Health

కొరోనా రోగి ఊపిరితిత్తులు మార్చిన చైనా వైద్యులు

Chinese Doctors Replace Coronavirus Patient's Lungs

కరోనా వైరస్‌ సోకిన ఓ రోగికి.. చైనా డాక్టర్లు ఊపిరితిత్తులను మార్పిడి చేశారు. కోవిడ్‌ 19 వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతని లంగ్‌కు తీవ్ర నష్టం జరిగినట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 29 వ తేదీన ఆ రోగికి సర్జరీ చేశారు. దేశవ్యాప్తంగా ఆ సర్జరీపై చర్చ జరిగింది. ప్రఖ్యాత పల్మనాలజిస్ట్‌ చెన్‌ జింగ్‌యూ.. ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స చేశారు. చికిత్స చేయించుకున్న పేషెంట్‌ వయసు 59 ఏళ్లు. ఆ రోగిది తూర్పు చైనాకు చెందిన జియాంగ్‌సూ ప్రావిన్సు. వూజీ హాస్పటల్లో ఆపరేషన్‌ నిర్వహించారు. జనవరి 23 వ తేదీన అతను హాస్పటల్లో చేరాడు. 26 వ తేదీన అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్లు బయటపడ్డాయి. వైరస్‌ సోకినట్లు తేలకముందే.. ఆ రోగికి పల్మోనరీ ఫిబ్రోసిస్‌ అనే వ్యాధితో ఊపిరితిత్తులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఫిబ్రవరి 28వ తేదీన అతని కుడి ఊపిరితిత్తి నుంచి సుమారు 3వేల మిల్లీలీటర్ల రక్తం లీకైంది. దాదాపు చావు ఖాయం అనుకున్న సమయంలో.. ఓ బ్రెయిన్‌ డెడ్‌ పేషెంట్‌కు చెందిన ఆరోగ్యమైన లంగ్‌ను .. కోవిడ్‌ 19 పేషెంట్‌కు ట్రాన్స్‌ప్లాంట్‌ చేశారు. ఈ సర్జరీతో అత్యంత సంక్లిష్టమైన సమయంలో.. కరోనా పేషెంట్లకు చికిత్సలో భాగంగా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయవచ్చు అన్న ఓ ఆలోచనకు వచ్చారు. ఆ రోగి ఊపిరితిత్తులో వైరస్‌ ఉందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని డాక్టర్లు తెలిపారు. కోవిడ్‌19 పేషెంట్లకు ఇలాంటి సర్జరీ చివరి నిమిషంలో ఉపయోగపడుతుందన్న అభిప్రాయాలను డాక్టర్లు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ట్రాన్స్‌ప్లాంట్‌ అయిన రోగి ఆరోగ్యం నిలకడగా ఉంది. లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌పై ఉన్న అతన్ని ఇంకా పరీక్షిస్తున్నారు. ఒకవేళ ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ అయినట్లు నిర్ధారణకు వస్తే, భవిష్యత్తులో కోవిడ్‌ 19 పేషెంట్లు. లంగ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.