సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల..వైకుంఠపురములో..’ సినిమాతో తెలుగు తెరకు రీఎంట్రీ ఇచ్చి మంచి ప్రశంసలు అందుకున్నారు ప్రముఖ నటి టబు. ‘అల..వైకుంఠపురములో..’ సినిమా తర్వాత ఆమె ఏ తెలుగు హీరోతో నటించనున్నారనే విషయం పట్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె టాలీవుడ్ హీరో నితిన్ సినిమాలో సందడి చేయనున్నట్లు వార్తలు వస్తోన్నాయి. ఇటీవల విడుదలైన ‘భీష్మ’ సినిమాతో మిశ్రమ స్పందనలు అందుకున్న నితిన్.. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో కొత్త సినిమాకి సంతకం చేశారు. ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా బాలీవుడ్లో తెరకెక్కిన ‘అంధాధున్’ సినిమాకి రీమేక్‌గా నితిన్-మేర్లపాక గాంధీ చిత్రం తెరకెక్కనుంది. ‘అంధాధున్’ రీమేక్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు గతకొన్నిరోజుల క్రితం ఘనంగా జరిగాయి. నితిన్ వివాహం తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటుల గురించి చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ సినిమాలో టబు నటించనున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయుష్మాన్ ఖురానా ‘అంధాధున్’ సినిమాలో టబు.. సిమీ సిన్హా అనే కీలకమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. దీంతో మాతృకలో నటించిన టబునే రీమేక్‌లో కూడా సిమీ పాత్రకోసం నటిస్తే బాగుంటుందని చిత్రబృందం భావిస్తుందట. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
నితిన్ చిత్రంలో టబూ
Related tags :