Movies

మరువలేని మధుర గాయకుడు మాధవపెద్ది

Madhavapeddi Satyam Birthday Special Story

మాధవపెద్ది సత్యం (మార్చి 11, 1922 – డిసెంబర్ 18, 2000) తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. వీరు తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందారు.

సత్యం 1922, మార్చి 11 న పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు గ్రామంలో జన్మించారు. వృత్తిరీత్యా నటుడైన సత్యం చిన్నతనములో ఎనిమిదేళ్ల వయసునుండి రంగస్థల నాటకాలలో నటించేవారు. ఈయన ప్రతిభను గుర్తించిన చక్రపాణి సత్యాన్ని తనతోపాటు మద్రాసు తీసుకువెళ్లి, తను నాగిరెడ్డితో కలిసి అప్పడే కొత్తగా స్థాపించబడిన విజయా పిక్చర్స్ పతాకము కింద నిర్మిస్తున్న షావుకారు చిత్రములో నటించే అవకాశము కలుగజేశారు. ఈయన తొలిసారిగా వెండితెరపై హిందీ, తమిళ ద్విభాషాచిత్రం రామదాసులో కనిపించారు. ఈ సినిమాకు రెండు భాషల్లోనూ తన పాత్ర యొక్క పాటలు తనే స్వయంగా పాడారు. మాధవపెద్ది సత్యం షావుకారు సినిమాతో తెలుగు సినిమా రంగములో అడుగుపెట్టారు. ఈ సినిమాలో సత్యం ఒక గుడ్డివాని పాత్రపోషించి ఆ పాత్రకు ఉన్న మూడు పాటలు పాడారు. ప్రసిద్ధిమైన పాటలు అయ్యయో జేబులో డబ్బులు పోయెనే, మాయాబజార్ సినిమాలోని వివాహ భోజనంబు వింతైన వంటకంబు (పాట) ఈయన మధురకంఠమునుండి జాలువారినవే. కొన్ని తెలుగు చిత్రాలలో నటించినా మాధవపెద్ది సత్యం ప్రధానంగా గాయకులే. ఈయన ఆనాటి ప్రసిద్ధ సంగీతదర్శకులైన సాలూరు రాజేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు తదితరులందరితో పనిచేశారు. వీరు పౌరాణిక చిత్రాలలో పద్యాలు పాడటములో ప్రసిద్ధి చెందారు.

75ఏళ్ల్ల వయసులో కూడా కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో సంకురాతిరి పండగొచ్చెరో పాటపాడి పలువురి ప్రశంసలందుకున్నారు.

ఈయన 78 సంవత్సరాల వయసులో 2000, డిసెంబర్ 18న చెన్నైలో అస్వస్థతతో మరణించారు.