Politics

తెలంగాణాలో 5కేసులు. 6ల్యాబ్‌లు.

Telangana Corona Cases-Minister Eetela Speaks

కరోనాకు సంబంధించి ఇకపై రాతపూర్వక బులెటిన్లు విడుదల చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదని మంత్రి స్పష్టం చేశారు. దుబాయ్‌, ఇటలీ, నెదర్లాండ్‌‌, స్కాట్లాండ్‌, ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులకు పాజిటివ్ వచ్చిందని చెప్పారు. పలు దేశాల నుంచి వచ్చే వ్యక్తులకు విమానాశ్రయంలోనే స్క్రీనింగ్‌ చేస్తున్నామని.. దీనిలో భాగంగానే చైనా, ఇరాన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, కొరియా నుంచి వచ్చే వ్యక్తులకు స్క్రీనింగ్‌ చేస్తున్నట్లు ఈటల వివరించారు. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు గుర్తించామన్నారు. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కరోనా లక్షణాలు లేనివారిని దూలపల్లి, వికారాబాద్‌లో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే వారిని క్వారంటైన్‌లో ఉంచుతున్నామన్నారు. ఇప్పటివరకు దాదాపు 200 మందికిపైగా క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఈటల వివరించారు. హైదరాబాద్‌లోని ఫీవర్‌, గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లో ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. తుది పరీక్షల కోసం ఇప్పటివరకు పుణె పంపించాల్సి వచ్చేదని.. ఇకపై హైదరాబాద్‌లోనే తుది పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఈటల తెలిపారు. కరోనా పరీక్షలకు రాష్ట్రంలో 6 ల్యాబ్‌లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయన్నారు. వైద్యారోగ్య శాఖ 200 మంది సిబ్బందిని నియమించి ఇప్పటివరకు విమానాశ్రయాల్లో 66,182 మందిని స్క్రీనింగ్‌ చేసినట్లు చెప్పారు. అందులో 464 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించామని.. వారిలో ఐదుగురికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించామని మంత్రి ఈటల వివరించారు.