సమస్య: మా అత్తగారికి 60 ఏళ్లు. చాలాకాలంగా అధిక రక్తపోటు, మధుమేహం, సోరియాసిస్‌తో బాధపడుతున్నారు. నాలుగు నెలల నుంచి మరో కొత్త సమస్య మొదలైంది. ముందు ఎడమ చేయి మణికట్టు, తర్వాత వేళ్లు వాచాయి. అనంతరం కుడి చేయి మణికట్టు, వేళ్లు వాచాయి. నొప్పితో చాలా బాధపడుతున్నారు. సూదులతో పొడిచినట్టు ఆగకుండా నొప్పి వస్తోందనీ చెబుతున్నారు. వస్తువులు పట్టుకోవటమూ కష్టంగా ఉంది. చాలామంది డాక్టర్లకు చూపించాం. నొప్పి మందులు, యాంటీబయోటిక్స్ ఇచ్చారు గానీ ఫలితం కనిపించటం లేదు. ఈ సమస్య ఏంటో, ఎవరిని కలవాలో కూడా తెలియటం లేదు. మాకు తగు సలహా ఇవ్వండి.
సలహా: మీ అత్తగారు చాలాకాలంగా సోరియాసిస్‌తో బాధపడుతున్నారని అంటున్నారు. ఇటీవల కీళ్ల వాపులు, నొప్పులు మొదలయ్యాయని చెబుతున్నారు. వీటిని బట్టి చూస్తుంటే సోరియాసిస్‌తో ముడిపడిన కీళ్లవాతం సమస్యని అనిపిస్తోంది. సోరియాసిస్‌తో బాధపడే కొందరిలో కీళ్ల వాపులూ వస్తుంటాయి. దీన్నే సోరియాటిక్ ఆర్థ్రయిటిస్ అంటారు. ఇందులో మణికట్టు, మోచేయి, మోకీళ్ల వంటి పెద్ద కీళ్లతో పాటు వేళ్ల కీళ్ల వంటి చిన్న కీళ్లూ ప్రభావితం అవుతుంటాయి. వాపు, నొప్పి, కీళ్లు బిగుసుకుపోవటం, సూదులతో పొడుస్తున్నట్టు అనిపించటం వంటివి వేధిస్తుంటాయి. దీన్ని నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. వాపు, నొప్పి అదేపనిగా కొనసాగుతూ వస్తుంటే కీళ్లు దెబ్బతినే ప్రమాదముంది. ముందుగా మీరు నిపుణులైన రుమటాలజిస్ట్ను సంప్రదించడం మంచిది. వాపు, నొప్పి వంటి లక్షణాలను పరిశీలించి అవసరమైన పరీక్షలు చేయిస్తారు. సోరియాటిక్ ఆర్థ్రయిటిస్ బాధితుల రక్తంలో ఆర్ఏ ఫ్యాక్టర్ నెగెటివ్‌గా ఉంటుంది. ఈఎస్ఆర్, సీఆర్పీ ఎక్కువగా ఉండొచ్ఛు వీటిని బట్టి సమస్యను నిర్ధారిస్తారు. అవసరమైతే ఎక్స్‌రే తీయాల్సి ఉంటుంది. కీళ్లవాతానికి సంబంధించిన మార్పులేవైనా ఉన్నా, కీళ్లు దెబ్బతింటున్నా ఇందులో బయటపడుతుంది. సమస్యను నిర్ధారించాక తగు మందులు సూచిస్తారు. సోరియాటిక్ ఆర్థ్రయిటిస్కు ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటితో బాగా ఉపశమనం కలుగుతుంది.