పరిచయం
భారతదేశంలో మానవవాద ఉద్యమం కేవలం 80 సంవత్సరాల చరిత్ర గలది. 1940లో ఆరంభమైన యీ ఉద్యమానికి ఆద్యుడు మానవేంద్రనాథ్ రాయ్. ఎం.ఎన్.రాయ్‌గా బహుళ ప్రచారం పొంది చరిత్ర సృష్టించాడు. కేవలం ఉద్యమానికి 15 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి వుద్యమ పితామహుడు రాయ్ చనిపోయాడు.
ఒక వ్యక్తి రెండవ ప్రపంచయుద్ధ సంక్షోభ కాలంలో వుద్యమాన్ని దేశంలో ఆరంభించి అనేక ఒడుదుడుకు ఎదుర్కొని ముందుకు సాగడం పెద్ద విశేషం. పెద్ద రాజకీయ పార్టీ మధ్య పెనుగులాడి, ఎన్నికలో పూర్తి ఓటమి చవి చూచి, పార్టీకంటే ఉద్యమం ఉత్తమమని ముందుకు సాగిన తీరు సాహసోపేతం. ఉద్యమానికి తగినట్లు సాహిత్యం సమాజంలోకి తీసుకురాగలగడం మరొక పేర్కొనదగిన అంశం.
ఎం.ఎన్.రాయ్ 1955లో చనిపోయేనాటికి బాల్యావస్థ దాటని స్థితిలో వుద్యమం సాగింది. కానీ అప్పటికే నాుగు కాలాపాటు నిలవగల ఉత్తమ సాహిత్యం మెవరించారు. దాని ఆధారంగా యిది పయనించింది. ఇందులో స్త్రీలు వేళ్ళపై లెక్కించదగిన స్థితిలో ఉన్నారు. చెదురుమదురుగా పత్రికలు నడిచాయి. కొంతవరకు ఆలోచన రేకెత్తించి, వైజ్ఞానిక పద్ధతిపై దృష్టిపెట్టారు. కానీ జనాకర్షణ కాలేదు.
భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో చురుకుగా మరికొన్ని రాష్ట్రాలలో మందకొడిగా వుద్యమం సాగింది. ఆ చరిత్రను అందించే ప్రయత్నమే యీ రచన. కొన్ని రాష్ట్రాల సమాచారం స్వల్పంగా వుండగా, అసలు విషయాలు అందని రాష్ట్రాలు లేకపోలేదు. లభించిన సమాచారం ఆసక్తికరమైనది. వైజ్ఞానిక పద్ధతిపై దృష్టి పెట్టడం విశేషం.
అదంతా చరిత్రగా అందిస్తున్న రచన ఇది. ఫొటోలు కూడా కొంతవరకు లభించాయి. మానవవాద విషయాలు తెలుగుతో సహా వివిధ భాషలలోకి వచ్చాయి. ఆ చరిత్రే యీ రచన.
గుర్తింపురాని భారత స్వాతంత్ర్య తాత్వికుడు మానవేంద్రనాథ్ రాయ్
భారత స్వాతంత్య్ర పోరాటం స్పష్టంగా రెండు మార్గాలలో పయనించింది. అందులో అహింసాయుత పద్ధతి ఎక్కువమందిని ఆకర్షించింది. అనేక త్యాగాలకు పాల్పడిన జనాభా ఈ మార్గాన్ని ఉత్తమ పద్ధతిగా ఎంచుకున్నారు. ఇందులో అనేకమంది నాయకులు, కార్యకర్తలు త్యాగాలు చేస్తూ జైళ్ళకు వెడుతూ పట్టు వీడకుండా పోరాడి విజయం సాధించారు.
