* చంద్రబాబుకు విశాఖ పర్యటనలో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చంద్రబాబును అడ్డుకున్నాయి. అంతకు ముందు చంద్రబాబు కాన్వాయ్ మీద కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. దీనిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లోకేష్ స్పందించారు. జగన్ విశాఖలో అడుగు పెడితే అరాచకం ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పడానికి ఇది ట్రైలర్ అంటూ విమర్శలు గుప్పించారు. ‘మూడు ముక్కలాట మొదలు పెట్టి సగం చచ్చారు. ప్రతిపక్ష నేత యాత్రని అడ్డుకునేందుకు గొయ్యి తవ్వి పూర్తిగా చచ్చారు. వైకాపా డిఎన్ఏ లో ఉన్న దుర్మార్గం, దౌర్జన్యం, దాడులు విశాఖ లో బయటపడ్డాయి. జగన్ విశాఖలో అడుగుపెడితే ఉత్తరాంధ్రలో అరాచకం ఏ రేంజ్ లో ఉంటుందో వైసీపీ ఈ రోజు ట్రైలర్ చూపించింది. ప్రతిపక్ష నేతపై ఈ రోజు గుడ్లు, టొమేటోలు రేపు ప్రజల పై బాంబులు, కత్తులతో దిగుతుంది వైసీపీ రౌడీ బ్యాచ్.’ అని ట్వీట్ చేశారు.
* కేరళలో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ జూలీ అమ్మా జోసెఫ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం కోజికోడ్ జైలులో ఉన్న ఆమె గురువారం ఉదయం చేతిని కోసుకుంది. దీంతో జైలు అధికారులు చికిత్స నిమిత్తం జూలీని కోజికోడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో తరలించారు. అయితే ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా ఆస్తి కోసం 14 ఏళ్ల వ్యవధిలో సొంత కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల్ని జూలీ హతమార్చింది. అంతేకాకుండా కట్టుకున్న భర్త రాయ్ థామస్‌ను కూడా ఆమె దారుణంగా హతమార్చి, ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు కట్టుకథ అల్లింది. అయితే కుటుంబసభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో రాయ్ థామస్ సోదరుడు మోజోకు అనుమానం వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూలీ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, విచారణలో నమ్మలేని వెలుగు చూశాయి. రాయ్ థామస్ సైనైడ్ ప్రయోగంతో చనిపోయినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మిగతా ఐదుగురి మరణాలపై పోలీసులు దర్యాప్తును కొనసాగించగా వారుకూడా సైనైడ్ ప్రయోగంతోనే ప్రాణాలు విడిచారని తేలింది. ఈ మరణాలన్నింటికీ ప్రధాన సాక్షిగా భావించిన పోలీసులు జూలీని విచారించగా ఒక్కొక్కటిగా ఆమె అరాచకాలు బయటపడ్డాయి. దీంతో జూలీతో పాటు ఆమె రెండో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
* 2017లో ఏపీలో కర్నూలు ప్రీతిబాయి కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే తాజాగా.. ప్రీతిబాయి అనుమానాస్పద మృతి కేసులో పురోగతి లభించింది. ప్రీతిబాయి కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో నెం.37ను ప్రభుత్వం విడుదల చేసింది. కేసును సీబీఐకి అప్పజెప్పడంతో ప్రీతి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
* ఓ తమిళ నటికి డెలివరీ బాయ్ చుక్కలు చూపించాడు. ఆమె పట్ల నీచానికి ఒడిగట్టాడు. అడల్ట్ గ్రూప్స్‌లో సెల్‌ఫోన్ నెంబర్ షేర్ చేసి అల్లరిపాలు జేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది. ఈనెల 9న చెన్నైలోని తన ఇంటికి డోమినోస్ డెలివరీ బాయ్ పిజ్జా తీసుకుని వచ్చాడని గాయత్రి సాయి తెలిపారు. అనంతరం అతడు తన ఫోన్ నెంబర్‌ను అడల్ట్ గ్రూప్స్‌లో షేర్ చేశాడని చెప్పారు. దీంతో విపరీతమైన ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయని గాయత్రి వాపోయారు. ఫోన్ కాల్స్‌తో విసుగెత్తిన ఆమె… తనకు సాయం చేయాల్సిందిగా తమిళనాడు పోలీసులను కోరారు. తన నెంబర్ ఇతరులకు షేర్ చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వాట్సాప్ మెసేజ్‌లను స్ర్కీన్ షాట్‌లను ఆమె ట్విటర్‌లో కూడా ఉంచారు. వాటితో పాటు పిజ్జా డెలివరీ బాయ్ ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు.