దేశంలో ఓ వైపు జనాభా పెరిగిపోతుంటే.. మరోవైపు ఆహారాన్ని వృథా చేయడం పెద్ద సమస్యగా మారింది. ఏటా 6 కోట్ల టన్నులకు పైగా ఆహారాన్ని నేలపాలు చేస్తున్నారు. దీని విలువ బిహార్ రాష్ట్రంలో ప్రజల ఏడాది తిండికి సమానమని అంచనా.. ఈ లెక్కన మనం ఎంతమేరకు తినే ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు?.. ఈ విషయంపై విశ్లేషకుల అభిప్రాయాలు తెలుసుకుందాం.’అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని కళ్లకద్దుకునే మన దేశంలోనే- తినే తిండిని చెత్తకుప్పల్లోకి విసిరేయడం అలవాటుగా మారింది. భూగ్రహంపై చాలామందికి ఆహారం దొరుకుతోంది. కానీ, ఆకలితో అలమటించే కోట్లమందికి రోజూ తిండి కచ్చితంగా దొరికే వరం కాదు. మన దేశంలో ఏటా 6.7 కోట్ల టన్నుల మేర ఆహారం వృథా అవుతోంది. దీని విలువ బిహారు రాష్ట్రంలో ప్రజల ఏడాది తిండికి సమానమని అంచనా. మొత్తం బ్రిటన్ దేశం తినడానికి సరిపోయే ఆహారాన్ని భారతీయులు వృథా చేస్తుంటారనేది మరో లెక్క. వివాహాలు, భారీ పార్టీల్లో వృథా తీవ్రంగానే ఉన్నా- డబ్బులు తీసుకుని తిండిపెట్టే హోటళ్లు, రెస్టారెంట్లలో సైతం ఈ సమస్య ఉండటం గమనార్హం. ఆహార వృథా అనేది ఇప్పుడు మన దేశంలో ఆందోళనకర సమస్యగా పరిణమించింది. మనం ఏ స్థాయిలో తిండిని నేలపాలు చేస్తామనేందుకు- మన వీధులు, వాటి చివర ఉండే చెత్తకుండీలు, గుంతలే సజీవ సాక్ష్యాలు. పెళ్లిళ్లు, క్యాంటీన్లు, హోటళ్లు, కుటుంబపరమైన శుభకార్యాలు, సామాజిక వేడుకలు… ఇవన్నీ పెద్ద మొత్తంలో ఆహారాన్ని వృథా చేసే వేదికలవుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అధ్యయనం ప్రకారం, భారత్‌లో ఉత్పత్తయ్యే ఆహారంలో 40 శాతం వృథా అవుతోంది. సుమారు 2.1 కోట్ల మెట్రిక్ టన్నుల గోధుమలు ముక్కిపోతున్నాయి. ఇది ఓ ఏడాదిలో ఆస్ట్రేలియాలో పండే గోధుమ ఉత్పత్తికి సమానం. ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) గణాంకాల ప్రకారం- మొత్తం ప్రపంచ ఆహార ఉత్పత్తిలో మూడింట ఒక వంతు వృథా అవుతోంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారమే. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ, పౌల్ట్రీ, పాడి ఉత్పత్తుల వృథాలో భారత్ ఏడో స్థానంలో నిలుస్తోంది. ప్రపంచంలో జనాభాకు సరిపడా భారీ స్థాయిలో ఆహార ఉత్పత్తి జరుగుతున్నా, వృథా కారణంగా కోట్లమంది పోషకాహార లేమితో సతమతమవుతుండటం విచారకరం. ‘భూక్’ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనం ప్రకారం భారత్‌లో రోజూ సుమారు 20 కోట్లమందికిపైగా పేదలు పస్తులతోనే నిద్రిస్తున్నారు. అందువల్లే ఆహారంపట్ల, పండిస్తున్న రైతులపట్ల, ఆహారోత్పత్తికి వినియోగిస్తున్న ప్రకృతి వనరుల పట్ల, తిండికి లేక అలమటించే జనం పట్ల గౌరవాన్ని పెంపొందించాలని ఎఫ్ఏఓ లక్ష్యంగా పెట్టుకుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని చేరుకోవాలన్నా, ఆకలి లేని ప్రపంచాన్ని సృష్టించాలన్నా ఆహార వృథాను తగ్గించడమే శరణ్యం.