రెండవ మార్గం హింసాయుత పద్ధతులను పాటించింది. తుపాకీపట్టి బ్రిటీషువారిని తరిమేయాలని పోరాడిన నాయకులు యువతరాన్ని కొంతవరకు ఆకర్షించగలిగారు. మొదటి ప్రపంచయుద్ధం రావడంతో బ్రిటీషువారికి బద్ధశత్రువులైన జర్మనీవారు భారతదేశంలో హింసాయుత నాయకత్వానికి చేయూతనిచ్చారు. ధన సహాయం చేసింది. ఇది 1914 నాటి చారిత్రక ఘట్టం. దేశంలో వివిధ ప్రాంతాలో చిన్న ముఠాలు హింసాయుత మార్గాన్ని అవంబించినా బెంగాలులో మాత్రం అది తీవ్రస్థాయిలో సాగింది. చిన్న చిన్న ముఠాలకు సమన్వయీకరణ చేసి పోరాటాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్ళారు. దీనికి జతీన్ ముఖర్జీ కీలక పాత్ర వహించాడు. జర్మనీవారు ఆయన్ను ప్రోత్సహించి ఆయుధాలు ధన సహాయం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పోరాట చరిత్రనే తీసుకుందాం.
స్వాతంత్య్రపోరాట చరిత్రలో జర్మనీ సహాయాన్ని స్వీకరించి పోరాడిన నాయకులు ప్రధానంగా బెంగాలు వారే. మొదటి ప్రపంచయుద్ధంలో జతీన్, నరేంద్రనాథ్ (ఎమ్.ఎన్.రాయ్) కీలక పాత్ర వహించగా రెండవ ప్రపంచయుద్ధంలో సుభాస్ చంద్రబోస్ సరిగ్గా అలాంటి పాత్రనే కొనసాగించి జర్మనుల సహాయం కోసం అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక్కడ ప్రథమ దశలోని హింసాయుత పోరాట విశేషాను అందులో ఎమ్.ఎన్.రాయ్ కీక పాత్రను విపుంగా పరిశీలిద్దాం.
50 సంవత్సరాలు దేశవ్యాప్తంగా భిన్న కోణాలలో జరిగిన భారత స్వాతంత్య్ర సమరం అనేక ములుపులు తిరిగింది. ఇందులో హింస, అహింస కలయికలో దేశంలో తలెత్తిన స్వాతంత్య్ర పిపాస ఎప్పటికప్పుడు అణచివేతకు గురయి, స్థానిక వీరులు కొందరు బ్రిటీషువారి తుపాకులకు బలయ్యారు. ప్రజలందరిలో స్వాతంత్య్రం సాధించాన్న కోరిక అనేక రకాలుగా వ్యాపించింది. కొంతమంది దేశనాయకులు స్వాతంత్య్ర సందేశాన్ని అందించి ఉత్తేజపరిచారు. మరికొంతమంది నాయకులు విదేశాలకి వెళ్ళి అక్కడ దేశ విమోచన అవసరాన్ని తెలియచేశారు. ఇలా వెళ్ళినవాళ్ళలో బాలగంగాధర తిక్, లాలాజపతిరాయ్, సురేంద్రనాథ్ బెనర్జీ, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ వంటి వారు ఎంతోమంది వున్నారు.
అప్పటికే దేశం నుండి వివేకానందుడు అమెరికా వెళ్ళి ప్రపంచ మత సమాఖ్యలో ప్రసంగించి, భారతదేశ స్వతంత్య్ర ఆవశ్యకతని తెలియచేశారు. అరవిందుడు బెంగాల్‌లో తలెత్తిన స్వాతంత్య్రోద్యమాన్ని ఆధ్యాత్మికపరంగా కొనసాగించాలనుకుని పాండిచ్చేరి వెళ్ళి, స్థిరపడి అక్కడి నుండి పోరాటం చేశారు. అది ఆధ్యాత్మిక ధోరణిలో వున్నా చాలామంది దానిని స్వాతంత్య్ర పోరాటంగా మలుచుకున్నారు.
మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటీషువారికి సహకరించిన గాంధీజీ మెల్లమెల్లగా అహింసాయుత పోరాటాన్ని తీవ్రంచేసి బ్రిటీషు వ్యతిరేక ఉద్యమంగా జనాన్ని కూడగట్టారు. దేశంలో బెంగాల్, ఒరిస్సా, ఆంధ్ర, మదరాసు తీరాలో తీవ్రవాద పద్ధతులలో బ్రిటీష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. స్థానికంగా జరిగే పోరాటాలన్నిటినీ బ్రిటీష్ వారు అణగదొక్కినప్పుడు కొంతమంది తుపాకులకు బలయ్యారు.
