Business

జారుడుబల్ల మీద భారత ఎగుమతులు

Indian Export Business On Record Low

దేశం నుంచి జరుగుతున్న ఎగుమతులపై ఆందోళన కొనసాగుతోంది. ఆరు నెలల నుంచీ వృద్ధిలేకపోగా జారుడు బల్లపై (క్షీణ బాటన) ఎగుమతులు కొనసాగుతుండడం దీనికి కారణం. తాజా సమీక్షా నెల– 2020 జనవరిని చూస్తే, 2019 ఇదే నెలతో పోల్చి ఎగుమతులు 1.66 శాతం క్షీణించాయి. విలువలో ఎగుమతుల విలువ 25.97 బిలియన్‌ డాలర్లు. ఇక దేశంలో ఆర్థిక మందగమనాన్ని సూచిస్తూ, దిగుమతులూ వరుసగా ఎనిమిదవ నెల క్షీణ బాటన నిలిచాయి. 0.75 శాతం క్షీణతతో 41.14 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల విలువల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 15.17 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే…
♦ పెట్రోలియం ప్రొడక్ట్స్‌ (–7.42 శాతం), ప్లాస్టిక్‌ – 10.62 శాతం), కార్పెట్‌ (–5.19 శాతం), రత్నాలు (–6.89 శాతం), ఆభరణాలు (–7.5 శాతం) , తోలు ఉత్పత్తుల (–7.4 శాతం) ఎగుమతులు క్షీణతను నమోదుచేసుకున్నాయి.
♦ ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో దాదాపు 18 ప్రతికూల ఫలితాలనే నమోదుచేసుకున్నాయి.
♦ పసిడి దిగుమతులు దాదాపు 9 శాతం పడిపోయి 1.58 బిలియన్‌ డాలర్లకు చేరాయి.
♦ చమురు దిగుమతుల విలువ 15.27 శాతం పెరిగి 12.97 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. చమురేతర దిగుమతుల విలువ 6.72 శాతం పడిపోయి 28.17 బిలయన్‌ డాలర్లకు చేరింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019 ఏప్రిల్‌ నుంచి 2020 జనవరి వరకూ చూస్తే, ఎగుమతులు 1.93 శాతం పడిపోయి 265.26 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులూ క్షీణబాటలోనే పయనించి 8.12 శాతం పతనంతో 398.53 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 133.27 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మరోవైపు డిసెంబర్‌ దేశ సేవల ఎగుమతుల గణాంకాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది. జనవరిలో సేవల ఎగుమతుల విలువ 20 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇదే నెల్లో సేవల దిగుమతుల విలువ 12.56 బిలియన్‌ డాలర్లు.