* కరోనా వైరస్‌పై తీవ్రంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ స్పందిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై విమర్శలు చేశారు. ఆయన తన విచక్షణ కోల్పోయి మాట్లాడారన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే రమేశ్‌కుమార్ నియమితులయ్యారని చెప్పారు. ‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను మేం నియమించలేదు. విచక్షణాధికారం పేరుతో ఏకపక్షంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. కలెక్టర్లు, ఎస్పీలను ఎస్‌ఈసీ ఏకపక్షంగా ఎలా తప్పిస్తారు? ప్రజల చేత ఎన్నికైన సీఎం కంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఎక్కువ అధికారాలు ఉంటాయా? రాష్ట్రాన్ని కూడా ఎన్నికల కమిషనరే పాలించవచ్చు కదా?’’ అని తీవ్రస్థాయిలో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
* కొరోనావైరస్ వ్యాప్తిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘కరోనావైరస్ గురించి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఎన్నికలంటే భయపడిపోయారు. మా తొమ్మిదినెలల పాలన గెలిపిస్తుందని ఎన్నికలకు వెళ్లారు. 29లోపు అన్ని కార్యక్రమాలకు ముద్రవేసుకొని విశాఖ వెళ్లారు. మీరు విశాఖకు వెళ్లే ప్రాధాన్యం ఇచ్చినంత కరోనావైరస్‌కు ఇచ్చారా. కరోనా వైరస్‌పై ప్రభుత్వ చర్యలను ముఖ్యమంత్రి చెప్పేదాకా ప్రశ్నిస్తూనే ఉంటాను’’ అని మండిపడ్డారు.
* స్థానిక ఎన్నికలను కావాలనే వాయిదా వేశారని.. ఒక్క కరోనా కేసును అడ్డం పెట్టుకుని వాయిదా వేయడం కుట్రపూరితమని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే ఇలాంటి చర్యలు తీసుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయితే కేంద్రం నుంచి రూ. 4 వేల కోట్లు వచ్చేవన్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని కావాలనే హడావిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
* మధ్యప్రదేశ్ రాజకీయాలు ఆదివారం మరింత వేడెక్కాయి. సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్ లాల్జీ టాండన్ అసెంబ్లీ స్పీకర్ నర్మద ప్రసాద్ ప్రజాపతికి సూచించడంతో.. ఇరు పార్టీల వర్గాల్లో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ భోపాల్‌లో కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం స్వతంత్ర ఎమ్మెల్యే ప్రదీప్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘మా వద్ద బలపరీక్షలో నెగ్గడానికి అవసరమైన ఎమ్మెల్యేల బలం ఉంది. సీఎం కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కొంత సమయం వేచి చూడాలి. విశ్వాస పరీక్ష రేపు జరుగుతుందో లేదా కరోనా కారణంగా వాయిదా పడుతుందో చూడాలి’అన్నారు.
* కరోనా కారణంగా రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటిస్తూ కాళోజి వర్సిటీ ఉత్తర్వుల జారీ చేసింది. అయితే మెడికల్, డెంటల్, ఆయూష్, ఇంటర్న్స్, నర్సింగ్, ఇతర కోర్సుల ఇంటర్న్స్, పీజీ విద్యార్థులకు సెలవులు వర్తించవని వర్సిటీ వెల్లడించింది. మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) కూడా ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించింది.
* ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఇప్పుడు కరోనా వైరస్‌కు (కొవిడ్-19) భయపడుతోంది. కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆ వైరస్ ప్రభావిత దేశాలకు వెళ్లొద్దంటూ ఐసిస్ తమ ఉగ్రవాదులకు సూచించింది. కరోనా మహమ్మారి వ్యాపించిన దేశాలకు వెళ్లొద్దంటూ తమ ‘అల్-నబా’ మ్యాగజైన్‌లో ప్రచురించింది. అంతేకాదు, ఎప్పటికిప్పుడు చేతులు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఉగ్రవాదులకు తెలిపింది. మధ్యరాత్రిలో నిద్రలేచినా సరే, చేతులు కడుక్కొని పడుకోవాలని తెలిపింది.
* కరోనా వైరస్ సోకిన ఓ వ్యక్తి విమానంలోకి ఎక్కడంతో అందులో ఉన్న 289 మంది ప్రయాణికుల్ని దింపేయాల్సి వచ్చింది. ఈ ఘటన కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ నుంచి వచ్చిన 19 మంది పర్యాటకుల బృందం కేరళలోని మున్నార్‌లో సందర్శిస్తున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వీరిని అధికారులు కొన్ని రోజుల పాటు మున్నార్‌లోనే ఓ ప్రత్యేక కేంద్రంలో ఉంచారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాల కోసం వేచిచూస్తున్నారు.
* పదిహేనేళ్లుగా ప్రభాస్ తనకు తెలుసని అగ్ర కథానాయిక అనుష్క అన్నారు. స్వీటీ, డార్లింగ్ కలిసి 2009లో తొలిసారి ‘బిల్లా’ చిత్రం కోసం పనిచేశారు. తర్వాత ‘మిర్చి’, ‘బాహుబలి’ సినిమాలతో వెండితెర సూపర్‌హిట్ జోడీ అనిపించుకున్నారు. ఈ క్రమంలో తమ మధ్య మంచి స్నేహం ఏర్పడిందని అనుష్క తాజాగా పేర్కొన్నారు. ‘గత 15ఏళ్లుగా ప్రభాస్ నాకు తెలుసు. నా 3 ఆం స్నేహితులలో అతడు ఒకడు (ఆ సమయంలోనైనా మాట్లాడగలిగేంత చనువు ఉందని అర్థం). మా ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి, స్క్రీన్‌పై మా జంట అద్భుతంగా ఉంటుంది కాబట్టి.. మా మధ్య ప్రేమ ఉందని వదంతులు సృష్టించారు.
* మధ్యప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా మారిన వేళ గుజరాత్‌లో సైతం కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. స్పీకర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఓ వైపు అధికార భాజపా వలకు చిక్కకుండా తమ ఎమ్మెల్యేలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం గమనార్హం.
* సంక్షోభంలో ఉన్న యెస్ బ్యాంకులో పెట్టుబడి పెట్టేందుకు మరో ప్రైవేటు బ్యాంకు ముందుకొచ్చింది. రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ప్రకటింది. ఈ మేరకు బోర్డు డైరెక్టర్లు ఈ నెల 14న ఆమోదం తెలిపారని ఆ బ్యాంకు తెలిపింది. రూ.10 ముఖ విలువ కలిగిన 25 కోట్ల ఈక్విటీ షేర్ల కొనుగోలుకు చేసి ‘యెస్ పునరుజ్జీవ పథకం’ కింద రూ.రూ.250 కోట్లు పెట్టుబడి పెడతామని ఆ బ్యాంకు ప్రకటించింది.