1. కాణిపాకం రథానికి బంగారు తాపడం – ఆద్యాత్మికం- 28/02
* కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం రథానికి బంగారు తాపడం చేయనున్నారు. ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు చెందిన 15 కిలోల బంగారాన్ని వినియోగించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. గత డిసెంబరు 28న జరిగిన సమావేశంలో తితిదే పాలక మండలి దీనిపై తీర్మానం చేసింది. దీనికి అనుమతిస్తూ రెవెన్యూ (దేవాదాయ) శాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి ఆదేశాలు జారీచేశారు. ఈ బంగారం ఎంత విలువ చేస్తుందో, ఆ మొత్తం తితిదేకు చెల్లిస్తారు.
*తితిదే బడ్జెట్ అంచనాల సవరణకు ఆమోదం
తితిదే 2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బడ్జెట్ అంచనాల సవరణకు తితిదే పాలకమండలి ఆమోదం తెలిపి ప్రభుత్వానికి కొంతకాలం కిందట పంపింది.
2.యాదాద్రిలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
యాదాద్రి పుణ్యక్షేత్రంలో బుధవారం సంప్రదాయ పర్వాల మధ్య వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. 11 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలను విష్వక్సేన ఆళ్వారుకు ఆది పూజలు నిర్వహించి శ్రీకారం చుట్టారు. ఆరాధన పర్వాలు చేపట్టి హవనంతో జలాన్ని పూజించారు. ఆ జలంతో ఆలయాన్ని శుద్ధి చేశారు. రాత్రి పుట్టమట్టి తెచ్చి నవధాన్యాలతో ఉత్సవాలకు అంకురార్పణ జరిపారు.
3.మేడారం జాతర ఆదాయం రూ.11.64 కోట్లు-పూర్తయిన హుండీల లెక్కింపు
మేడారం జాతరలో భాగంగా ఏర్పాటుచేసిన హుండీల ఆదాయం లెక్కింపు ప్రక్రియ బుధవారంతో పూర్తి అయింది. మొత్తం రూ.11,64,61,774 ఆదాయం సమకూరినట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామల సునీత, మేడారం దేవాలయ కార్యనిర్వహణ అధికారి రాజేంద్రం విలేకరులకు తెలిపారు. దీంతోపాటు 1.064 కిలోల బంగారు కానుకలు, 53.45 కిలోల వెండి ఆభరణాలు వచ్చాయన్నారు. 29 దేశాలకు చెందిన 548 కరెన్సీ నోట్లను సైతం భక్తులు కానుకగా సమర్పించినట్లు తెలిపారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన 502 హుండీల లెక్కింపును ఈ నెల 12న హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో ప్రారంభించినట్లు వారు చెప్పారు.
4.చిల్లర నాణేలను వినియోగంలోకి తేవాలి-తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి
శ్రీవారి హుండీ ద్వారా ప్రతినెల రూ.5 కోట్ల నాణేలు కానుకలుగా అందుతున్నాయి. వీటిని తితిదే బ్యాంకులకు పంపిస్తోంది. అక్కడి నుంచి వ్యాపారులు తీసుకొని.. తిరిగి దుకాణాల్లో లావాదేవీలకు వాడుకోవాలి. చిల్లర నాణేలను వినియోగంలోకి తెచ్చి.. దేవస్థానం వద్ద నిల్వలు పోగుపడకుండా సహకరించాలి’ అని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తిరుమలలోని వ్యాపారులకు సూచించారు. బుధవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో బ్యాంకుల అధికారులు, దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల లండన్‌కు చెందిన నిపుణులు తిరుమలలోని జలప్రసాదాల్లో అందిస్తున్న తాగునీటి నాణ్యతను పరీక్షించి ప్రపంచస్థాయి ప్రమాణాలు ఉన్నాయని ధ్రువీకరించారని, భక్తులు ఈ నీటినే తాగాలని సూచించారు.
5. పంచాంగము 28.02.2020
సంవత్సరం: వికారి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: ఫాల్గుణ
పక్షం: శుక్ల
తిథి: చమి రా.తె.05:13 వరకు
తదుపరి షష్ఠి
వారం : శుక్రవారం (భృగు వాసరే)
నక్షత్రం: అశ్విని రా.01:18 వరకు
తదుపరి భరణి
యోగం: శుక్ల ఉ.11:19 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: బవ ఉ.06:44 వరకు
తదుపరి కౌలవ
వర్జ్యం: రా.08:55 – 10:40
దుర్ముహూర్తం: 08:56 – 09:43
మరియు 12:52 – 01:39
రాహుకాలం: 11:00 – 12:28
గుళిక కాలం: 08:03 – 09:32
యమ గండం: 03:25 – 04:53
అభిజిత్ : 12:05 – 12:51
సూర్యోదయం: 06:35
సూర్యాస్తమయం: 06:22
వైదిక సూర్యోదయం: 06:39
వైదిక సూర్యాస్తమయం: 06:18
చంద్రోదయం: ఉ.09:30
చంద్రాస్తమయం: రా.10:10
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంర రాశి: మేషం
దిశ శూల: పశ్చిమం
చంద్ర నివాసం: తూర్పు
మహర్షి యాజ్ఞవల్క్య జయంతి
శ్రీకంఠ – అనంత పంచమి
సత్యవ్రత తీర్థ పుణ్యతిథి
శ్రీపద్మావతి దేవి జయంతి
అహోబిల నరసింహ బ్రహ్మోత్సవారంభం
6. త్రివేణీ సంగమం
శరీరం, మనసు, ఆత్మ- మూడూ వేరుగా చెప్పుకొన్నా, అవి ఒక త్రివేణీ సంగమం లాంటివి. శరీరాన్ని ఇంద్రియాలు, ఇంద్రియాలను మనసు, దాన్ని బుద్ధి, బుద్ధిని ఆత్మ అదుపుచేస్తూ ఉంటాయి. సార్వభౌమ సామంతాలు బయటి ప్రపంచానికి ఎంత అవసరమో, మన లోపలఉన్న మరో ప్రపంచానికి అంతే అవసరం. ఒకరు చెప్పాలి, మరొకరు వినాలి; చెప్పింది విన్న తరవాత దాన్ని విశ్లేషించుకోవాలి. అవశ్యం అనుసరణీయమైతే ఆచరణలో పెట్టాలి. అందరూ చెప్పేది విని తనదారి తనదేనంటే అది మూర్ఖత్వం. నలుగురి మాటా ఆలకించి, ఆలోచించి, అడుగు ముందుకు వేయడం శ్రేయస్కరం. అలా చేయడంవల్ల, ‘అయ్యో! పొరపాటు చేశాం’ అని పశ్చాత్తాపం చెందాల్సిన పని ఉండదు. ‘చేయవలసింది చేశాం. జరగవలసింది జరుగుతుంది’ అన్న మనస్తత్వం కలిగిన మనిషి రుషి అవుతాడు. అతడి కృషి తప్పకుండా ఫలిస్తుంది.దిశానిర్దేశం చేయగలవాడు ధీశాలి అయి ఉండాలి. కనుక సింహాసనంపైన శునకం లాంటివాడు కూర్చుంటే, వ్యవహారం తలకిందులయ్యే ప్రమాదం పొంచిఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తెలివిగా వ్యవహరించాలి.తెలివి ఒక దివ్వె లాంటిది. దాని వెలుగును తెలివైనవాడు ఇట్టే తెలుసుకుంటాడు. కిష్కింధలో కాలు మోపగానే శ్రీరాముడికి, లక్ష్మణుడికి- హనుమ ఎదురుపడ్డాడు. అతడి మాటతీరు, నడవడి వెంటనే గమనించాడు శ్రీరామచంద్రుడు. లక్ష్మణుడికి ఎరుకపరచాడు.స్థూలశరీరాన్ని కర్మేంద్రియాలు, కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలను మనసు నడిపిస్తాయి. శరీరం రథం అని, ఇంద్రియాలు గుర్రాలని, మనసు కళ్లేలని, బుద్ధి సారథి అని, ఆత్మ రథికుడని గీత చక్కగా బోధిస్తున్నది. ఏ వస్తువునైనా, సంకల్పమైనా, చూసేది, చేసేది మనసు. ‘చూసేది కన్ను కాదు; కన్ను వెనకనున్న మరో కన్ను’ అన్న ఉపనిషత్తు వాక్యం మనసు ఆరో ఇంద్రియం అని సూచిస్తున్నది. మనసు పచ్చజెండా పడితేనే పనులు జరుగుతాయి. శరీరేంద్రియాలు దాని కనుసన్నల్లో నడుస్తాయని తెలుస్తున్నది. ఒక్కొక్కప్పుడు మన కళ్లే మనల్ని మోసం చేయడం కద్ధు తాడును చీకట్లో చూసినప్పుడు అది పాములా కనిపిస్తుంది. అంటే కంటి దృశ్యచాపానికి ఒక సరిహద్దు ఉన్నదన్నమాట. చూపు కొంతమేరకే పాకగలదు. ఆద్యంతాలను చూడలేదు. మిన్నులు పడ్డచోట తప్ప, అవతల ఏకాకృతిని వెలిగే జ్యోతి స్వరూపం చూడలేదు. అందుకు మూడో కన్ను కావాలి. జ్ఞాననేత్రం తెరుచుకోవాలి.