* ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన తూర్పుగోదావరికి చెందిన ఓ మహిళ కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. వైద్యులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన మహిళ (38) ఈ నెల 11న దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడి నుంచి 13న స్వగ్రామం అంతర్వేదికి చేరుకున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో బంధువులు ఈ నెల 15న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విదేశాల నుంచి వచ్చారని తెలుసుకున్న వైద్యులు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కాకినాడ జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించారు. అనంతరం తిరుపతి స్విమ్స్‌కు ఆమె రక్త, ఇతర నమూనాలను పంపించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందారు. వైద్య పరీక్షల నిమిత్తం పంపిన నివేదికల్లో ఆమెకు కరోనా నెగిటివ్ వచ్చింది. మెదడులో ఇన్‌ఫెక్షన్ కారణంగానే ఆరోగ్యం క్షీణించి చనిపోయినట్లు జీజీహెచ్ కరోనా నోడల్ అధికారి డాక్టర్ కిరణ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేందర్ రావు తెలిపారు.
* యెస్‌బ్యాంక్ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అడాగ్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో అనిల్ అంబానీకి సమన్లు జారీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు ముంబయిలోని ఈడీ కార్యాలయంలో సోమవారం హాజరు కావాలని ఆయన్ను ఆదేశించింది. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు యెస్ బ్యాంకు నుంచి పొందిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారినట్లు ఈడీ పేర్కొంది. అయితే అనారోగ్య కారణాల వల్ల ఈ రోజు విచారణకు హాజరుకాలేనని అనిల్ అధికారులకు తెలిపినట్లు సమాచారం. అనిల్‌తోపాటు యెస్‌బ్యాంకు నుంచి రుణాలు పొందిన ప్రధాన కంపెనీల ప్రమోటర్లందరికీ సమన్లు జారీచేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.
* సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరితీత నుంచి తప్పించుకునేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే చివరి నిమిషంలో పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలతో దోషుల ఉరిశిక్ష అమలు మూడు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. కొత్త ఆదేశాల ప్రకారం మార్చి 20న వీరిని ఉరితీయాల్సి ఉండగా.. ఇప్పుడు దోషుల్లో ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) ఆశ్రయించారు. ఉరిశిక్షపై స్టే విధించాలని కోరుతూ దోషులు అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ ఐసీజేలో పిటిషన్ దాఖలు చేశారు.
* రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేయడంపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక వ్యక్తి కోసమో, తన సామాజిక వర్గానికి చెందిన పార్టీ బాగుండాలనో ఈ నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. కరోనా పేరుతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదన్నారు. ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను నిలబెట్టుకోలేక ఏం చేయాలో తోచక ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌ను అడ్డం పెట్టుకుని ఎన్నికలను వాయిదా వేయించాయని ఆరోపించారు.
* ఓవైపు వెంటాడుతున్న కరోనా భయాలు.. మరోవైపు ఆర్థిక మాంద్యం ఆందోళనలు.. చమురు ధరల పతనం.. వెరసి దేశీయ మార్కెట్లకు ఈ సోమవారం మరో బ్లాక్ మండేగా మిగిలింది. భారత్, అంతర్జాతీయంగా కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 2,800 పాయింట్ల కిందకు పడిపోయింది. మొత్తంగా నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 2,713.41 పాయింట్లు పతనమై 31,390.07 వద్ద స్థిరపడింది. క్రితం సెషన్ నాటి ముగింపుతో పోలిస్తే ఈ సూచీ 7.96శాతం తగ్గింది. ఇక నిఫ్టీ కూడా 7.61శాతం నష్టంతో 757.80 పాయింట్లు దిగజారి 9,197.40 వద్ద ముగిసింది.
* రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రాసిన లేఖ రాజ్యాంగ విరుద్ధమని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. సీఎస్ రాసిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల అధికారికి సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని యనమల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒకసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక ఇక ప్రభుత్వ పాత్ర ఉండదని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు! ఇప్పుడీ సినిమా డైలాగులు ఎందుకంటారా? ఎందుకంటే భారత్ సహా ప్రపంచ దేశాలకు ఇదే ఇప్పుడు అవసరం. ప్రస్తుతం సమస్త భూమండలాన్నీ కరోనా చుట్టేసింది. నాలుగు దశల్లో వ్యాపించే ఈ వైరస్‌ను కట్టడి చేయాలంటే ‘సామాజిక దూరం’ (సోషల్ డిస్టన్స్) పాటించడం అత్యంత అవసరం. రెండో దశలో కొన్నాళ్లు ఎవరికి వారే క్వారంటైన్ కావడం అత్యవసరం. అలాంటిది ‘కరోనా సెలవులు’ ప్రకటించిందే తడవుగా ప్రయాణాలు మొదలెట్టడం ఆందోళన కలిగించే అంశం. పౌరులు మేలుకోవాల్సిన తరుణమిది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* తమకు పరిపాలన చేతకాదని కొందరు సమైక్యవాదులు గతంలో చెప్పారని.. వారి అంచనాలను తలకిందులు చేస్తూ అనేక రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ విషయం తాము చెబుతోంది కాదని.. కాగ్ నివేదికలే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు తమ పంథా మార్చుకోవాలని సీఎం హితవు పలికారు. ఐదేళ్లలో కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.70లక్షల కోట్లు చెల్లించామని.. కేంద్రం మాత్రం రూ.1.12లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆక్షేపించారు. జాతి నిర్మాణంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని.. దేశాన్ని సాకే రాష్ట్రాల్లో ముందుంటోందన్నారు.
* కేంద్ర మాజీమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరడంతో మధ్యప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నాటకీయ పరిణామాల మధ్య కొనసాగుతోంది. రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశాల నేపథ్యంలో కమల్‌నాథ్ ప్రభుత్వానికి సోమవారం బలపరీక్ష జరుగుతుందని అంతా భావించినా అలా జరగకపోవడంపై భాజపా ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 12గంటల సమయం లోపు కమల్‌నాథ్ ప్రభుత్వం బలపరీక్ష ప్రక్రియను పూర్తిచేసేలా ఆదేశాలు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు.
* ఇకపై కథానాయకుడి పాత్రలో నటించనని ప్రముఖ హాస్యనటుడు వడివేలు వెల్లడించారు. వడివేలు నాలుగు సినిమాల్లో హీరోగా కనిపించారు. ఆయన హీరోగా దర్శకుడు చింబు తీసిన ‘ఇంసై అరసన్ 24 ఏఎం పులికేసి’ సినిమా ఆగిపోయింది. చింబుతో భిన్నాభిప్రాయాల కారణంగా ఈ చిత్ర షూటింగ్‌ను ఆపేశారు. 2006 హిట్ ‘ఇంసై అరసన్’కు రీమేక్ ఇది. ఈ క్రమంలో వడివేలు పలు విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన తన కెరీర్ గురించి ముచ్చటించారు. ‘ప్రేక్షకులను నవ్వించడమే నా ఉద్యోగం. డాక్యుమెంటరీ సినిమాలు తీయాలి అనుకోవడం లేదు. హీరోగా నటించాలని లేదు, ఇకపై నటించను. హీరోల పక్కన ఉన్న కామెడీ పాత్రలు పోషిస్తా’ అని చెప్పారు.
* వాల్‌మార్ట్‌కు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌కు సిద్ధమైంది. మార్చి 19 నుంచి 22 వరకు ‘బిగ్ షాపింగ్ డేస్’ పేరిట కొత్త సేల్‌ను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్పీకర్, స్మార్ట్ ఉత్పత్తులపై ఈ ఆఫర్లు అందిచనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఈ సేల్‌లో 10 శాతం అదనపు డిస్కౌంట్ లభించనుంది. ఇప్పటికే ఈ సేల్‌కు సంబంధించిన కొన్ని ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.