సమస్య ఎక్కుడ?ఒక పక్క దేశంలో లక్షల మందికి నేటికీ గుక్కెడు తాగునీరైనా అందడం లేదు; 25 శాతం నీటిని ఉపయోగించి ఉత్పత్తి చేస్తున్న ఆహారం మట్టికుప్పల పాలవుతోంది. ఆహార వృథా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపైనా పడుతుందన్న సంగతిని చాలామంది అర్థం చేసుకోవడం లేదు. మనం ఆహారాన్ని పారేస్తున్నట్లయితే- వ్యవసాయం కోసం వాడే భారీమొత్తం నీటిని, మానవ వనరుల్ని, ఆహార పరిశ్రమలో ఉపయోగించే విద్యుత్తును, సాగు భూముల కోసం కొట్టేసే వృక్ష సంపదను పోగొట్టుకుంటున్నట్లే. ఇలాంటి వాటన్నింటినీ పరిణగనలోకి తీసుకుంటే, భారత్‌లో ఏటా ఆహార వృథా ద్వారా జరుగుతున్న నష్టం విలువ సుమారు రూ.58 వేలకోట్ల నుంచి రూ.96 వేలకోట్ల దాకా ఉంటుంది. ఆహారాన్ని పండించేందుకు వందల ఎకరాల అటవీ భూమిలో వృక్షాలు నరికివేతకు గురవుతున్నాయి. దీనివల్ల దేశంలోని 45 శాతందాకా భూమి క్షీణత చెందుతోంది. సాగు కోసం భూగర్భ జలాల్నీ పిండేసి, భూమిని పిప్పి చేస్తున్నాం. మనదేశంలో మూడో అతిపెద్ద దిగుమతి సరకు వంటనూనె. ఆహార పదార్థాల తయారీకి కోట్ల బ్యారెళ్ల ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాం. ఇలా అత్యంత భారీస్థాయిలో విలువైన వనరుల్ని ఖర్చుపెడుతూ ఉత్పత్తి చేసిన ఆహార పదార్థాల్ని వృథాగా పారబోస్తుండటం ఏ రకమైన విజ్ఞత అనేది అందరూ ప్రశ్నించుకోవాలి!మన దేశంలో అనునిత్యం ఆహార పదార్థాల ధరలు భగ్గుమంటూనే ఉంటాయి. ధరలు మండిపోతుంటే తినేదెలాగంటూ గల్లీ నుంచి దిల్లీ దాకా గొంతెత్తి ప్రశ్నించడమూ పరిపాటి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడానికి అనేక కారణాల్లో ఆహార వృథా కూడా ఒకటన్న సంగతి గుర్తుంచుకోవాలి. వృథా తగ్గిస్తే సరకులకు గిరాకీ తగ్గుతుంది. ఫలితంగా ధరలూ దిగొస్తాయి. ఇదంతా ప్రజల చేతుల్లోనే ఉంది. ఆహారాన్ని చెత్తపాలు చేస్తున్నామంటే పరోక్షంగా పేదవాళ్ల కడుపు కొడుతున్నామనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఆహారాన్ని పారేయడమంటే- పేదలు, ఆకలితో అలమటించేవారి కంచంలోని అన్నాన్ని లాక్కున్నట్లే అని పేర్కొన్న పోప్ ఫ్రాన్సిస్ మాటల్ని గుర్తుకుతెచ్చుకోవాలి. ఆహార వృథా సమస్య మన భవిష్యత్తునూ నిర్దేశించే అంశం. గుట్టలుగా పేరుకుపోయే ఆహార వ్యర్థాలు, కుళ్లిన కూరగాయలు విష వాయువుల్ని