Sports

దటీజ్ యువీ

The dedication yuvraj singh in 2011 world cup

2011లో టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ గెలవడానికి ప్రధాన కారణం యువరాజ్‌ సింగ్‌. ఆ టోర్నీలో అతడి ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. అటు బ్యాట్‌తో రాణిస్తూనే ఇటు బంతితో మాయ చేశాడు. మరీ ముఖ్యంగా గ్రూప్‌ దశలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ ఎంతో కీలకం. ఆ రోజు అనారోగ్యంతో ఉన్నా ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఒకవైపు వికెట్లు పడుతుంటే.. మరోవైపు మైదానంలోనే వాంతులు చేసుకుంటూ నిలబడ్డాడు. శతకంతో కదం తొక్కి జట్టుకు పోరాడే స్కోర్‌ అందించాడు.

నెమ్మదిగా ఉండే చెన్నై పిచ్‌పై పరుగులు తీయడం కష్టంగా మారింది. ఆదిలోనే గంభీర్‌, సచిన్‌ నిరాశపర్చారు. మూడో వికెట్‌కు విరాట్‌ కోహ్లీ(59)తో కలిసి యువీ 122 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే పలుసార్లు మైదానంలో వాంతులు చేసుకున్నాడు. కోహ్లీ ఔటయ్యాక మిగతా బ్యాట్స్‌మెన్‌తో కలిసి జట్టు స్కోరును 268కు చేర్చాడు యువరాజ్‌. నాటి అనుభవాల్ని ఓ సందర్భంలో ఇలా పంచుకున్నాడు. ‘నాకెప్పుడూ ప్రపంచకప్‌లో శతకం బాదాలని ఉండేది. నేను ఆరోస్థానంలో ఆడటం వల్ల అదెప్పుడూ కుదరలేదు. 2011 ప్రపంచకప్‌లో సెహ్వాగ్‌ ఆడలేదు. దీంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. అప్పుడు దేవుడికి ఒకటే మొక్కుకున్నా. ఏం జరిగినా.. ఒకవేళ టోర్నీ తర్వాత నేను చనిపోయినా టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ గెలవాలని కోరుకున్నా.

తొలుత బ్యాటింగ్‌లో శతకం బాదిన యువీ తర్వాత బౌలింగ్‌లో రాణించాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి 18 పరుగులకే రెండు కీలక వికెట్లు తీశాడు. అనంతరం వెస్టిండీస్‌ 188 పరుగులకే కుప్పకూలడంతో భారత్‌ మ్యాచ్‌ గెలిచింది. యువీ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌ జరిగి నేటికి 9 ఏళ్లు. 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా.. శ్రీలంకపై గెలుపొంది రెండోసారి వన్డేల్లో విశ్వవిజేతగా నిలిచన సంగతి తెలిసిందే. యువరాజ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.