ఆత్మకు దూరంగా, శరీరేంద్రియాలను పట్టుకుని అస్తమానం వేళ్లాడటం మనసుకు ఉన్న బలహీనత. గతం, భవిత గురించిన యావలో అది వర్తమానం గురించి పట్టించుకోదు. ప్రస్తుతం దానికి అప్రస్తుతం. ప్రస్తుతం దాని స్వేచ్ఛావైఖరికి ప్రశ్నార్థకం, ప్రమాదకరం! ప్రస్తుతాంశాలు, వాస్తవాలు, ఎక్కడ కట్టిపడేస్తాయోనన్న భయంతో అది నిన్న, రేపు తప్ప నేటి గురించి ఆలోచించదు. అందుకు బుద్ధి అనే అంకుశం ఉపయోగించాలి. శ్వాసను నియంత్రించి, దాని ధ్యాసను ఆత్మవైపు తరలించాలి. అందుకే యోగప్రస్థానంలో ధ్యానానికి విశిష్టమైన స్థానం ఉన్నది. దేవదానవులు దర్శించలేని దివ్యసాక్షాత్కారం ధ్యానయోగికి దక్కడం విశేషం. చిత్రం ఏమిటంటే బంధానికి, మోక్షానికి, మనసే కారణం. తెలివిగా మనసును లొంగదీసుకున్నవాడు తనకు, లోకాలకు, ఉపకారి అవుతాడు. మనసుకు దాసోహం అన్నవాడు లోక కంటకుడై, చివరకు తన నాశనానికే కారణం అవుతాడు.
7. మాతృదేవత (జ్యోతిర్మయం)
“మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవంటూ” అమ్మకు అగ్రస్థానమిచ్చి పూజించిన సంస్కృతి మనది. పిల్లల సంరక్షణకై భూలోకం వచ్చిన అమ్మ దేవత, అపురూప కానుక, ఆదిగురువు, దేవుడి మరోరూపం. ఆమె పలుకుల్లో అమృతమే ఒలుకుతుంది, తలపుల్లో అనురాగమే పొంగుతుంది. అందుకేనేమో మాతృభక్తి చేత భూలోకాన్ని , పితృభక్తి చేత అంతరిక్షాన్ని , గురుభక్తి చేత బ్రహ్మలోకాన్ని పొందుతారని మనుధర్మ శాస్త్రం వివరించింది. శాంతి పర్వంలో భీష్ముడు “తల్లిదండ్రులు, గురువు ముగ్గురూ త్రిమూర్తులు, మూడు వేదాలతో సమానమన్నట్టు” తల్లి మాటకు ప్రాధాన్యతిచ్చిన కుమారు లున్నారు. మత్స్యయంత్రాన్ని ఛేదించింది అర్జునుడయినా తల్లిమాట మీరకుండా ఐదుగురూ ద్రౌపదిని భార్యగా స్వీకరించినట్టు, తల్లి కోరిక మేరకు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుల జన్మకు వ్యాసుడు కారకుడైనట్టు, తల్లి దాస్యం పారద్రోలడానికి గరుత్మంతుడు అమృతం తెచ్చినట్టు భారతం తెలుపగా , తల్లి అనుమతి మేరకే సన్యాసిగా మారిన శంకరాచార్యుడు, తల్లి పిలుపు విని ప్రత్యక్షమైనట్టు, మోక్ష కారకుడైనట్టు పురాణాలు వర్ణించాయి. ‘అవతార పురుషులైనా ఒక అమ్మకు కొడుకన్నట్టు’ బాల్యంలో తల్లి ప్రేమను అనుభవించి , గోరుముద్దలు ఆరగించిన రాముడు, కృష్ణుడు కథలు నిరూపించగా, పిల్లల పెంపకంలో తల్లి పాత్ర గొప్పదని బాల శివాజీకి గోరుముద్దలతో బాటు వీరుల కథలు బోధించి యోధుడిగా తీర్చిదిద్దిన జిజియాబాయి, చాణక్యుడితో కొడుకుని పంపించి మగధ సామ్రాజ్య స్థాపకునిగా కొడుకు కీర్తిని శాశ్వతం చేసిన చంద్రగుప్తుని తల్లి చాటి చెప్పారు. వీరే కాకుండా హిడింబ (ఘటోత్కచుడు), పెంచుకున్న పిల్లాడిని ప్రయోజకుడిని చేసిన రాధ (కర్ణుడు), కొడుకు మీద ప్రేమతో నూరు