ఆ సమయంలో ప్రారంభమయిన బెంగాల్ పోరాట ఉద్యమాలు, ముఖ్యంగా జతీన్ ముఖర్జీ నాయకత్వంలో జరిగిన తిరుగుబాట్లు బ్రిటీషువారి దృష్టిని ఆకర్షించాయి. ఇంకొకవైపు పంజాబ్‌లో గదర్ ఉద్యమం తీవ్రధోరణిలో మొదలు కాగా అనేకమంది విదేశాలకు వెళ్ళి, వివిధ రకాలుగా సహాయాన్ని అందిస్తూ స్వాతంత్య్రోద్యమానికి బలాన్ని చేకూర్చారు. జతీన్ ముఖర్జీ చిత్తశుద్ధిగా ఉద్యమాన్ని బలపరుస్తూ కార్యకర్తల్ని, సంఘటితపరుస్తూ తుపాకలు చేపట్టాడు. అయితే బ్రిటీషువారితో పోరాడాలంటే స్థానికంగా లభించే తుపాకులు చాలవని తెలుసుకున్నారు.
మరొకవైపు బ్రిటీషువారికి అంతర్జాతీయంగా బద్ధ శత్రువుగా ఉన్న జర్మనీవారు అప్పుడు జరుగుతున్న పోరాటంలో ఉద్యమకారులకు సహాయం చేయదలచారు. డబ్బును, ఆయుధాలను అతివాదులకు సరఫరా చెయ్యడానికి తమ సంసిద్ధతను తెలియచేశారు. కానీ, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి కొంతమందే ముందుకు వచ్చారు.
భారత జాతీయ కాంగ్రెసులో ముఖ్యంగా మితవాదులు బ్రిటీషు ప్రభుత్వం భారతదేశానికి డొమినియన్ స్టేటస్ (అధినివేశ ప్రతిపత్తి) ఇచ్చినా చాలనే దృష్టితో వున్నారు. తీవ్రజాతీయవాదులు యిందుకు వ్యతిరేకించారు. వీరికి అరవిందుడు నాయకుడు. బ్రిటీషు అధికారం పూర్తిగా తొలగాలి. సంపూర్ణ స్వరాజ్యం స్థాపించాలి అని వీరు నినదించారు. అవసరమయితే ఆయుధాలను కూడా ఉపయోగించి బ్రిటీషు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సిద్ధపడ్డారు.
అప్పుడు రహస్య విప్లవ సంఘాలు ఒక వర్గం జితేంద్రనాథ్ బెనర్జీ నాయకత్వం కింద, మరొక వర్గం అరవిందుడి సోదరుడు బిరిన్ ఘోష్ నాయకత్వం కింద పనిచేస్తుండేవి.
ఆ సమయంలోనే జతీన్ ముఖర్జీ విప్లవ నాయకుడుగా పేరు ప్రఖ్యాతులు గడించాడు. ‘ఛత్రభండారీ’ పేరుతో స్టూడెంట్సు కో-ఆపరేటివ్ స్టోర్సు అసోసియేషన్ ను స్థాపించి విద్యార్థుల్ని, యువకుల్ని రహస్యంగా సమావేశపరచి విప్లవ ప్రచారం చేశాడు.
బెంగాలులో జతీన్ ముఖర్జీ తపెట్టిన పోరాటాన్ని గమనించిన జర్మనీవారు ఆయనకు డబ్బు ఆయుధాలు అందజేస్తామన్నారు. అది స్వీకరించటానికి జతీన్ సంసిద్ధత వ్యక్తపరిచి, శత్రువుకు శత్రువు మన మిత్రుడు అనే ధోరణి అవలంబించారు.
ఎవరీ జతీన్ ముఖర్జీ?
