* చైనాను వణికించి ప్రపంచదేశాలకు పాకిన కరోనా వైరస్ ఇప్పుడు ఇరాన్లో మరణ మృదంగం వాయిస్తోంది. వైరస్ సంబంధిత మరణాలు రాత్రిపూట బాగా పెరిగాయని, కోవిడ్-19 కారణంగా 49 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి యానుష్ జహాన్పూర్ ఆదివారం తెలిపారు. గడచిన ఒక్క రోజులో 49 మంది కోవిడ్ కారణంగా మరణించారని, దేశంలో మొత్తంగా 194 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వివరించారు. గత 24 గంటల్లో దేశంలో 743 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,566కు చేరింది. ఫిబ్రవరి 19న దేశంలో తొలి కేసు నమోదైన తర్వాతి నుంచి ఇప్పటి వరకు 2,134 మంది వైరస్ బారినుంచి బయటపడినట్టు జహాన్పూర్ తెలిపారు. మరోవైపు 194 మరణాలతో చైనా తర్వాత అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా ఇరాన్ రికార్డులకెక్కింది. ఇరాన్‌లోని 31 ప్రావిన్స్‌లలో 6,566 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.
* టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో తుది సమరానికి దూసుకొచ్చిన భారత మహిళా జట్టు ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో 85 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో విఫలమై తొలి కప్‌ను అందుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. ఫలితంగా ఆసీస్ అయిదో సారి ఛాంపియన్‌గా నిలిచింది.
* ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామ పంచాయతీల్లో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆయా గ్రామాల్లో మాత్రం స్థానిక ఎన్నికలను మినహాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్‌గా గుర్తించడంతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో విలీనం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
* ఆత్మహత్యకు పాల్పడిన మిర్యాలగూడ వ్యాపారి, ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు పోస్ట్‌మార్టం పూర్తయింది. ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అందజేయడంతో వారు మిర్యాలగూడ తరలించారు. ఈ సందర్భంగా సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మారుతీరావు విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని చెప్పారు.
* 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర విత్త మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి సమతుల్యతతో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది సంక్షేమ తెలంగాణ కోసం రూపొందించిన ప్రగతిశీల బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయ వనరులు, ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్ ఇది అని కొనియాడారు.
* బీసీ రిజర్వేషన్ల కోతపై వైకాపాకి గుణపాఠం చెప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలంతా ఏకమై స్థానిక ఎన్నికల్లో వైకాపాని చిత్తుగా ఓడించాలని నేతలకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు రిజర్వేషన్లు 59.55శాతం ఉంటాయని జగన్మోహన్రెడ్డి అందరినీ ఊహాగానాల్లో ముంచారని దుయ్యబట్టారు.
* సంక్షేమ పథకాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింహభాగం నిధులు కేటాయించింది. రూ.40వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు పేదల జీవన భద్రతను, భవిష్యత్తుపై భరోసాను కల్పిస్తున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో సంక్షేమం కోసం అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 57 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వం వృద్ధాప్య పింఛను అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
* వివిధ రంగాల్లో ప్రతిభ చాటుతున్న మహిళలు సామాజిక సేవలోనూ దూసుకెళ్తున్నారు. సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్జీఓలు స్థాపించి ప్రజలకు చేరువవుతున్నారు. అలా పుట్టిందే ‘ఫుడ్‌బ్యాంక్-ఇండియా’. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్‌లో నేటికీ లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారి దీనస్థితికి చలించిన స్నేహా మోహన్‌దాస్ ఈ ఎన్జీఓను స్థాపించారు. ఆకలిలేని సమాజ సృష్టి కోసం ముందుకు సాగుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ ఖాతాను నిర్వహించే అవకాశం దక్కించుకున్నారు.
* ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యెస్ బ్యాంకుపై ఆర్బీఐ మారిటోరియం విధించిన విషయం తెలిసిందే. ఒక్కో వినియోగదారుడు నెలకు కేవలం రూ.50వేలు మాత్రమే ఉపసంహరించుకోవచ్చని ఆంక్షలు కూడా విధించింది. ఈ నిబంధన వల్ల ఆ బ్యాంకుతో భాగస్వామిగా ఉన్న డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫాం ఫోన్‌పే ఇబ్బందుల్లో పడింది. ఇందులో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఇకనుంచి ఫోన్‌పేకు యస్ బ్యాంకు స్థానంలో ఐసీఐసీఐ నగదు సర్దుబాటు చేయనుంది. ఈ మేరకు ఫోన్‌పే ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సమీర్ నిగమ్ ప్రకటించారు.
* బాయ్‌ఫ్రెండ్‌తో ఇంట్లో ఉండగా తల్లి వచ్చిందన్న భయంతో మొదటి అంతస్థు నుంచి దూకిన బాలికకు ప్రాణాపాయం తప్పింది. ముంబయిలోని కుర్లా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్లా ప్రాంతానికి చెందిన ఓ బాలిక(17) ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంది. ఈ క్రమంలో వారిద్దరూ ఇంట్లో ఏకాంతంగా ఉండగా అకస్మాత్తుగా తల్లి రావడాన్ని బాలిక గమనించింది. దీంతో దొరికిపోతామేమో అనే భయంతో మొదటి అంతస్థులో ఉన్న ఇంటి బెడ్రూమ్ కిటికీలోంచి బయటకు దూకింది.
* క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు చెప్పాడు. మహిళల సాధికారత అనేది తన గుండెలకు హత్తుకునే విషయమని పేర్కొన్నాడు. తన జీవితంలో ఐదుగురు మహిళామణులు ఎంతో కీలకమని వ్యాఖ్యానించాడు. వారే తన తల్లి రజినీ తెందూల్కర్, చిన్నప్పటి ఆంటీ, భార్య అంజలి, అత్త (అంజలి అమ్మ), కూతురు సారా అని తెలిపాడు.