తప్పులు క్షమించమని కృష్ణుడిని ఒప్పించిన శ్రుతకీర్తి (శిశుపాలుడు), దుర్మార్గుడైన కొడుకుని రక్షించుకునేందుకు తన చూపుతో వజ్రదేహం కల్పించిన గాంధారి (దుర్యోధనుడు) నిరూపించారు . తల్లి ప్రేమ మరోతల్లి కడుపుకోతను నివారించగలదని బ్రాహ్మణ కుమారుడి బదులుగా బకాసురుడి వద్దకు భీముణ్ణి పంపిన కుంతీదేవి, క్షమాగుణంలో మాతృదేవతను మించినవారు లేరనడానికి ఉపపాండవులను నిర్దాక్షిణ్యంగా వధించిన అశ్వద్ధామను విడిచిపెట్టిన ద్రౌపదిని భారతం చూపించగా, అమ్మలో కరుణతో బాటు కాఠిన్యం ఉన్నదనడానికి నిదర్శనంగా పాతివ్రత్యాన్ని కాపాడుకునేందుకు త్రిమూర్తులను పసిపాపలుగా చేసి ఆటాడుకున్న అనసూయ కథను పురాణాలు వర్ణించాయి . “తల్లియె వేదము, శాస్త్రము, జపమున్ , గురువున్, సకలము, తల్లి నెదిరించు వారధమగతి పొందునని” కవులు హెచ్చరించిన విషయాన్ని గుర్తుంచుకుని బాల్యంలో తల్లిదండ్రులు తమను ప్రేమించి సాకినట్టే వృద్ధాప్యంలో వారిని సేవించడమే పిల్లలు తల్లిదండ్రులకిచ్చే బహుమతి.
8. యాదాద్రిలో ధ్వజారోహణ మహోత్సవం-బ్రహ్మోత్సవాల్లో భేరీపూజ.. దేవతాహ్వానం
శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు యాదాద్రి క్షేత్రంలో అత్యంత వైభవముగా సాగుతున్నాయి. తెలంగాణకు మహా క్షేత్రమైన యాదాద్రిలో నరసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రెండో రోజు ధ్వజారోహణ, భేరీపూజ, దేవతాహ్వాన మహోత్సవాలను ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అర్చకులు నిర్వహించారు. ఉదయం బాలాలయంలో శ్రీ లక్ష్మీనరపింహుడిని ఉత్సవ అలంకారణ చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగమైన ధ్వజారోహణ మహోత్సవాన్ని నిర్వహించారు. మహోత్సవాలకు వచ్చే భక్తులకు స్వామి వారి అనుగ్రహం కలిగి ఉండేలా ముక్కోటి దేవతలను కోరుతూ గరుడ ముద్దలను అకాశానికి ఎగురవేస్తూ సాగిన మహోత్సవాన్ని భక్తులు దర్శించుకున్నారు.అనంతరం మహోత్సవ విశిష్టతను భక్తులకు అర్చకులు వివరించారు. సాయంకాలం ఆలయంలో నిత్య ఆరాధన భేరిపూజ, దేవతాహ్వానము నిత్యహవనము ఉత్సవాలను నిర్వహించారు. దేవతలకు అత్యంత ప్రీతికరమైన ఆయారాగ తాళాదులతో ఆహ్వానించిన మహోత్సవ విషిష్టతను భక్తులకు తెలిపారు. ఈ ఉత్సవ పూజల్లో యజ్ఞాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు నల్లంధీగల్ లక్ష్మీనరసింహచార్యులు, కారంపుడి నరసింహచార్యులు, కాడూరి వెంకటాచార్యులు, సురేంద్రచార్యులు, మాధవాచార్యులు, అర్చక స్వాములు, ఆలయ కార్యనిర్వహణ అధికారి గీత, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఆలయ అధికారులు భాస్కర్ శర్మ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
*నేటి నుంచే అలంకారంతో సేవలు..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నేటి నుంచి అలంకార సేవలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం ఆలయంలో నిత్యహవన పారాయణాలు గావించి శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఉదయం 11 గంటలకు మత్యావతార అలంకారసేవ, సాయంత్రం శేష వాహనశేవ పూజ కార్యక్రమాలను జరిపిస్తారు.
