Movies

ఆస్ట్రో ఫిజిక్స్ పట్టభద్రుడు. మధుర సంగీత దర్శకుడు-ఆర్పీ

A special story on RP Patnaik on his birthday

సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆర్పీ పట్నాయక్‌… గాయకుడిగా, నటుడిగా, దర్శకుడిగానూ తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. తెలుగుతో పాటు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ సంగీత దర్శకుడిగా రాణించారు. ‘గాజువాక పిల్లా మేం గాజులోళ్లం కాదా…’ (నువ్వు నేను), ‘రాను రానంటూ చిన్నదో చిన్నదో…’ (జయం), ‘తూనీగా తూనీగా…’ (మనసంతా నువ్వే), ‘డిల్లీ నుంచి గల్లీ దాకా…’ (చిత్రం), ‘తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా…’ (సంతోషం). – ఇలాంటి విజయవంతమైన ఎన్నో బాణీలు ఆర్పీ పట్నాయక్‌ నుంచి వచ్చినవే. 80 పైచిలుకు చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించిన ఆర్పీ పట్నాయక్, 300కిపైగా గీతాల్ని ఆలపించారు. 25 మందికిపైగా గాయకుల్ని పరిచయం చేశారు. తండ్రి ఉద్యోగం రీత్యా ఒడిశాలో ఉన్నప్పుడు అక్కడే మార్చి 10, 1972న జన్మించారు ఆర్పీ పట్నాయక్‌. ఆయన అసలు పేరు రవీంద్ర ప్రసాద్‌ పట్నాయక్‌. ఒడిశాలోనే బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి స్పేస్‌ ఫిజిక్స్‌లో పీజీ చేశారు. దర్శకుడు కావాలనే లక్ష్యంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కానీ సంగీత దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించారు. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ‘నీ కోసం’తో స్వరకర్తగా పరిచయమైన ఆయన, తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’తో తొలి విజయాన్ని అందుకొన్నారు. ఆ తరువాత తేజ – ఆర్పీ పట్నాయక్‌ కలయికలో వచ్చిన పలు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ‘మనసంతా నువ్వే’, ‘నువ్వు లేక నేను లేను’, ‘జయం’, ‘జెమినీ’, ‘నీ స్నేహం’, ‘దిల్‌’, ‘సంబరం’, ‘ఆ నలుగురు’ ఇలా చాలా చిత్రాలు ఆర్పీ పట్నాయక్‌కి పేరు తీసుకొచ్చాయి. వాటిలోని గీతాలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. అగ్ర సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆర్పీ, 2004లో ‘శీను వాసంతి లక్ష్మి’ చిత్రంతో నటుడిగా మారారు. ‘బ్రోకర్‌’, ‘తులసీదళం’, ‘మనలో ఒకడు’ చిత్రాల్లో ప్రధాన పాత్రధారిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. దర్శకుడిగా పరిచయమైన ‘అందమైన మనసులో’ కూడా డాక్టర్‌గా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేకపోయినా… ఉత్తమ కథా రచయితగా నంది అవార్డుని తెచ్చిపెట్టింది. ఆ తరువాత తెరకెక్కించిన ‘బ్రోకర్‌’ చిత్రానికి కూడా ఉత్తమ కథా రచయితగా నంది లభించింది. ‘మనలో ఒకడు’ చిత్రానికి తృతీయ ఉత్తమ చిత్రంగా నంది కైవసం చేసుకుంది. ‘నువ్వు నేను’ చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారం అందుకున్నారు. చిత్ర పరిశ్రమకి వచ్చిన కొత్తలో దర్శకుడు త్రివిక్రమ్, నటుడు సునీల్‌తో కలిసి ఓ గదిలో ఉండేవారట ఆర్పీ పట్నాయక్‌. ఆయన సోదరుడు గౌతమ్‌ పట్నాయక్‌ కూడా దర్శకుడే. ‘కెరటం’ అనే చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ రోజు ఆర్పీ పట్నాయక్‌ పుట్టినరోజు.