అప్పుడే స్నానం చేయించిన చిన్నారులు ఎంత ముద్దొస్తుంటారో కదా. మంచులో తడిసిన మల్లెపువ్వుల్లా భలే స్వచ్ఛంగా ఉంటారు. స్నానం చేయించిన తర్వాత హుషారుగా వాళ్లు కాళ్లూ చేతులూ ఆడిస్తుంటే.. ఆ దృశ్యాన్ని చూస్తూ తల్లి కాసేపు ప్రపంచాన్నే మరిచిపోతుంది.. మైమరిచిపోతుంది. ఏ తల్లీ దీనికి మినహాయింపు కాదు. అయితే అలా మురిసిపోవడంతోపాటు స్నానం తర్వాత చేసే కొన్ని పనులు ఉంటాయి. అవేంటో తెలుసుకోండి.
*** పొడిగా ఉంచాలి..
స్నానానికి ముందే అవసరమైన తువాలును పక్కన పెట్టుకోవాలి. స్నానం చేయించగానే వెంటనే తల, మొత్తం శరీరం పొడిగా తుడవాలి. బొద్దుగా ఉండే పిల్లలకు చర్మం అక్కడక్కడా కాస్త మడతలు పడి ఉంటుంది. అక్కడ శుభ్రంగా తుడవకపోతే ఆ తడికి దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. తుడిచిన తర్వాత బుజ్జాయిని మెత్తని తువాలుతో చుట్టేయాలి. ఇది సున్నితంగా ఉండటం వల్ల చర్మానికి ఎలాంటి హాని ఉండదు.
*** తేమగా ఉంచాలి
స్నానం తర్వాత పాపాయి చర్మాన్ని తేమగా ఉంచాలి. సహజసిద్ధమైన బాదాం నూనెను ఒళ్లంతా రాయాలి. లేదా కాస్త వెన్న రాసినా శరీరానికి కావాల్సిన తేమ అందుతుంది. డైపర్ వాడటం వల్ల చర్మం కందితే అక్కడా కాస్త నూనె రాయొచ్చు.
*** గోళ్లు తీసేయాలి
స్నానం చేయించిన తర్వాత చిన్నారుల గోళ్లు కత్తిరించాలి. నీళ్లలో నానడం వల్ల అప్పుడవి మెత్తగా ఉంటాయి. వారానికోసారి తప్పకుండా ఇలా చేయాలి. నెయిల్‌కట్టర్ వాడటం భయమనిపిస్తే నెయిల్‌ఫైల్ వాడొచ్చు.
*** మర్దన సున్నితంగా..
సహజసిద్ధమైన మసాజ్ లోషన్‌తో తల నుంచి పాదాల వరకూ సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. అంతేకాదు తల్లి మధురమైన స్పర్శతో చిన్నారి అంతులేని ఆనందాన్ని పొందుతుంది. ఇప్పుడు నూలుతో తయారుచేసిన డైపర్ తొడిగి, దుస్తులు వేసి చిన్నారిని నిద్రపుచ్చవచ్చు.