Sports

100 పరుగులు కూడా చేయకుండా ఆలౌట్

ICC T20 Womens World Cup - India Loses To Australia Disastrously

చాంపియన్‌ ఆట తీరుతో ఆస్ట్రేలియా మరోసారి మెరిసింది.. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2020 విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. స్టార్‌ బ్యాటర్‌ అలీసా హీలీ (75; 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్‌ బెత్‌ మూనీ (61 నాటౌట్‌; 43 బంతుల్లో 9ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో రాణించారు. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. ప్రధాన బ్యాటర్లు షషాలీ (2), మంధాన(11), రోడ్రిగ్స్‌(0), హర్మన్‌(4) ఘోరంగా నిరుత్సాహపరిచారు. చివర్లో దీప్తి శర్మ(33) రాణించడంతో టీమిండియా కనీసం గౌరవప్రదమైన స్కోర్‌నైనా సాధించింది. ఆసీస్‌ బౌలర్లలో మెగాన్‌ షూట్‌ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. జోనాసన్‌ మూడు వికెట్లు పడగొట్టింది.