అనుమానమే నిజమయ్యేలా ఉంది..! నాలుగేళ్లకోసారి జరిగే విశ్వక్రీడా సంబురం ఒలింపిక్స్‌కు కరోనా కాటు వేయనుంది..! కొవిడ్ వైరస్ కారణంగా టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడే ప్రమాదం కనిపిస్తోంది..! విశ్వక్రీడలను ఈ ఏడాది ఎప్పుడైనా నిర్వహించుకునే అధికారం తమకు ఉందని జపాన్ ఒలింపిక్ మినిస్టర్ ఆ దేశ పార్లమెంట్‌లో చెప్పడం క్రీడారంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది..! మరోవైపు ఒలింపిక్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నామని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రెసిడెంట్ థామస్ బాచ్ చెబుతున్నారు..! కానీ, పరిస్థితి చూస్తుంటే జులై 25న మొదలవ్వాల్సిన ఒలింపిక్స్.ఏడాది చివరకు వాయిదా పడేలా ఉన్నాయి.
* ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ వైరస్ వల్ల టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై రోజుకో వార్త పుట్టుకొస్తోంది. షెడ్యూల్ ప్రకారం విశ్వక్రీడలను విజయవంతంగా నిర్వహిస్తామని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) ప్రెసిడెంట్ థామస్ బాచ్ గతవారం చెప్పినప్పటికీ పోస్ట్‌పోన్ వార్తలు ఆగడం లేదు. మెగా ఈవెంట్ వాయిదా తప్పదనే ప్రచారం కొనసాగుతోంది. జపాన్ ఒలింపిక్ మినిస్టర్ సికో హషిమోటో మంగళవారం పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం ఒలింపిక్స్‌ను 2020లో ఎప్పుడైనా నిర్వహించవచ్చు అని హషిమోటో అనడం మరింత ఆందోళన పెంచింది. అయితే గేమ్స్‌ను రద్దు చేసే అధికారం మాత్రం ఐవోసీకే ఉందని ఆమె స్పష్టత ఇచ్చారు. కానీ కొవిడ్ మరింత వ్యాప్తి చెందితే గేమ్స్ పరిస్థితేంటి అని హషిమోటోను ప్రశ్నించగా.. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే లూసానెలో జరిగిన ఒలింపిక్ బాడీ మీటింగ్‌లో థామస్ బాచ్ మాట్లాడుతూ జూన్ 15–17 తేదీల్లో జరిగే ప్రి గేమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌లో చాలా అంశాలపై తుది నిర్ణయాలు తీసుకుంటామన్నారు. దీని తర్వాత జులై 18–19 తేదీల్లో టోక్యో వేదికగా ఐవోసీ బోర్డు మరోసారి సమావేశం కానుంది. దీంతో చివరి నిమిషం దాకా ఉత్కంఠ తప్పేలా లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం జులై 25 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయి. ఆ తర్వాత ఆగస్టు 25 నుంచి పారాలింపిక్స్ మొదలవుతాయి. ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తే.. తిరిగి ఈ ఏడాది చివర్లో నిర్వహించే చాన్సుంది. అయితే, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌లో ఏదైనా మార్పు జరిగితే బ్రాడ్‌కాస్టర్లు పెద్ద మొత్తంలో నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఒలింపిక్స్ మూడు సార్లు రద్దు అయ్యాయి. అన్ని సార్లు యుద్ధాలే కారణం.
*జపాన్‌లో పరిస్థితేంటి..
ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం జపాన్‌లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన 230 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలు స్కూల్స్‌కు సెలవులు ప్రకటించారు. అంతేకాక ఒలింపిక్ సంబంధింత ఈవెంట్స్‌తోపాటు ఇతర స్పోర్టింగ్ కాంపిటిషన్స్ కూడా రద్దు చేశారు. మెగా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇంకా 17 టెస్ట్ ఈవెంట్‌లు పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో ఏప్రిల్ 4–6 తేదీల్లో జరిగే జిమ్నాస్టిక్ టెస్ట్ ఈవెంట్ తప్ప మిగిలిన వాటిలో స్థానిక అథ్లెట్లే పాల్గొంటారు. మంగళవారం జరగాల్సిన పారాలింపిక్ వీల్‌చైర్ రగ్బీ టెస్ట్ ఈవెంట్‌ను రద్దు చేశారు. జపాన్ ప్రొఫెషనల్ బేస్‌బాల్ లీగ్‌ను ఖాళీ స్టాండ్స్ మధ్య నిర్వహిస్తున్నారు. సాకర్ జే–లీగ్‌ను మార్చి 18కి వాయిదా వేశారు. ప్రతిష్టాత్మక టోక్యో మారథాన్‌ను 100 మంది రన్నర్స్‌తో పూర్తి చేశారు.
*ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్లకూ ముప్పు
వివిధ దేశాల్లో జరగాల్సిన ఒలింపిక్ క్వాలిఫయర్స్ ఈవెంట్లను కూడా కొవిడ్ ప్రభావితం చేస్తోంది. తైవాన్ వేదికగా ఏప్రిల్‌లో జరగాల్సిన బాస్కెట్‌బాల్ క్వాలిఫయింగ్ ఈవెంట్ జూన్‌కు వాయిదా పడింది. అలాగే, చైనాలో షెడ్యూల్ చేసిన అన్ని క్వాలిఫయిర్స్‌ను వేరే దేశాలకు తరలిస్తున్నారు. చైనాకు చెందిన పలు జట్లు, చాలా మంది అథ్లెట్లు వేరే దేశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు.
2020 జపాన్ ఒలంపిక్స్ జరుగుతాయా?
Related tags :