జతీంద్రనాథ్ ముఖర్జీ బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్) నాడియా జిల్లాలో కుషిత తాలూకాకు చెందిన కయాగ్రామ్ గ్రామంలో డిసెంబర్ 7, 1879న జన్మించాడు. పుట్టిన వెంటనే జతీంద్రను సాధుహతి గ్రామంలో ఉన్న తండ్రి పూర్వీకు ఇంటికి పంపారు. 5 సంవత్సరాు వచ్చేవరకు అంటే తండ్రి మరణించేవరకు అక్కడే ఉన్నాడు. తరవాత తన తల్లితండ్రుల ఊరయిన కయాగ్రామ్ వచ్చేశాడు. జతీంద్ర చిన్నతనంలో శారీరక బలం, మానసిక ధైర్యంతో వుండేవాడు. చిన్నతనంలో జతీన్ హాస్య చతురత, చక్కని వ్యక్తిత్వం కలిగివుండేవాడు. జతీంద్ర పౌరాణిక నాటకాలు చూస్తుండేవాడు. వాటిల్లో నటించడానికి కూడా ఇష్టపడేవాడు. సామాజిక, మతపరంగా ప్రజలో పక్షపాతం చూపించేవాడు కాదు. చిన్నతనం నుంచీ తల్లి బోధన వలన హిందువుని, ముస్లింని సమానంగా గౌరవించేవాడు.
1895లో జతీన్ కలకత్తాలో ఒక ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చేరాడు. దీనితోపాటు జీవనోపాధికి సరైనదని భావించి స్టెనోగ్రాఫీ విద్యార్థిగా చేరాడు. స్వామివివేకనంద ఉపదేశాలు జతీన్‌కు స్ఫూర్తినిచ్చాయి. సామాజిక, రాజకీయ ఆలోచనలు కలిగిన జతీన్ బ్రిటీష్ అణచివేతకు స్వాతంత్య్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషిస్తున్న సిస్టర్ నివేదితతో చేరాలనుకున్నాడు. భవిష్యత్ విప్లవకారుడిగా జతీంద్రనాథ్ శక్తిని గ్రహించి కుస్తీ నేర్చుకోవడానికి అంబూ గుహా వ్యాయామశాలకి పంపించారు. ఇక్కడే జతీన్‌కు బ్రిటీష్ వారిని వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలు నడిపిస్తున్న సచిన్ బెనర్జీ గురువయ్యాడు. బ్రిటీష్ వారి వలస విద్యా వ్యవస్థతో అసంతృప్తి చెందిన జతీంద్రనాథ్ 1899లో తన చదువుకు స్వస్తి చెప్పాడు. తరువాత ముజఫర్‌పూర్‌లో న్యాయవాద కార్యదర్శిగా ఉన్న ప్రింగిల్ కెన్నడీ చారిత్రక పరిశోధను జతీన్‌ను ఆకట్టుకుని మరింత రాజకీయ స్ఫూర్తినిచ్చాయి.
కలకత్తాలో విద్యార్థిగా ఉన్నపుడు అనుశీలన సమితి స్థాపకులలో ఒకడిగా జతీన్ వుండేవాడు. బ్రిటీష్ అధికారులచే అనుశీలన సమితి అణగదొక్కబడింది. తరువాత అరబిందో విప్లవాత్మక కార్యకలాపాలలో ఒకడిగా వుండేవాడు. ఆ సమయంలో పర్యటనకు వచ్చిన వేల్స్ యువరాజుతో జతీన్ బ్రిటీష్ ఆఫీసర్లు భారతీయుని బానిసలుగా హింసిస్తున్న విధానం వర్ణించి చెప్పాడు. ఈ ఫిర్యాదుని విన్న యువరాజు కళ్ళుతెరిచి తన దేశాధికారులకి అందజేసి న్యాయం చేస్తానని మాట ఇచ్చాడు.
1900లో జతీంద్రనాథ్ ముఖర్జీ తన స్వగ్రామానికి చెందిన ఇందుబాలా బెనర్జీని వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు. పెద్దకుమారుడు జతీంద్ర జతీన్ 3 సంవత్సరా వయస్సులో మరణించాడు. ఈ మరణం జతీంద్రను కచివేసింది.
