనంతరం జరిగిన గొడవలే హత్యలకు కారణమయ్యాయి. రహమాన్‌ పంపిన డబ్బుతో ఘాజిమిల్లత్‌కాలనీలో ఫరీదా తన తల్లి పేరిట కొనేసిన మూడంతస్తుల ఇల్లు వివాదానికి కేంద్రబిందువైంది. ఇల్లు తన పేరిట మార్చకపోవడం, డబ్బు కూడా పూర్తిగా చెల్లించకపోవడంతో రహమాన్‌ చివరకు తన వదినను, ఆమె తల్లిని హత్య చేశాడు. ఆ ఇల్లును అమ్మి డబ్బు చెల్లించేయమని సూచించినా.. తన కూతురు మాట వినలేదని హుస్సేన్‌ వాపోయారు. తమ పోషణకోసం దుబాయ్‌ నుంచి మనవడు నాసర్‌ అలీ నెలకు రూ.50-60 వేలు పంపేవాడని చెప్పాడు. ఫరీదా కుమార్తెలిద్దరూ పాఠశాలకు వెళ్లడంతో క్షేమంగా బయటపడ్డారని.. లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదోనని స్థానికులు తెలిపారు. నిఖా చేసుకున్న రహమాన్‌.. నిందితుడు రహమాన్‌ సౌదీ నుంచి వచ్చి బండ్లగూడ మిల్లత్‌కాలనీలో ఉంటున్నాడు. 4 నెలల క్రితమే నిఖా చేసుకున్నాడు. తన భార్యకు వరుసకు మామ అయిన ముల్తానీ ఖురేషితో కలిసి శుక్రవారం హత్యలు చేశాడు. ఇంటి నుంచే మాంసం కోసే కత్తిని తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తెలిపాడు.

* జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద బ్రదర్ అనిల్ కుమార్ ప్రయాణిస్తున్న కారుకు స్వల్ప ప్రమాదం. కారులో బ్రదర్ అనిల్ కుమార్ తో పాటు గన్ మెన్, డ్రైవర్ ఉన్నారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. ఉదయభాను కారులో బ్రదర్ అనిల్ కుమార్, డ్రైవర్ ,గన్ మెన్ విజయవాడలోనే ఎం జె. నాయుడు హాస్పిటల్ కి తరలింపు. ప్రధమ చికిత్స అనంతరం తన పర్యటన కు వెళ్లిపోయిన బ్రదర్ అనిల్ కుమార్.

* హత్యా రాజకీయాలతో రికార్డుల్లో ఉన్న సూర్యాపేట గ్రామీణ మండలం యార్కారం గ్రామం మరోసారి పాత కక్షలతో భగ్గుమంది. గ్రామ మాజీ సర్పంచి, తెరాస నాయకుడు ఒంటెద్దు వెంకన్న అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యారు. సహకార సంఘ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా కార్యకర్తలతో కలిసి ఉన్న వెంకన్నను ప్రత్యర్థులు తల్వార్లు, గొడ్డళ్లతో వెంబడించారు. ప్రాణభయంతో ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కున్న వెంకన్నను తలుపులు పగులగొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. దీంతో యార్కారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

* వాహనంపై ప్రయాణిస్తూ అలసి నిద్రమత్తులోకి జారుకున్న వ్యక్తి రహదారిపై జారి పడి దుర్మరణం చెందిన వైనమిది. భీమడోలు ఎస్‌ఐ కె.శ్రీహరిరావు కథనం మేరకు వివరాలు… నల్లజర్ల మండలం తెలికిచర్ల గ్రామానికి చెందిన మాచర్ల ఏసు ఒక బ్యాండు ట్రూపులో పనిచేస్తుంటారు. ఇటీవల వరసగా వివాహ శుభముహుర్తాలు ఉండటంతో వివిధ ప్రాంతాలకు బ్యాండు బృందంతో కలసి వెళ్తున్నారు. గురువారం రాత్రి వీరి బృందం ద్వారకా తిరుమలలో జరిగిన ఓ వివాహంలో బ్యాండు వాయించి, శుక్రవారం తెల్లవారుజామున మినీ వ్యానులో(ఐషర్‌) పైభాగంలో కూర్చుని పెదతాడేపల్లిలో జరిగే మరో వివాహ కార్యక్రమానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో పూళ్ల దాటిన తరువాత కోడూరుపాడు పరిధిలోకి వచ్చే పెట్రోలు బంకు సమీపంలో నిద్రమత్తులో ఉన్న ఏసు (32) వాహనం పై నుంచి జారి, రహదారిపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. బృందంలో మిగిలిన సభ్యులు ఈ ప్రమాదాన్ని గమనించకుండా తాడేపల్లిగూడెం వరకు వెళ్లిపోయారు. మృతుడి జేబులోని చరవాణి ద్వారా హైవే పెట్రోలింగు సిబ్బంది వారికి సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య మాచర్ల బాను ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

* పొట్టచేత పట్టుకొని నగరానికి వచ్చిన ఆ తండ్రికి పుత్రశోకమే మిగిలింది. బంగారు భవిష్యత్తు కోసం ఎంచుకున్న పాఠశాలలో మందలింపే ఆయన కుమారుడికి మరణశాసనం రాసింది. వైస్‌ ప్రిన్సిపల్‌, అకౌంటెంట్‌ బెదిరించడంతో భయపడి పాఠశాల భవనం పైనుంచి దూకిన ఓ విద్యార్థి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ ఘటన వివరాలను ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాగేశ్వర్‌రావు ఎస్సార్‌నగర్‌లోని సాయిటవర్స్‌లో కాపలాదారుగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు మహేశ్‌(14) బీకేగూడ సమీపంలోని జయప్రకాశ్‌నగర్‌ విశ్వభారతి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత నెల 29న మహేశ్‌ తరగతి గదిలో అల్లరి చేస్తున్నాడని పాఠశాల వైస్‌ ప్రిన్సిపల్‌తోపాటు అకౌంటెంట్‌ బెదిరించారు. మహేశ్‌తోపాటు మరో ఇద్దరు విద్యార్థులను కొట్టిన వైస్‌ ప్రిన్సిపల్‌ ముగ్గురిని కార్యాలయం వద్ద నిల్చోబెట్టారు. టీసీ ఇచ్చిస్తానని హెచ్చరించారు. ఆ సమయంలో తనకు భోజనం తీసుకొచ్చే తండ్రికి విషయం తెలిసిపోతుందని భయపడ్డ మహేశ్‌.. పాఠశాల భవనంపైకి చేరుకొని మూడో అంతస్తు నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోజు నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.