సృష్టిస్తాయి. పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. బహిరంగంగా గోతుల్లో పారవేసే ఆహార వ్యర్థాలు మీథేన్ ఉత్పత్తికి దారి తీస్తాయి. ఇది సూర్యరశ్మిని అధికంగా గ్రహించి వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. ఫలితంగా భూతాపానికి కారణమవుతుంది. మీథేన్‌తో అగ్గిరాజుకోవడం, పేలుళ్లు సంభవించడం వంటి సమస్యలూ ఉంటాయి. కుళ్లిన ఆహార వ్యర్థాల నుంచి పలు హానికర రసాయనాలు ఉద్భవిస్తాయి. ఇవి నేలలోకి ఇంకడం వల్ల భూగర్భ జలాలు విషతుల్యమవుతాయి. నేలపై ఎక్కడపడితే అక్కడ పారేసే ఆహార వ్యర్థాలు మురుగునీటి కాలువలు పూడుకుపోవడానికి; నీరు, నేల కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఈ లెక్కన ఆహారాన్ని కుళ్లబెట్టడం ద్వారా మనం ప్రకృతికీ ద్రోహం చేస్తున్నట్లే!ఒక్కో అడుగే పడుతోంది…మానవ వినియోగం కోసం ఉత్పత్తి చేస్తున్న ఆహారంలో ప్రపంచవ్యాప్తంగా ఏటా మూడింట ఒక వంతు వృథా జరుగుతోందని 2011లో ఎఫ్ఏఓ స్పష్టం చేసింది. అప్పటినుంచి ఈ సమస్యపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలతో కలిసి అవగాహన పెంచే కార్యక్రమాల్ని ఎఫ్ఏఓ చేపట్టింది. గత అయిదారేళ్లలో కొంత అవగాహన పెరిగి వృథా నివారణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఫ్రాన్స్‌లో సూపర్ మార్కెట్లు తమ దుకాణాల్లో అమ్ముడుపోని పదార్థాల్ని దానం చేయాలని, రైతులకిచ్చి ఎరువుల్లా మార్చేందుకు తోడ్పడాలనే నిబంధనను తప్పనిసరి చేశారు. కెనడాలో ఉత్పత్తిదారులు, చిల్లర వర్తకులు, రెస్టారెంట్ల నుంచి వాడని సరకుల్ని సేకరించి రోజుకు 22 వేల భోజనాల తయారీకి ఉపయోగిస్తారు. స్వీడన్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఇంధనంగా మార్చే పునరుత్పాదక ప్రక్రియ పెద్దయెత్తున సాగుతోంది. సౌదీ అరేబియాలో కొన్ని రెస్టారెంట్లలో ఆహారాన్ని వదిలేస్తే అపరాధ రుసుము చెల్లించాల్సిందే. హాంకాంగ్‌లోనూ ఈ తరహా ఏర్పాట్లున్నాయి. ఫిలిప్పీన్స్‌లో రవాణా, నిల్వ ప్రక్రియల్లో వరి, బియ్యం వంటి సరకులకు నష్టం వాటిల్లకుండా ప్రత్యేక సంచుల్ని రూపొందించారు. పశ్చిమ ఆఫ్రికాలో పండ్లు, కూరగాయల నిల్వ స్థాయిని పెంచేందుకు సౌర డ్రయర్లను ఉపయోగిస్తున్నారు. సురక్షిత నిల్వ కోసం వాక్యూమ్ ప్యాకింగ్, నైట్రోజన్ ఫ్లషింగ్ తదితర ప్యాకింగ్ పరిజ్ఞానాల్నీ వాడుతున్నారు. మన దేశంలో కొన్ని రెస్టారెంట్లు ఆహార వృథాను అరికట్టేందుకు ప్రత్యేకంగా కృషిచేస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు వంటిచోట్ల మిగిలే ఆహారాన్ని వెనువెంటనే సేకరించి అనాథలకు పంచిపెట్టే దిశగా మహానగరాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ బహిరంగ ప్రదేశాల్లో రిఫ్రిజిరేటర్లనూ ఏర్పాటు చేసింది. వీటిలో మిగిలిపోయే ఆహారాన్ని ఉంచవచ్చు. అవసరమైన వారు తీసుకొని తినవచ్చు.