జతీన్ ముఖర్జీ ప్రభుత్వ అంతరంగిక డిపార్టుమెంటులో స్టెనోగ్రాఫరుగా ఉద్యోగం చేస్తుండేవాడు. అందువలన ప్రభుత్వంలో విప్లవవాదుకు వ్యతిరేకంగా, వారిని అణచడానికి నడిచే రహస్య ఫైల్స్ లోని విషయాన్నీ ముందుగా విప్లవాదులకి తెలియజేస్తుండేవాడు. అతని విగ్రహపుష్టి, వేష-భాషలు, మాట పొందిక, వాక్చాతుర్యము, నమ్రత, గంభీరత వీటన్నింటినీ మించి ఆయనలో కనిపించే విప్లవ జ్వాలకు తోటి విప్లవవాదలు జతీన్ ముఖర్జీ అంటే అమితమైన గౌరవమర్యాదలు, ఆప్యాయత చూపించేవారు. ఆఫీసు వేళలు ముగియటం ఆలస్యం ఎంతోమంది యువకులు, విద్యార్థులు ‘ఛత్రభండారీ’ దగ్గర కోలాహంగా గుమిగూడుతూ వుండేవారు. జతీన్ ముఖర్జీ మీద తక్కిన విప్లవవాదులకు గురుభావం కలగటానికి 1906లో బెంగాలులోని నాడియా ప్రాంతంలో ఉన్న కోయా అడవుల్లోనుంచి వచ్చి గ్రామ శివార్లలో ప్రజలను నిరంతరం భయంతో వణికించిన పెద్దపులిని పట్టి, చంపి ఎందరికో హాయిగా ఊపిరి పీల్చుకునేలా చేసినందుకు ఇంటింటా బాగా జతీన్ (బాగా అంటే పెద్దపులి) హీరోగా చెప్పుకునేవారు.
జతీన్ ముఖర్జీ మీద విప్లవవాదులు చూపించే గౌరవం భరించలేక బిరిన్ ఘోషు (అరవిందుడి సోదరుడు) తనే విప్లవ నాయకుడిగా వుండాని, ఆ స్థానాన్ని వేరే వాళ్ళు ఆక్రమించకూడదని భావించేవాడు. ప్రభుత్వంలో స్టెనోగ్రాఫరు ఉద్యోగంతో పొట్టపోసుకునే వ్యక్తి విప్లవవాది ఎలా అవుతాడని, జతీన్ ముఖర్జీకి వ్యతిరేక ప్రచారం సాగించాడు. బిరిన్ ఘోషు నాయకుని హోదా చూపిస్తూ ‘జతిన్ ముఖర్జీతో ఎవరూ మాట్లాడద్దని అతనితో కూడా కలవడానికి కూడా వీల్లేదు’ అని తోటి విప్లవకారులను ఆదేశించాడు. ఇది చాలామందికి అసంతృప్తిని కలిగించటమే కాకుండా బిరిన్ మీద హేయభావాన్ని కూడా కలిగించింది.
అయితే ఆసమయంలోనే నరేంద్రనాథ్ ఉద్యమంలో చేరి జతీన్‌కు సన్నిహితుడయ్యాడు. నరేన్ ఆ సందర్భంలో జతీన్ ముఖర్జీతో రహస్యంగా మంతనాలు జరుపుతుండేవాడు. కల్మషంలేని జతీన్ ముఖర్జీ నరేంద్రునికి ఎంతో ప్రీతిపాత్రుడయ్యాడు.
అదే సమయంలో కుమారుని కోల్పోయిన జతీన్ ముఖర్జీ జీవితం మీద విరక్తి చెంది ‘సన్యాసి జీవితం ద్వారా మనశ్శాంతిని పొందాలనే దృష్టితో హరిద్వార్ వెళ్ళాడు. అక్కడ మతగురువు బోలానాథ్ గిరిని దర్శించాడు.
విప్లవసంఘాల్లో పనిచేసిన యువకులు మొదట్లో ఎంతో కార్యదీక్ష, పట్టుదలతో కృషి చేసినా ప్రభుత్వ దమననీతి వలన అనేక కష్ట నష్టాలకు గురయి, విరక్తి చెంది ఆశ్రమాల్లో సన్యాస జీవితం గడపసాగారు. బోలానాధ్ ఆశ్రమంలో కూడా అనేకమంది విప్లవకారులు ఆశ్రితుగా చేరారు. కానీ ఆకాలంలో మత గురువు మతోద్ధరణకు ఆశ్రమాలు స్థాపించినా అందులో కొంతమందిని మతంతోపాటు తమ శిష్యులకు రాజకీయంగా ప్రజల్ని, దేశాన్ని ఉద్ధరించవసిన ఆవశ్యకతని బోధించేవారు. ఈ ఆశ్రమాల్లో కొన్ని విప్లవ రాజకీయాలు వ్యాప్తి చెందటానికి ఆ కాలంలో ఎంతగానో తోడ్పడ్డాయి.
