కరోనావైరస్ ప్రభావిత చైనాలో ఆహార ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ధరలు దాదాపు 21.4శాతం పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో వైరస్ నిరోధక చర్యలను చైనా ముమ్మరంగా చేపట్టింది. దీంతో పంపిణీ వ్యవస్థపై ఈ ప్రభావం గణనీయంగా పడింది. చైనాలో చమురు ధరలు పెరగడం కూడా ఆహార ధరలను ప్రభావితం చేసింది. ఏడాది మొత్తం మీద చూసుకొంటే 5.2శాతం వరకు ఈ పెరుగుదల ఉంది.
పోర్క్ ధర దాదాపు రెండింతలైంది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ప్రబలడంతో దీని సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో దాదాపు 10లక్షల జీవాలను చంపాల్సి వచ్చింది. ధరలో జనవరి నుంచి ఇప్పటి వరకు మాత్రమే ఏకంగా 9.3శాతం ధర పెరిగింది. తాజా కూరగాయల ధరలు గత ఏడాదితోపోలిస్తే 9.5శాతం పెరిగాయి.
జనవరినెలలో వుహాన్లోకి రాకపోకలను కట్టడి చేయగానే నెలకొన్న భయాందోళనలతో మార్కెట్లలో కొనుగోళ్లు పోటెత్తాయి. దీంతో ఒక్కసారిగా ధరలు భగ్గుమన్నాయి. ధరల పెంపుపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోపక్క అదే సమయంలో ప్రయాణాలు నిలిచిపోవడం, సరకు రవాణాలో తీవ్రమైన అడ్డంకులు తలెత్తాయి. అధికార కమ్యూనిస్టు పార్టీ అధికారులు రంగంలోకి దిగి సప్లైచైన్ను వేగవంతం చేయాలని కోరుతున్నారు. దీనిలో భాగంగా పోర్క్ ధరలను అదపులోకి తెచ్చేందుకు వారు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రైతులకు ప్రభుత్వం సబ్సిడీలు, ఇతర సాయం అందిస్తోంది.