9. తిరుమలలో వీఐపీలకు రాత్రి బస వద్దు-సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్
తిరుమలలో సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా వీఐపీలకు రాత్రి బస లేకుండా పగటి పూటే స్వామివారి దర్శనం కల్పించాలని సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్ పామిడి శమంతకమణి సూచించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా గురువారం తిరుపతిలో తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో బసంత్‌కుమార్, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి గోపీనాథ్‌జెట్టి తదితర అధికారులతో కమిటీ ఛైర్మన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సభ్యులు సత్యనారాయణరాజు, ప్రకాష్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కరణం బలరామ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. పగటిపూట వీఐపీలకు దర్శనం కల్పిస్తే రాత్రి బసచేసే అవకాశం ఉండదని చెప్పారు. తద్వారా సామాన్య భక్తులకు బస చేసే అవకాశం కల్పించేందుకు వీలుంటుందన్నారు. ఈవో సింఘాల్ మాట్లాడుతూ.. తిరుమలలో కొత్తగా అతిథిగృహాలు నిర్మిస్తే పర్యావరణం దెబ్బతింటుందని.. అలిపిరి జూ పార్కు మార్గంలో 40 ఎకరాల్లో 30వేల మందికి వసతి నిర్మాణాలు, బసకేంద్రాలు ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
*అమ్మవారి ఆతిథ్యం.. స్వామివారి దర్శనం!
తిరుమల వెళ్లే భక్తుల కోసం రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సంస్థకు చెందిన బస్సుల్లో వచ్చే వారందరికీ సొంతంగా వసతి, ఆతిథ్యంతోపాటు స్వామి దర్శనం కల్పించనున్నారు. తిరుచానూరులో రూ.70 కోట్లతో నిర్మించిన తితిదేకి చెందిన విశాలమైన ఏడు అంతస్తుల పద్మావతి నిలయాన్ని ఏపీటీడీసీ తీసుకుంది. ఏటా రూ.కోటి అద్దె చెల్లించే ఈ భవనంలో 80 ఏసీ, 120 సాధారణ గదులు అందుబాటులో ఉంటాయి. అన్ని సదుపాయాలతోపాటు భోజనశాలనూ ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో భవనాన్ని ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వివిధ ప్యాకేజీల్లో ఏపీటీడీసీకి చెందిన బస్సుల్లో రోజూ 800 నుంచి 1,000 మంది తిరుపతి చేరుకుంటున్నారు. తెల్లవారుజామున వచ్చే భక్తులను ప్రైవేట్ హోటళ్లలో ఉంచి తిరుమల కొండపైకి తీసుకెళ్తున్నారు. తితిదేతో ఒప్పందం ప్రకారం కేటాయిస్తున్న స్లాట్‌లో రూ.300 టికెట్‌పై స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు.
పద్మావతి నిలయం ప్రారంభమయ్యాక రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి రోజూ 2 వేల మంది భక్తుల్ని తిరుపతికి తీసుకెళ్లేలా ఏపీటీడీసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వారందరూ రూ.300 టికెట్‌పై స్వామి దర్శనం చేసుకునేలా తితిదే నుంచి అనుమతి కోసం అధికారులు యత్నిస్తున్నారు. ఈ మేరకు త్వరలో ఏపీటీడీసీ ప్యాకేజీల ఆన్‌లైన్ బుకింగ్‌ను భక్తులకు అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
10. మార్చి 6వ తేదీ నుంచి ధర్మపురి నర్సన్న బ్రహోత్సవాలు..
మార్చి 6వ తేదీ నుంచి ధర్మపురి నర్సన్న బ్రహోత్సవాలు… ధర్మపురి: ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయయ్యాయి. మార్చి 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా సిబ్బంది భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను నీటితో శుద్ధి చేశారు. ఫైరింజన్ సహాయంతో ఆలయ గోపురాలతో పాటు పట్టణలోని ఆర్చిగేట్లను నీటితో కడిగారు. కోనేరును శుద్ధి చేసి, రంగులు వేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కాణిపాకం రథానికి బంగారు తాపడం
Related tags :