బోలానాథ్ స్వామి జతీన్ ముఖర్జీ సన్యాసాశ్రమం స్వీకరించటానికి అంగీకరించలేదు. ‘దేశం కోసం, ప్రజలకోసం నువ్వు చేయాల్సింది, సాధించాల్సింది యీ ఆశ్రమంలో కాదు. నీకోసం భారత ప్రజానీకం ఎదురు చూస్తోంది’ అని హెచ్చరించాడు. స్వామి వారి హెచ్చరిక జతీన్ వైరాగ్యాన్ని పటాపంచలు చేసింది. బోలానాథ్ గిరి స్వామి వారి ఆశీర్వాదం పొంది ఆశ్రమం విడిచిపెట్టాడు.
ఆ సమయంలోనే నిరాలంబన స్వామి (జతీంద్రనాథ్ బెనర్జీ)ని కలుసుకున్నాడు. జతీన్‌కు రాజకీయ గురువు అయిన బోలానాథ్, నిరాంబన స్వామి సహా మీద తిరిగి కలకత్తాకు వచ్చి విప్లవ కార్యక్రమం ముమ్మరం కావటానికి తీవ్ర కృషి చేశాడు. బిరిన్ స్థాపించిన బాంబు నిర్మాణ సంస్థతో పనిచేశాడు. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగాలు నలుమూలా యుద్ధం పురిక్పొటానికి, అందుకు అవసరమయిన ముఠాను, సంస్థను యేర్పరచటానికి జతీన్ ముఖర్జీ తన శాయశక్తులా కృషి చేశాడు. తన యీ కార్యక్రమంలో జతీన్ ముందుగా నిరాలంబన స్వామి సహాలను పొందుతుండేవాడు.
జర్మనీ వారిని కసి వారిచ్చే డబ్బు, ఆయుధాలు భారతదేశానికి చేరవేసే వారెవరున్నారు? అని ఆలోచనలో పడ్డాడు జతీన్ ముఖర్జీ. ఆ విషయంలో నమ్మకస్తులు, పట్టుదల వున్నవారు, చాకచక్యంతో వ్యవహరించేవారు కావాలనుకున్నాడు. ఆ దశలో జతీన్ విప్లవ పోరాటంలో తగిన వ్యక్తి, అన్నివిధాల సహకరించగ ప్రతిభావంతులు, చిత్తశుద్ధిగలవారు దొరికారు. వారిలో కీలక వ్యక్తిగా నరేంద్రనాథ్‌ను ఎంపిక చేసి జతీన్ ముఖర్జీ పురమాయించాడు.
నరేంద్రనాథ్ (ఎమ్.ఎన్.రాయ్) రంగ ప్రవేశం
జతీన్‌కు కుడిభుజంగా తయారైన ఈ నరేంద్రనాథ్ ఎవరు? ఆయన పూర్వాపరాలేమిటి?
నరేంద్రనాథ్ (మానవేంద్రనాథ్) ఒక పురోహితుల కుటుంబంలో 1887వ సంవత్సరం మార్చి 21న పుట్టాడు. అతడి తండ్రి దీనబంధు భట్టాచార్య దక్షిణ బెంగాల్లోని మిడ్నపూర్ జిల్లాలో క్షేపుటేశ్వరీ దేవాయానికి ముఖ్య పూజారిగా వుండేవాడు. అప్పటి ఆచారం ప్రకారం పూజారి వంశంలోని ప్రథమ పుత్రుడు పూజారి కావటం జరుగుతుండేది. దీనబంధు భట్టాచార్యకు తొమ్మిదిమంది సోదరులు, ఒక సోదరి వుండేవారు. దీనబంధు ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్ళి వేరే దూర ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉత్సవ సమయంలో సంవత్సరానికి ఒకసారి అక్కడికి వచ్చి ఆలయంలో క్రతువు, పూజలు చేయించేవాడు. మిగిలిన కాలంలో తనకి మారుగా తన సోదరులో ఒకరిని ఆలయ పూజలు జరపడానికి ప్రతినిధిగా నియమిస్తూ వుండేవాడు. ఖేత్ పుటేశ్వరీ ఆలయం మీద వచ్చే ఆదాయాన్ని వదిలేసి దీనబంధు వంగరాష్ట్రంలో ఇరవైనాలుగు పరగణాలకి చెందిన కొడాలియా గ్రామంలో ఒక పాఠశాలో సంస్కృత పండితుడిగా ఉపాధ్యాయవృత్తిని స్వీకరించేవాడు. ఇద్దరు సంతానం తరవాత దీనబంధు మొదటి భార్య మరణించింది. నరేంద్రనాథ్ భట్టాచార్య రెండవ భార్యకు మూడవ సంతానం. తర్వాత దీనబంధు కలకత్తాకు దక్షిణాన 12 మైళ్ళ దూరంలో ఉన్న చింగ్రిపోత అనే గ్రామానికి మారాడు. దీనబంధు సంస్కృతబోధలో నిమగ్నుడై వుండేవాడు.
