Sports

కొరోనా దెబ్బకు భారత షట్లర్లు ఆగిపోయారు

Indian Shuttlers Back Off Due To Coronavirus

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా(కోవిడ్‌-19) వైరస్‌ కారణంగా ఇప్పటికే పలు క్రీడా పోటీలు రద్దవుతుండగా, మరికొన్ని వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 11 నుంచి ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అయితే ఇంగ్లాండ్‌లో కరోనా బాధితుల సంఖ్య 87కి చేరింది. దీంతో ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌కు దూరంగా ఉండనున్నట్లు పలువురు భారత షట్లర్లు స్పష్టం చేశారు.

డబుల్స్‌ స్పెషలిస్టులు చిరాగ్‌ శెట్టి, సాత్విక్‌ సాయిరాజ్‌, మను అత్రి, సుమీత్‌ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా, తాజా పరిస్థితుల నేపథ్యంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని టోర్నీ నిర్వాహకులు గతవారం వెల్లడించడంతో.. స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌ ఈ పోటీలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ అక్కడికి వెళ్లి రిస్క్‌ తీసుకోలేమని చెప్పాడు. ఇక గచ్చిబౌలిలోనూ కరోనా ప్రభావం ఉందనే కారణంతో గోపీచంద్‌ అకాడమీని వీడి.. సొంత ఊరుకు పయనమవుతున్నట్లు తెలిపాడు.

‘మేమంతా చర్చించుకునే.. ఈ సమయంలో ఆల్‌ ఇంగ్లాండ్‌ పోటీలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం. వైరస్‌ విజృంభణ వల్ల ఆ టోర్నీ రద్దు అవుతుందని భావించాం. కానీ, నిర్వాహకులు యథావిధిగా జరుపుతామని చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. ఇదే విషయాన్ని గోపీ సర్‌కు చెప్పాను. ప్రస్తుతం గచ్చిబౌలిలోనూ వైరస్‌ కేసులు ఉండటంతో.. అకాడమీలో ఉండడం కూడా అంత సురక్షితం కాదు. మాలో చాలా మంది స్వస్థలాలకు వెళ్లాలని భావించాం’ అని ప్రణయ్‌ పేర్కొన్నాడు. అలాగే చిరాగ్‌ మాట్లాడుతూ కొంత సమయం వేచిచూస్తానన్నాడు. వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నందున టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. మరోవైపు కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3,300 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే. వివిధ దేశాల్లో ఈ వైరస్‌ కేసులు గణణీయంగా పెరుగుతున్నాయి.