Movies

కలెక్టర్ నోట…”చించావు పో!”

Jagityal Collector Twitter Comments-Police Investigation Under Progress

జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి ట్విటర్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఖాతా నుంచి హీరోయిన్ రష్మికా మండన్నా ఫోటోకు ‘చించావు పో’ అని కామెంట్ పెట్టడం సంచలనం రేపుతోంది. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ట్విటర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని, హీరోయిన్ ఫోటోపై కామెంట్లు తాను చేయలేదని వివరణ ఇచ్చారు. తన ట్విటర్ ఖాతా హ్యాక్ గురించి వెంటనే విచారణ జరిపించాలని కలెక్టర్ పోలీసులను కోరారు. జగిత్యాల కలెక్టర్ ఖాతా నుంచి రష్మిక మండన్నా ఫోటోకు కామెంట్ రావడంపై నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఒక బాధ్యతగల స్థానంలో ఉన్న వ్యక్తి హీరోయిన్ ఫోటోకు ఇలా వ్యాఖ్యలు రాయడమేంటని కామెంట్లు రాశారు. గమనించిన కలెక్టర్ ఇది తాను చేసిన పని కాదని స్పష్టత ఇచ్చారు. అయితే, కలెక్టర్ ట్విటర్ ఖాతాను ఎవరు హ్యాక్ చేసి ఉంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. కొద్ది రోజుల క్రితం జరిగిన భీష్మ ప్రీ రిలీజ్ కార్యక్రమం సందర్భంగా ఆ చిత్ర హీరోయిన్ రష్మిక మండన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముందు ఆమె ఓ ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. లాంగ్ లెంగ్త్ స్కర్ట్‌లో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను ఆమె తన ట్విటర్‌ ఖాతాలో తన అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆ ఫోటోలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ ఖాతా నుంచి ‘చించావు పో’ అనే కామెంట్ వచ్చింది. వెంటనే అందరూ ఆశ్చర్యపోవడంతో విషయం గుర్తించిన కలెక్టర్.. తన ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణం విచారణ జరిపించాలని ఆదేశించారు.