* కరోనా మహమ్మారిపై ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తిచేశారు. కరోనాపై వదంతులు ఎంతమాత్రం నమ్మొద్దని చెబుతున్నారు. అయితే వైరస్‌పై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పిన ప్రధాని.. చిన్న చిన్న చిట్కాలతో కరోనా వ్యాప్తిని అరికట్టొచ్చని సూచించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.
* సీఎం జగన్ తన మొండి వైఖరి, వితండవాదం వీడి 5 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. కరోనా వైరస్ ప్రభావంపై రాబోయే రెండు మూడు వారాలు చాలా కీలకమని చెప్పారు. దేశంలో కరోనా వ్యాప్తి చెందితే అదుపుచేయడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా బారిన పడకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా వైరస్ పూర్తిగా లేదని ప్రకటించేవరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చంద్రబాబు సూచించారు. డెంగీ విషయంలోనూ గతంలో తనను ఎగతాళి చేశారని, దోమలపై యుద్ధం చేస్తారా? అని అపహాస్యం చేశారని వైకాపానుద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, బెంగాల్‌లో అన్ని రకాల ఎన్నికలను రద్దు చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. కరోనాకు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ చాలని జగన్ అనడాన్ని జాతీయ మీడియా సైతం తప్పుబట్టిందని చెప్పారు. కరోనా వైరస్ విషయంలో 4 వారాల పాటు ఎలాంటి సమస్య ఉండదని సీఎస్ అంటున్నారని.. సీఎస్‌కు దీనిపై అవగాహన ఉందా? అని ప్రశ్నించారు.
* ప్రజాసమస్యలపై చర్చించాల్సిన శాసనసభలో రజకార్ల అజెండాను భుజాన ఎత్తుకుంటున్నారని తెలంగాణ భాజపా ఎంపీలు విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేయడంపై వారు మండిపడ్డారు. దిల్లీలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు మీడియాతో మాట్లాడారు. సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలపై సీఎం కేసీఆర్‌కు అవగాహన లేక వాటిని వ్యతిరేకిస్తు్న్నారని బండి సంజయ్ విమర్శించారు. సీఏఏతో ఎవరికీ నష్టం ఉండదని చెప్పారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని శాసనసభ ఎలా వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు.
* బీసీసీఐకి కరోనా వైరస్ విచిత్రమైన పరిస్థితులను పరిచయం చేస్తోంది. ఇప్పటికే కొవిడ్-19 ముప్పుతో ఐపీఎల్ సహా దేశవాళీ క్రికెట్ మ్యాచులన్నీ వాయిదా వేసింది. తాజాగా ముంబయిలోని ప్రధాన కార్యాలయాన్ని సైతం మూసివేస్తోంది. ఉద్యోగులందరినీ మంగళవారం నుంచి ఇంటివద్ద నుంచే పని చేయాలని ఆదేశించిందని తెలిసింది.
* కరోనా వైరస్ ప్రభావంలో మహారాష్ట్రలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. ముంబయిలోని అతి ప్రాచీన సిద్ధివినాయక ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ ట్రస్టు ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకూ గుడి తలుపులు మూసే ఉంటాయని పేర్కొంది. మహారాష్ట్రలోని మరో ప్రముఖ ఆలయం తుల్జా భవాని ఆలయం. మార్చి 17 నుంచి 31 వరకూ ఆలయంలోకి ఎవరికీ ప్రవేశం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఈ రెండు ఆలయాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో జన సమూహాలను నివారించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా.. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 37 కరోనా కేసులు నమోదయ్యాయి.
* దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో కొత్తగా మరో నాలుగు కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 37కు చేరింది. వీరిలో ముగ్గురు ముంబయికి, మరొకరు నవీ ముంబయికి చెందినవారని అధికారులు తెలిపారు. దీంతో దేశంలో ఈ వైరస్ వ్యాప్తి చెందిన వారి సంఖ్య 116కి చేరింది.