* వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.43,050, విజయవాడలో రూ.43,100, విశాఖపట్నంలో రూ.43,890, ప్రొద్దుటూరులో రూ.43,100, చెన్నైలో రూ.42,840గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.41,030, విజయవాడలో రూ.39,900, విశాఖపట్నంలో రూ.40,370, ప్రొద్దుటూరులో రూ.39,960, చెన్నైలో రూ.40,800గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.47,000, విజయవాడలో రూ.49,000, విశాఖపట్నంలో రూ.48,500, ప్రొద్దుటూరులో రూ.48,500, చెన్నైలో రూ.51,400 వద్ద ముగిసింది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ సూచీ 40వేల మార్కును దిగజారడం గమనార్హం. మార్కెట్లు ముగిసే సమాయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 143 పాయింట్లు నష్టపోయి 39,745 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 11,633 వద్ద ముగిసింది. యూఎస్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.62 వద్ద కొనసాగుతోంది. కరోనా భయాలు ఇంకా అంతర్జాతీయ మార్కెట్లను వెంటాడుతుండటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కొనసాగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నిఫ్టీలో సన్ ఫార్మా, భారతీ ఇన్‌ఫ్రాటెల్, టైటాన్, గ్రాసిమ్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో పయనించగా.. విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఓఎన్జీసీ, ఐఓసీఎల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
* ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బీఎస్-6 ప్రమాణాలతో కూడిన సూపర్ స్ప్లెండర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.67,300 (ఎక్స్ షోరూం-దిల్లీ)గా నిర్ణయించింది. 125సీసీ ఫ్యూయల్ ఇంజక్షన్ ఇంజిన్ 10.73 బీహెచ్‌పీని ఉత్పత్తి చేస్తుంది.
* ప్రపంచ ధనవంతుల జాబితాలోని తొలి పది స్థానాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఛైర్మన్ ముకేశ్ అంబానీ వరుసగా రెండోసారీ స్థానం దక్కించుకున్నారు. ఆసియా, భారత్‌లో అపర కుబేరుడిగా నిలిచారు. 2019కి సంబంధించి హురూన్ విడుదల చేసిన తొమ్మిదో విడత ‘అంతర్జాతీయ ధనవంతుల జాబితా 2020’లో ఆయన సంపద 13 బిలియన్ డాలర్లు పెరిగి, 67 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.4.8 లక్షల కోట్లు) చేరడంతో 9వ స్థానంలో నిలిచారు. దీని ప్రకారం, ఆయన గంటకు రూ.7 కోట్లు సంపాదిస్తున్నట్లు లెక్క తేల్చారు. ఆయనతో పాటు ఈ జాబితాలో 34 మంది కొత్తవారు (భారతీయులు) జాబితాలోకి చేరారు. దీంతో మన బిలియనీర్ల సంఖ్య 138కి చేరింది. భారత సంతతికి చెంది ఇతర దేశాల్లో ఉన్న వారిని కూడా కలిపితే ఆ సంఖ్య 170కి పెరిగింది. 1 బిలియన్ డాలర్లు (రూ.7,100 కోట్లు) అంతకంటే ఎక్కువ మొత్తం సంపద కలిగిన వారి జాబితాను హురూన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 2,817 మంది ఉన్నారు. కొత్తగా జాబితాలోకి 480 మంది వచ్చి చేరారు. ఈ లెక్కన ప్రతి రోజూ ఒకరి కంటే ఎక్కువ మంది బిలియనీర్లు పుట్టుకొచ్చారు. చైనా నుంచి 799 మంది, అమెరికా నుంచి 626 మంది జాబితాలో ఉన్నారు. ఈ దేశాల తర్వాత భారత్ 138 మందితో మూడో స్థానంలో ఉంది. జాబితాలో తొలి 100 మందిలో మన దేశం నుంచి ముకేశ్ అంబానీతో పాటు గౌతమ్ అదానీ, శివ్ నాడార్ (కుటుంబం) చెరో 17 బిలియన్ డాలర్ల సంపదతో 68వ స్థానం దక్కించుకున్నారు. కోటక్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ 15 బి.డాలర్ల (రూ.లక్ష కోట్లు) సంపదతో 91వ స్థానంలో ఉన్నారు.
* ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిత్తల్ అధ్యక్షుడు, సీఎఫ్‌ఓ ఆదిత్య నివాస్ మిత్తల్ (ఛైర్మన్ లక్ష్మీ నివాస్ మిత్తల్ కుమారుడు) బుధవారం విశాఖపట్నంలోని ఆర్సెలర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా (ఏఎంఎన్‌ఎస్ ఇండియా)ను సందర్శించారు. ప్లాంట్ పనితీరు, వసతులను పరిశీలించారు. అనంతరం విశాఖపట్నం ఓడరేవును సందర్శించిన ఆదిత్య మిత్తల్‌కు విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఉప ఛైర్మన్ పీఎల్ హరనాథ్ సాదర స్వాగతం పలికారు. పోర్టులో జరుగుతున్న కార్యకలాపాలపై ఆదిత్య నివాస్ మిత్తల్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు పోర్టు వర్గాలు తెలిపాయి.