WorldWonders

పట్టుచీర చిరిగిందని కోర్టుకు వెళ్లిన నల్గొండ మహిళ

Nalgonda Lady Goes To Consumer Court Over Torn Silk Saree

ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు కొన్నాళ్లకే పనిచేయడం ఆగిపోతే… అందాన్ని మెరుగుదిద్దుకోవడానికి చేయించుకున్న చికిత్సలు ప్రతిఫలం ఇవ్వకపోతే… బ్యాంకు, బీమా, ప్రజా రవాణా వంటి సేవల్లో లోపాలు ఎదురైతే… ఒకప్పుడైతే ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనకెందుకులే అని తేలిగ్గా తీసుకునేవారు మహిళలు. కానీ ఇప్పుడు వారు పోరాడుతున్నారు. వినియోగదారుల ఫోరం అండదండలతో సేవల్లో లోపాలను ప్రశ్నిస్తున్నారు. నష్టపరిహారం సైతం పొందుతున్నారు. మహిళా వినియోగదారుల్లో ప్రశ్నించే తత్వం పెరిగిందని చెబుతున్నారు హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల ఫోరం-2 బెంచ్‌ సభ్యురాలు ఆర్‌.ఎస్‌.రాజెశ్రీ. మహిళల్లో చైతన్యం నింపిన సంఘటనల్లో కొన్ని…

బస్సు ఎక్కుతున్నప్పుడు పట్టుచీర చిరిగినందుకు ప్రశ్నించిన ఓ మహిళ… ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. బస్సు తలుపు దగ్గర బయటకు తేలిన రేకు తగిలి ఫిర్యాదుదారు పట్టుచీర చిరిగిపోయింది. ఆ రేకును సరిచేయాలని బస్సు డ్రైవర్‌కు సూచించారామె. ఈ విషయాన్ని డిపో మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో ఆర్టీసీ అధికారుల తీరుపై నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. బస్సు టిక్కెట్లతో పాటు బయటకు తేలిన రేకు, చిరిగిన పట్టుచీర ఫోటోలను సాక్షాలుగా అందజేశారు. దీనిపై విచారణ చేపట్టిన వినియోగదారుల ఫోరం… ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యాన్ని ధ్రువీకరించింది. పట్టుచీరకు రూ.2వేలు, ఇతర ఖర్చులకు మరో రూ.1000 బాధితురాలికి అందజేయాలని ఆర్టీసీని ఆదేశించింది.

హైదరాబాద్‌లోని మూసాపేట్‌కు చెందిన ఓ మహిళ అవాంచిత రోమాలు తొలగించుకోవడానికి హిమాయత్‌నగర్‌లోని ఓ ఆరోగ్య సంస్థను ఆశ్రయించారు. లేజర్‌ చికిత్సకు నాలుగు సెషన్లు, బాహుమూలాల్లో రోమాలను తొలగించేందుకు మరో రెండు సెషన్లకు కలిపి రూ.70,000 ఆ సంస్థకు చెల్లించారు. సేవలు సంతృప్తిగా లేకపోవడంతో… అబద్దపు హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారంటూ నగర వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారామె. వాద, ప్రతివాదనలు విన్న ఫోరం… వినియోగదారుల వద్ద వసూలు చేసిన డబ్బు మొత్తం తిరిగి చెల్లించాలని, నష్ట పరిహారంగా రూ.10,000, ఇతర ఖర్చులకు రూ.5,000 ఇవ్వాలని తీర్పు వెల్లడించింది.