చింగ్రిపోత గ్రామంలోనే నరేంద్రనాథ్ పెరుగుతూ విద్యాభ్యాసం చేసారు. అతడి తీవ్రవాద జాతీయవాద తొలిచర్యకు ఆ గ్రామం రంగంగా నిలిచింది. ప్రవేశ పరీక్షలు ఉత్తీర్ణుడై కలకత్తాలోని జాతీయ కళాశాలో చేరారు. అతడి విద్యాభ్యాసానికి అంతటితో స్వస్తి పెట్టారు.
చిన్నతనం నుంచీ నరేంద్రుడు రాజకీయాలన్నా, విప్లవం అన్నా మిక్కిలి ఆసక్తిగా వుండేవాడు. ఆర్ధిక పరిస్థితులు సరిగ్గా లేకపోయినా కుమారుడి చురుకుదనంచూసి తండ్రి నరేంద్రుని ఉన్నత విద్యకి కలకత్తా పంపాడు. అక్కడ నరేంద్రుడు విద్యాభ్యాసంతో పాటు విప్లవ రాజకీయాల్లో పాల్గొనేవాడు. వినాయక దామోదర్ సావర్కార్, బంకించంద్ర ఛటర్జీ, స్వామి రామతీర్థ, వివేకానంద, అరవింద్ ఘోష్ రచనకి ప్రభావితుడై రహస్య విప్లవ సమావేశాల్లో పాల్గొనేవాడు. కొంతకాలం అరవిందుడు స్థాపించిన జాతీయ కళాశాలో, తరవాత కొద్దికాలం ఒక టెక్నికల్ కళాశాలలో విద్య అభ్యసించాడు.
నరేంద్రనాథ్ ఎదుగుతున్న రోజులలో బెంగాల్ సంధియుగంలో వుంది. 1905లో జరిగిన రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఆందోళన వల్ల పరిస్థితి పరాకాష్ఠకు చేరుకుంది. ఈ అలజడికి పరిష్కార మార్గంగానే బ్రిటీష్ ప్రభుత్వం విభజన చేసింది. రాష్ట్రాన్ని విభజించి ఆందోళనను అడ్డుకోవచ్చు అనుకున్నారు. కానీ అవి మరింత తీవ్రతరం కావడంతో విభజనను రద్దు చేశారు. స్వేచ్ఛ కావాలనే వాంఛను అణచలేకపోయారు. ఆ భావన ఎక్కువై యువకులను ఉత్తేజితులను చేసి వ్యవస్థాపిత ప్రభుత్వంపై దెబ్బ తీయడానికి దారి తీసింది.
