WorldWonders

ఈ కెన్యా గ్రామంలో పురుషులు నిషేధం

Telugu WorldWonders-This Kenyan Village Bans Men From Entering

భారతంలో మహారాణి ప్రమీలా దేవికి ఓ ప్రత్యేక స్థానముంది. ఆమె రాజ్యంలో అందరూ స్త్రీలే. పురుషులకు ప్రవేశం ఉండదు. అయితే ఆమెను జయించి అర్జునుడు పెళ్లి చేసుకుంటాడు అది వేరే కథ. అలాంటి రాజ్యం ఒకటి కెన్యాలో ఉంది. అదో కుగ్రామం. 1990లో ఈ గ్రామాన్ని కేవలం మహిళల కోసం ఏర్పాటు చేసింది రెబెకా. ఈమె నంబూరు తెగకు చెందినది. ఉమోజా పేరుతో గ్రామ నిరాణానికి శ్రీకారం చుట్టింది. ఈ గ్రామం స్త్రీల పాలిట స్వర్గం. ఇక్కడ మగవాళ్ల వేధింపులు, అత్యాచారాలు, గృహహింసలు ఉండవు. ఒకప్పుడు అక్కడ మగవాళ్లు చేసే దుర్మార్గాలకు అంతులేకుండా ఉండేది. ఒక సందర్భంలో రెబెకా పైన కొందరు దాడి చేసి కొడుతూ ఉంటే ఆమె భర్త చూస్తూ ఉన్నాడట. కనీసం అడ్డుకోలేదట. దాంతో రెబెకాకు ఒళ్లు మండిపోయి అసలీ మగవాళ్ల అండ, పెత్తనం తనకు అక్కరలేదనుకుంది. పురుషులు లేని కొత్త నివాసం ఏర్పరుచుకోవాలని నిర్ణయించి ఈ గ్రామ నిర్మాణానికి పునాదులు వేసింది. వితుంతువులు, భర్త వదిలేసిన ఒంటరి స్త్రీలు గ్రామం వైపు అడుగులు వేశారు. మొత్తం అలాంటి బాధితులతోనే ఉమోజా గ్రామ నిర్మాణం జరిగింది. గ్రామం ఏర్పాడ్డాక అత్యాచార బాధితులు, గృహహింసకు లోనైనవాళ్లు, పెళ్లి వద్దనుకునే వాళ్లు, వితంతువులు, అనాథలైన ఆడపిల్లలు …వీరంతా ఈ గ్రామంలోకి అడుగుపెట్టి గ్రామానికో రూపం తీసుకువచ్చారు. ఊరికే బాధపడుతూ కూర్చునేందుకు రాలేదు ఈ ఆడవాళ్లంతా. వాళ్ల కాళ్లపైన వాళ్లు నిలబడేందుకు రకరకాల వృత్తులు చేపట్టారు. ఆభరణాల తయారీ మొదలు పెట్టారు. గ్రామంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. చక్కని ఇళ్లు కట్టుకున్నారు ఆడవాళ్లు. పిల్లలు చదువుకునేందుకు పాఠశాల ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ల చుట్టూ ఇప్పుడు సంతోషం మాత్రమే ఉంది. చక్కని వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఇతర గ్రామ కార్యకలాపాల కోసం చక్కని కమ్యూనిటీ సెంటర్ నిర్మించుకున్నారు. అలాగే ఈ గ్రామానికి పురుషులు ప్రవేశించకుండా మంచి పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. సాయుధులైన స్త్రీలు ఈ గ్రామాన్ని కాపలా కాస్తారు. ఈ గ్రామం ప్రత్యేకతలు ప్రపంచాన్ని ఏనాడో ఆకర్షించాయి. స్త్రీలకే ప్రత్యేకమైన ఉమోజా గ్రామం ఇప్పుడొక పర్యాటక కేంద్రం. మగవాళ్లకు అనుమతి లేని కారణంగా ఊరు చూసేందుకు వచ్చే పర్యాటకులను మాత్రం కొన్ని షరతుల పైన గ్రామంలోకి రానిస్తారు. ఎందరో విదేశీయులు ఈ గ్రామంలో స్త్రీలు తయారు చేసిన అందమైన ఆభరణాలు కొంటారు. తమ కోసం తామే నిర్మించుకున్న ఈ ఆడవాళ్ల స్వర్గం అందరికీ కనువిందు చేస్తోంది.