మానవుడు సమూహజీవి. మానవజాతి ఆవిర్భావం నుంచి అందరూ గుంపులుగా జీవించారని చరిత్ర పరిశీలిస్తే బోధపడుతుంది. ఆ మాటకొస్తే ప్రతిజీవీ తమ జాతితో మమేకమయ్యే జీవిస్తుంది. బారులుకట్టి ఆహార సముపార్జన చేసే చిట్టి చీమలు, తినేవి కనిపిస్తే చాలు తోటి కాకులను కావు కావు మంటూ ఆహ్వానించే వాయసాలు, వినోదానికైనా, విహారానికైనా గుంపులుగా తరలివెళ్ళే ఏనుగులు… ఇలా ప్రతి ప్రాణీ సమూహ జీవనాన్ని ఇష్టపడుతుందని బోధపడుతుంది. మనిషి లాగా ఏ జాతికి చెందిన జీవికీ మనసుండదు కాబట్టి వాటి సంబంధ బాంధవ్యాల్లో పెద్దగా తేడాలు రావు. మనిషి విషయం అలా కాదు. ఎదుటివారి భావాలను ముఖాలలోనే చదువుతూ వారి ఆనంద విషాదాలలో పాలు పంచుకుంటాడు. సత్సంబంధాల కలిమిని హాయిగా అనుభవిస్తాడు.
కొన్ని బంధాలు జన్మతో ఏర్పడతాయి. వియ్యాలతో ఒక్కటయ్యేవి చుట్టరికాలు. స్నేహానుబంధాలు మరికొన్ని పరస్పరం ఆర్థికంగా బలంగా ఉన్న వారిలోనూ ఆర్థిక అంశాలలో స్పర్థలు వస్తుంటాయి. అన్నదమ్ములు, ఆడపడుచుల మధ్య ఆస్తుల విషయంలో తేడాలు రాగల సందర్భాలలో ఆస్తులను తృణ ప్రాయంగా ఎంచి బంధాలను పటిష్ఠంగా నిలుపుకొనే సజ్జనులూ ఉన్నారు. అయిన వారి కన్నా ఆప్తమిత్రుల హృదయాలు విశేషంగా కలిసిపోతాయి.
మొఘలు చక్రవర్తి అక్బర్ పాదుషా, హీరాకుమారి అనే రాజపుత్ర స్త్రీని వివాహమాడి మత సామరస్యానికి కృషి చేశాడు. శాంతి స్థాపన జరిపే దిశగా అడుగులు వేశాడు. చరిత్రలో పాలకులు వివాహ బంధాలతో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు చేసి విజయాలు సాధించిన సందర్భాలున్నాయి.
ఒక్కొక్కసారి మనం చేసే తప్పులు ఇబ్బందులు కలిగిస్తే ఆ తప్పులకు మరొకరిని బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తాం. అలా చేసినప్పుడు సంబంధాలు దెబ్బతిని బీటలు వారతాయి. ఆత్మపరిశీలన వల్ల అరమరికలు తొలగిపోయి స్నేహబంధం వాడిపోకుండా ఉంటుంది.
కంటికి ఆకర్షణగా కనిపించే పంచదార పలుకులు ఆరోగ్యానికి మంచివి కావని తినవద్దంటారు వైద్యులు. పైపై మెరుగులతో దుర్మార్గపు ఆలోచనలు చేసేవారితో స్నేహం ప్రమాద కరమని ఘోషిస్తాయి శాస్త్రాలు. అమిత దానశీలి కర్ణుడికి దుర్జనుడైన దుర్యోధనుడితో స్నేహం వల్ల లాభం చేకూరకపోగా జీవితం వ్యర్థమయింది.
సూర్య భగవానుడి తొలికిరణ స్పర్శతో ఆహ్వానం పలుకుతూ కమలం వికసిస్తుంది. వ్యక్తుల మధ్య మంచి సంబంధాలు ఉంటే వారి స్నేహం దీప్తిమంతమవుతుంది.
లోకంలో అందరూ అన్నీ ఇష్టపడరు. నిత్య వ్యాయామం ఆరోగ్యానికి మంచిదయినా బద్దకంతో చాల మంది దూరంపెడతారు. ఆ వ్యాపకంలోని మంచిని ఇష్టపడేవారు ఆచరించడంలో కొంత కష్టమున్నా ఆచరిస్తారు. కొంత ఇబ్బంది ఉన్నా కొందరిలో సుగుణాలను దూరం చేసుకోలేక వారితో స్నేహం చేస్తారు తెలివైనవారు. సామాజిక జీవన స్రవంతిలో, స్నేహాల్లో అపోహలు తారసిల్లుతుంటాయి. ఏ తేడా వచ్చినా బాంధవ్యాలు తెగిపోతాయి. బలమైన సంబంధాల అల్లికలు చిక్కుబడకుండా కాపాడుకోవాలంటారు నిపుణులు. కొంచెం జాగ్రత్త వహిస్తే వ్యక్తిగత అనురాగాల మాలికలకు ఢోకా ఉండదు. కుటుంబాల్లో సంబంధాల ఆనందాలు పదికాలాల పాటు స్థిరంగా నిలిచి కళకళలాడతాయి. కొత్తవారితో బంధాలు ఏర్పరచుకోవడం, పాతవారితో నిలుపుకోవడం గురుతర బాధ్యతగా గుర్తించినప్పుడు వ్యక్తిగత ఆనందానికి లోటుండదంటారు మనస్తత్వ నిపుణులు.