స్వేచ్ఛా లక్ష్యంతోనే నరేంద్రనాథ్ (మానవేంద్రనాథ్) విప్లవ ఉద్యమంలోకి ఆకర్షితుడయ్యాడు. 1905లో కలకత్తాలో తరచు జరిగే విభజన వ్యతిరేక సమావేశాలకు తన మిత్రులు హరికుమార్ చక్రవర్తి, శైలేశ్వర్ బోస్‌తో సహా పాల్గొంటుండేవాడు. ఒక పర్యాయం ముగ్గురూ కలిసి సుప్రసిద్ధ జాతీయ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీని కొడాలియాకు ఆహ్వానించి ఒక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అటువంటి రాజకీయ కార్యకలాపా వల్ల వారిని పాఠశాల నుంచి తొలగించారు. తరువాత ఆ ఉత్తరువును ఉపసంహరించి ప్రవేశపరీక్షకి కూర్చోవడానికి అనుమతించారు. నరేన్, అతని మిత్రులు భగవద్గీతను, బంకించంద్ర ఛటర్జీ రాసిన ఆనందమఠం, అరబిందఘోష్ రచన భవానీమందిర్ వంటి విప్లవ సాహిత్యాన్ని చదివారు.
స్వామీ వివేకానంద పుస్తకాలు వారిపై బాగా ప్రభావాన్ని చూపించాయి. – దేనినీ అంటిపెట్టుకోకుండా వుండేకంటే ఏదో ఒకటి వుండడమే మంచిది – అన్న వివేకానంద జీవితతత్వం వారికి మార్గదర్శకమైంది.
నరేన్, అతడి మిత్రులు అనుశీన సమితిలో చేరారు. బెంగాలీ యువకులో శారీరక, మానసిక, నైతిక పునరుజ్జీవనం నిమిత్తం 1902లో ఈ సంఘాన్ని కలకత్తాలో స్థాపించారు. అతి స్వల్పకాంలోనే అందులో ఒక రహస్య విభాగం ఏర్పడి బెంగాల్ అంతటా విప్లవ కార్యక్రమాల కేంద్రంగా మారింది. క్రమంగా అటువంటి సంస్థలే మిగిలిన నగరాలలోను, ముఖ్యకేంద్రాలలోనూ శాఖలుగా ఏర్పడ్డాయి. క్రమశిక్షణ కట్టుదిట్టంగా అమలు జరిగేది.
కార్యకలాపాల రహస్యాన్ని కాపాడటానికి తగిన చర్యలు తీసుకునేవారు. అయితే వీటి కార్యకలాపాలు చట్టబద్ధంగా కనిపించడం వల్ల, సి.ఆర్.దాస్ వంటి ప్రముఖలు వీటితో సంబంధం కలిగివుండడం వల్ల ఎలాంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి వీలు కలిగేది కాదు. 1908 నాటికి సమితులకు రాజకీయ దోపిడుకు, హత్యకు సంబంధం ఉన్నట్లు స్పష్టమైన సమాచారం లభించింది. దాంతో కలకత్తా అనుశీల సమితి చట్ట వ్యతిరేకమని 1908లో ప్రకటించారు. విప్లవ ఉద్యమానికి పెద్ద విఘాతం కలిగింది.
క్రమశిక్షణ దృష్ట్యా సమితిలోని కొత్త సభ్యులు ముందుగా సాంఘిక కార్యక్రమాలలో, సహాయ పనులలో పాల్గొన్నారు. నరేన్, హరికుమార్‌ను ఒరిస్సాలో ఉన్న కాటక నివారణ కార్యక్రమాల నిమిత్తం పంపించారు. జైపాల్ వద్ద వున్న రూరియాహట్ శిబిరానికి నరేన్ బాధ్యత వహించాడు. వారి పనులు తృప్తికరంగా వుండటం వల్ల కలకత్తాకు తిరిగి వచ్చిన అనంతరం వారిని అంతరంగిక శాఖలో చేర్చుకున్నారు.
నరేన్ ఇంటిని వదిలి కకత్తాలో ఉన్న అనుశీలన సమితిలోనే వుండేవాడు. ఆ సమయంలో బెంగాలీ దినపత్రిక ‘యుగంతర్’ను బరీన్ ఘోష్ ప్రారంభించారు. బరీన్ ఘోష్‌తో నరేన్ సన్నిహితుడయ్యాడు. దినపత్రిక నిర్వహించడంలో బరీన్‌ఘోష్‌కు సహకరిస్తూ నరేన్ కొన్ని వ్యాసాలు కూడా రాశాడు. తరవాత బెంగాలీలో ‘మాతపిలుపు’ అని చిన్న పుస్తకం రాశాడు. అది పోలీసు పరమై ఎప్పటికీ ప్రింటు కాలేదు.