ScienceAndTech

జర్మనీ శాస్త్రవేత్తల పురోగతి

జర్మనీ శాస్త్రవేత్తల పురోగతి

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్(కొవిడ్‌-19)కు మందు కనిపెట్టే పరిశోధనలో పురోగతి సాధించినట్లు జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. మనిషి ఊపిరితిత్తుల్లోకి ఈ వైరస్‌ ప్రవేశించడానికి సహాయపడుతున్న ప్రోటీన్‌ను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు జర్మనీకి చెందిన ‘జర్మన్‌ ప్రైమేట్‌ సెంటర్‌’ సహా మరికొంత మంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఫలితాలను ‘జర్నల్‌ సెల్‌’లో ప్రచురించారు. ఊపిరితిత్తుల కణాలలోకి వైరస్‌ ప్రవేశించడానికి దోహదపడుతున్న సెల్యూలార్‌ ప్రోటీన్‌ను కనుగొన్నట్లు జర్నల్‌లో పేర్కొన్నారు. మనిషి శరీరంలో ఉండే టీఎమ్‌పీఆర్‌ఎస్‌ఎస్‌2 అనే ప్రోటీస్‌ దీనికి సహాయపడుతున్నట్లు గుర్తించామని జర్మన్‌ ప్రైమేట్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్త స్టీఫన్‌ పోల్‌మన్‌ తెలిపారు. దీన్ని ఆధారంగా చేసుకొని చికిత్సకు మందు కనుగొనే అవకాశం ఉందన్నారు. క్లోమ సంబంధిత సమస్యల చికిత్సలో వినియోగిస్తున్న ‘కామోస్టాట్‌ మెసిలేట్‌’ అనే డ్రగ్‌ను టీఎమ్‌పీఆర్‌ఎస్‌ఎస్‌2 నిరోధించేందుకు ఇప్పటికే ఉపయోగిస్తున్నారని పరిశోధకులు తెలిపారు. ఈ డ్రగ్‌ను జపాన్‌ ప్రభుత్వం కూడా గుర్తించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఐసోలేట్‌ చేసిన ఓ వ్యక్తిపై ప్రయోగాలు జరపగా మెరుగైన ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. మరిన్ని ప్రయోగాలు జరిపి దీన్ని ధ్రువీకరించాల్సిన అవసరం ఉందన్నారు.