అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికిస్తోంది. శుక్రవారానికి దాదాపు 11,500 కేసులు నమోదవడంతో దాదాపు సగం రాష్ట్రాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో భారతీయ దుకాణాలు మూసి ఉండటంతో నిత్యావసర వస్తువులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిలికాన్ వ్యాలీగా పిలిచే శాన్‌ఫ్రాన్సిస్కో, శాన్‌జోస్ (కాలిఫోర్నియా) పూర్తిగా మూతపడింది. కొద్ది సంఖ్యలో వ్యాపార సంస్థలు తెరిచి ఉంటున్నా వాటిలో నిత్యావసర వస్తువులు దొర కడం లేదు. గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ సహా వందలాది కంపెనీల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు ఇళ్ల నుంచే విధులు నిర్వహిస్తున్నారు.
****ప్రజలు వీధుల్లోకి రావొద్దని హెచ్చరికలు
ప్రపంచ వాణిజ్య కేంద్రాల్లో అగ్రగామి న్యూయార్క్ పూర్తిగా స్తంభించింది. పొరుగునే ఉన్న న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. న్యూయార్క్‌లో కేసులు పెరుగుతుండటంతో అధికా రులు ప్రజలను వీధుల్లోకి రావొద్దని హెచ్చరించారు. నైట్ క్లబ్‌లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. వాషింగ్టన్, ఫ్లోరిడా, ఇల్లినాయీ, షికాగో, లూసియానా, జార్జియా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలను ఇళ్లకు పరిమితం చేయాలని స్థానిక ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రారంభ దశలో వాషింగ్టన్, న్యూయార్క్, కాలిఫోర్నియా రాష్ట్రాలకే పరిమితమైన వైరస్… ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాలను తాకింది. అత్యధికంగా న్యూయార్క్‌లో 4,152 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి దాకా వాషింగ్టన్‌లో 1,228, కాలిఫోర్ని యాలో 1,044, న్యూజెర్సీలో 742 కేసులు నమోదయ్యాయి. న్యూజెర్సీలో ఒకే కుటుం బానికి చెందిన నలుగురు వైరస్ బారిన పడి మృతి చెందారు. వంద అంతకంటే ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, టెక్సాస్, కొలరాడొ, మసాచ్యూసెట్స్, లూసియానా, ఇల్లినాయీ, జార్జియా, ఫ్లోరిడా ఉన్నాయి. వాటిలో కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీలలో భారతీయులు అందులోనూ తెలుగువారు లక్షల్లో నివసిస్తున్నారు.
****నిత్యావసరాల కోసం భారీ క్యూలు…
కరోనా వైరస్ దృష్ట్యా ఇళ్లకే పరిమితం కావాలని కాలిఫోర్నియా ప్రభుత్వం హెచ్చరించడంతో శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ఏంజిలెస్, శాన్‌జోస్ నగరాలు నిర్మానుష్యంగా మారాయి. భారతీయులు ఆధారపడే దుకాణాలు మూసి ఉండటంతో వేలాది మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరీ ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబాలకు తోటి భారతీయులు తమ దగ్గర ఉన్న నిత్యావసరాల్లో కొన్నింటిని అంద జేస్తున్నారు. ఈ పరిస్థితి మారడానికి భారతీయ దుకా ణాలను తెరిపించాలని, అక్కడ నిత్యావసర వస్తువులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సిలికాన్ వ్యాలీ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు కాలిఫోర్నియా గవర్నర్‌ను కోరారు. న్యూజెర్సీలో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకొనేందుకు తెలుగు సంఘాలు ప్రత్యేక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశాయి. కాలిఫోర్నియాలోనూ ఈ తరహా గ్రూపులు ఏర్పాటు చేస్తున్నామని సిలికాన్ వ్యాలీ తెలుగు అసోసియేషన్‌కు చెందిన మందడి రాకేశ్‌రెడ్డి చెప్పారు.
***జాగ్రత్తలు తప్పనిసరి…
అమెరికాలో ఉండే తెలుగువారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇళ్లకే పరిమితం కావాలని తెలుగు అసోసియేషన్లు విజ్ఞప్తి చేశాయి. నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి. భారతీయ స్టోర్‌లలో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ తెలుగు సంఘాలు అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో దేశీయ, విదేశీ ప్రయాణాలు చేయొద్దని, 60 ఏళ్లకు పైబడిన భారతీయ తల్లిదండ్రులు ఇల్లు దాటి బయటకు రావద్దని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ తరుణంలో స్వదేశానికి వెళ్లాలన్న ఆలోచన మానుకోవాలని సూచించింది.
దుర్భరంగా సిలికాన్ వ్యాలీలో పరిస్థితులు
Related tags :