* పురుగులు పట్టిన చాక్లెట్‌ను విక్రయించి వినియోగదారు కూతురు అనారోగ్యానికి కారణమైన మోర్ మెగాస్టోర్‌పై హైదరాబాద్ వినియోగదారుల ఫోరం-3 మండిపడింది. తినుబండారాల సంరక్షణ పద్ధతులు పట్టించుకోనందుకు రూ.36,080 జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన కోమరగిరి సుబ్బారావు తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఎర్రమంజిల్‌లోని మోర్ సూపర్ మార్కెట్లో 2018 అక్టోబర్ 11న చాక్లెట్లు కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఫిర్యాదుదారు కూతురు క్యాడ్బరీ డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్‌ను కొద్దికొద్దిగా తింటూ ఉండగా అందులో పురుగులు ఉన్నాయని సుబ్బారావు కుమారుడు గమనించి అరిచాడు. ఈ విషయాన్ని సూపర్ మార్కెట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా పెద్దగా స్పందించలేదు. చాక్లెట్ తిన్న కొద్దిసేపటికే ఫిర్యాదుదారు కూతురు అనారోగ్యానికి గురైంది. దవాఖానాకు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు ఫుడ్ పాయిజన్ అయ్యిందని తెలిపారు. క్యాడ్బరీ చాక్లెట్ కంపెనీ, మోర్ మెగా స్టోర్‌పై చర్యలు తీసుకోవాలంటూ సుబ్బారావు హైదరాబాద్ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. పంపిణీ చేసిన చాక్లెట్లను భద్రపరిచేందుకు విజి కూలర్లను విక్రయదారులకు ఇస్తున్నామని, లేబుళ్లపై కూడా ‘పరిశుభ్రమైన, చల్లని ప్రదేశంలో భద్రపరిచాలని’ పేర్కొంటున్నట్లు క్యాడ్బరీ కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఫిర్యాదుదారు వాదనలను కొట్టిపారేసిన మోర్ మెగాస్టోర్, సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని ఫోరానికి వివరించింది. వాద, ప్రతివాదనలు విన్న అనంతరం.. తినుబండారాల సంరక్షణపై మోర్ మెగాస్టోర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రుజువైందని హైదరాబాద్ వినియోగదారుల ఫోరం-3 పేర్కొంది. ఉత్పత్తి కంపెనీ తప్పేమీ లేదని నిర్ధారించింది. చాక్లెట్ ఖరీదు రూ.80, వైద్య ఖర్చులకు అయిన రూ.1,000తోపాటు, పరిహారంగా రూ.25,000, ఖర్చుల కింద మరో రూ.10,000 వినియోగదారుడికి చెల్లించాలని మోర్ మెగాస్టోర్‌ను అధ్యక్షుడు నిమ్మ నారాయణ, సభ్యుడు జి.శ్రీనివాసరావుతో కూడిన బెంచ్ ఆదేశించింది. 30 రోజుల వ్యవధిలో ఈ మొత్తాన్ని చెల్లించాలని లేని పక్షంలో 9 శాతం వడ్డీతో చెల్లించాలని హెచ్చరించింది.
* నగరంలోని ఆర్సీఐ కాలనీకి చెందిన నేత్రపాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజ్ఞానకంచ శాఖలో ఖాతాదారుడు. 2016 నవంబర్ 3న తన ప్రమేయం లేకుండానే ఖాతా నుంచి రూ.15,001 ఓ సారి, 2017 నవంబర్ 3న మరోసారి రూ.15,054 నగదు మాయమైనట్లు సందేశం వచ్చింది. నేత్రపాల్ రెండు పర్యాయాలు బ్యాంకుకు వెళ్లి ఈ విషయంపై ఆరా తీయగా ఖాతాదారుకి హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో పాలసీ ఉందని, ఆ డబ్బు ఆటో డెబిట్ అయిందని తేలింది. దీంతో ఆటోడెబిట్ మ్యాండేట్ కోసం ఫిర్యాదుదారు ఇచ్చిన దరఖాస్తు తీసుకురావాలని ఫోరం ఆదేశించింది. నేత్రపాల్ పాస్‌బుక్‌లో సంతకం, ఆటోడెబిట్ మ్యాండెట్లో సంతకం సరిపోలకపోవడంతో ఈ విషయంలో తప్పునకు బాధ్యులు ప్రతివాదులే అని ఫోరం గుర్తించింది. వినియోగదారు ఫిర్యాదును పట్టించుకోని ఎస్బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతివాదులైన ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ సంయుక్తంగా రూ.30,055 వినియోగదారుడికి చెల్లించడంతో పాటు పరిహారంగా రూ.20,000, కేసు ఖర్చుల కింద మరో రూ.10,000 చెల్లించాలని ఫోరం-2 ఆదేశించింది.
* కరోనా ప్రభావం స్టాక్‌మార్కెట్ల నుంచి ముడిచమురు సహా కమాడిటీ వరకూ అన్ని మార్కెట్లనూ బెంబేలెత్తిస్తోంది. చమురు ధరలు ఆసియాలో సోమవారం 20 ఏళ్ల కనిష్ట స్ధాయిలో ఏకంగా 30 శాతం పడిపోయాయి. డెడ్లీ వైరస్‌తో డిమాండ్ పడిపోవడంతో ఉత్పత్తిలో కోత విధించాలనే ఒప్పందంపై ఒపెక్, భాగస్వామ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలతో సౌదీ అరేబియా ధరలను అమాంతం తగ్గించివేసింది. చమురు ఉత్పత్తిని తగ్గించడంపై ఒపెక్ దేశాలు, రష్యా మధ్య జరిగిన చర్చలు విఫలమైన అనంతరం సౌదీ ఆరాంకో ధరలను భారీగా తగ్గించింది. సౌదీ ప్రైస్ వార్తో ఆసియాలో బ్యాంరెల్ ముడిచమురు ధర ఏకంగా 32 డాలర్లకు పడిపోయింది. కరోనా షాక్‌తో ఆర్థిక వఅద్ధి తగ్గుముఖం పట్టే క్రమంలో రానున్న నెలల్లోనూ ముడిచమురు ధరలు దిగివస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
* చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్. ఇతర దేశాలను వణికిస్తుంది. తాజాగా బంగ్లాదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మూడు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ నెల 17వ తేదీన బంగ్లాదేశ్ లో జరగనున్న షేక్ ముజిబుర్ రెహమాన్ శతాబ్ధి జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఆ దేశ ప్రధాని షేక్ హాసినా మోడీని ఆహ్వానించారు. దీంతో ప్రధాని మోడీ బంగ్లాదేశ్ కు వెళ్లాలనుకున్నారు. కానీ అక్కడ మూడు కరోనా కేసులు నమోదు కావడంతో.. తన పర్యటనను వాయిదా వేసుకోవాలని మోడీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనపై త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుంది. కరోనా వైరస్ కారణంగా బ్రసెల్స్ పర్యటనను కూడా మోడీ రద్దు చేసుకున్నారు..