రవాణా పరంగా సరఫరా వ్యవస్థలో అవాంతరాలతోనూ ఆహార వృథా సమస్య తలెత్తుతోంది. ఇందుకోసం సరఫరా వ్యవస్థలోని ప్రతి దశలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. త్వరగా పాడయ్యే పదార్థాల రవాణాకు సంబంధించి కంటెయినర్ పరిజ్ఞానంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పుల్ని ప్రవేశపెట్టాలి. వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రపంచ నలుదిశలకూ సమర్థంగా చేర్చగలిగే సామర్థ్యాన్ని ఇనుమడింపజేయాలి. శీతల రవాణా వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలి. రవాణాలో వృథాను అరికట్టడం, నిల్వ సౌకర్యాలు, ఆహార శుద్ధిని మెరుగుపరచడం వంటి చర్యల్ని ప్రభుత్వపరంగా తీసుకోవాల్సి ఉంది. మిగిలే ఆహారాన్ని ఇంధనంగా మార్చుకోవచ్చు. భారతీయ ఆతిథ్య రంగం ఈ దిశగా కృషిచేయాలి. ఆహార వ్యర్థాల నుంచి ఎరువుల తయారీకి యత్నించాలి. హోటళ్లు ఎప్పటికప్పుడు ఆహార వృథాను మదింపు చేయడం ద్వారా వాస్తవాల్ని గ్రహించాలి. వేడుకల వద్ద మిగిలిపోయే ఆహారాన్ని తీసుకెళ్లే స్వచ్ఛంద సంస్థల వివరాల్ని అందరికీ అందుబాటులో ఉంచాలి. కుటుంబాల పరంగా అవసరం ఉన్నంతే కొనాలి, తినగలిగేంతే వండాలి. నిల్వ సామర్థ్యం ఉండే పదార్థాలనే కొనాలి. త్వరగా పాడయ్యే వాటిని తక్కువగా తెచ్చుకోవాలి. ఆహారం విలువ, పర్యావరణంపై వృథా ప్రభావం గురించి చిన్నారులకు అవగాహన కల్పించాలి. తిన్న తరవాత కంచం ఖాళీగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఇది పిల్లలకూ నేర్పాలి. ఈ తరహా ఆర్థిక, సామాజిక తరహా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ విధానాలు మాత్రమే కాకుండా వ్యక్తి స్థాయిలో మార్పు మొదలు కావాలి!
ఏపీ, తెలంగాణల్లో ఒక్కో ప్రధాన నగరంలో రోజూ వృథా అవుతున్న ఆహారం సుమారు 10-20 మెట్రిక్ టన్నులు.*పట్టణాల్లో కొనే సరకుల్లో 20 శాతం చెత్తలోకి చేరుతున్నాయి.*నగరాల్లోని మధ్యతరగతి కుటుంబం వృథా చేసే ఆహారం విలువ నెలకు రెండు వేల రూపాయలు.*గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉత్పత్తయ్యే చెత్తలో 2,600 టన్నులు ఆహార పదార్థాలకు సంబంధించినదే.*విజయవాడలో రోజుకు 550 మెట్రిక్ టన్నుల చెత్త విడుదలవుతుండగా, ఇందులో పది మెట్రిక్ టన్నులు ఆహార వృథాయే.*వివిధ రకాల వేడుకల్లో వడ్డిస్తున్న ఆహార పదార్థాల సంఖ్య 20 నుంచి 100 వరకు ఉంటోంది.*వివాహం వంటి వేడుకలో అతిథులు కంచంలో వేసుకుని వదిలేసే ఆహారం 10 నుంచి 20 శాతం ఉంటుందని అంచనా