పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసులో సౌరవ్ గంగూలీ, అతడిపై ఫిర్యాదు చేసిన వ్యక్తులు రాతపూర్వక సమాధానాలు సమర్పించాలని బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ డీకే జైన్ ఆదేశించారు. త్వరలోనే ఈ వ్యవహారం తేల్చేస్తామని అన్నారు. ఐపీఎల్‌లో దాదా దిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా వ్యవహరిస్తుండటంతో బెంగాల్‌కు చెందిన ముగ్గురు క్రికెట్ అభిమానులు భాస్వతి శాంతౌ, అభిజిత్ ముఖర్జీ, రంజిత్ సీల్ బీసీసీఐకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అందరి వాదనాలు విన్నానని జస్టిస్ డీకే జైన్ తెలిపారు. ‘నేను రెండు పక్షాల వాదనలు విన్నాను. బీసీసీఐ వాదనా విన్నాను. త్వరలోనే తీర్పు వెల్లడిస్తా. తుది తీర్పు వెల్లడించే ముందు రెండు పక్షాల నుంచి రాతపూర్వక జవాబులు సమర్పించాలని కోరాను’ అని జస్టిస్ డీకే జైన్ అన్నారు. తీర్పుకు సంబంధించి తుది గడువు ఉందా అని ప్రశ్నించగా ఉందని సమాధానం ఇచ్చారు. న్యాయ పరిధిలో ఉంది కాబట్టి విచారణలో ఏం జరిగిందో వెల్లడించలేనని అన్నారు. త్వరలోనే తీర్పు ఇస్తానన్నారు. ‘సమావేశం చక్కగా జరిగింది’ అని గంగూలీ అన్నారు.
గంగూలీ కేసులో తీర్పు ఏమవుతుందో?
Related tags :