* కరోనా వైరస్ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటర్స్ వెల్లడించింది. మహమ్మారి కారణంగా ఇప్పటికే మహారాష్ట్రలోని ప్లాంట్‌లో వాహనాల తయారీ కార్యకలాపాలు తగ్గించినట్లు పేర్కొంది. ఈ మేరకు సంస్థ ఎండీ గ్వెంటర్ బషెక్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘దేశంలోని అన్ని ప్రాంతాల్లోని కార్యాలయాల పరిధిలో ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. కరోనా వైరస్ ప్రభావం ఇంకా తీవ్రతరమైతే మంగళవారం నుంచి ప్లాంట్ కార్యకలాపాలు ఆపేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
* కరోనా వైరస్ విస్తృతి ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితుల్లో రూ.11-101 విలువైన 4జీ డేటా ఓచర్లతో రెట్టింపు డేటా, ఇతర నెట్‌వర్క్‌లకు అదనపు టాక్‌టైమ్ సదుపాయం కల్పిస్తున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది. అధికవేగం డేటా పరిమితి ముగిశాక 64 కేబీపీఎస్ వేగంతో అపరిమితంగా వాడుకోవచ్చు. రూ.11కు 800 ఎంబీ అధికవేగం డేటా, 75 నిమిషాల టాక్‌టైమ్; రూ.21కి 2జీబీ డేటా 200 ని.టాక్‌టైమ్, రూ.51కి 6జీబీ డేటా, 500 ని.టాక్‌టైమ్, రూ.101కి 12 జీబీ డేటా, 1000 ని.టాక్‌టైమ్ లభిస్తుందని పేర్కొంది.
* అగ్రగామి వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ప్రముఖ కాంపాక్ట్ సెడాన్ మోడల్ డిజైర్‌లో అధునాతన వెర్షన్‌ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.5.89- 8.8 లక్షలు (ఎక్స్- షోరూమ్ దిల్లీ)గా నిర్ణయించారు. మాన్యువల్ వేరియంట్ ధర రూ.5.89- 8.28 లక్షలుగా, ఆటోమేటెడ్ గేర్ షిఫ్ట్ వేరియంట్ రూ.7.31- 8.8 లక్షలుగా ఉన్నాయి. ‘కాంపాక్ట్ సెడాన్ విభాగంలో 55 శాతం మార్కెట్ వాటా డిజైర్ సొంతం. ఇప్పటికే 20 లక్షలకు పైగా డిజైర్ వినియోగదారులు ఉన్నారు. 2020 డిజైర్‌లో కొత్త తరం కే- సిరీస్ ఇంజిన్ అందించాం. ఐఎస్‌ఎస్ టెక్నాలజీ, ప్రీమియం ఇంటిరీయర్ డిజైన్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి’ అని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, అమ్మకాలు) శశాంక్ శ్రీవాస్తవా పేర్కొన్నారు. బీఎస్-6 పెట్రోల్ ఇంజిన్‌తో తక్కువ ఉద్గారాలు, అధిక ఇంధన సామర్థ్యం లభిస్తాయి అన్నారు. మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు 23.26 కి.మీ, ఆటోమేటెడ్ వెర్షన్ లీటర్‌కు 24.12 కి.మీ మైలేజీ ఇస్తాయని కంపెనీ తెలిపింది.
* దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థలు ఓలా, ఉబర్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ నిబంధనలకు అనుసరిస్తూ ‘పూల్ రైడ్’ లేదా ‘పూల్ సర్వీస్’ సదుపాయాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఇకపై ఓలా లేదా ఉబర్‌లో ఒకరు లేదా ఒకే కుటుంబానికి చెందినవారు మాత్రమే ప్రయాణించవచ్చు.
* దేశీయంగా సగానికి పైగా కంపెనీల కార్యకలాపాలపై కరోనా వైరస్ ప్రభావం పడినట్లు ఫిక్కీ నిర్వహించిన సర్వేలో తేలింది. అది కూడా ప్రాథమిక దశలోనేనని తెలిపింది. అలాగే సుమారు 80 శాతం కంపెనీలకు నగదు లభ్యత తగ్గిందని కూడా సర్వే వెల్లడించింది. దీంతో ఉద్యోగాలకు జీతాలు, వడ్డీలు, రుణాల చెల్లింపులు చేయలేని పరిస్థితి నెలకొంటోందని పేర్కొంది. కరోనా వైరస్ సరఫరా, గిరాకీ రెండింటికి తీవ్ర అంతరాయాలు సృష్టించిందని, దేశ వృద్ధిపథానికి ఇది అవరోధంగా నిలుస్తుందని తెలిపింది. ఈ సంక్షోభం నుంచి వ్యాపార సంస్థలు బయటపడాలంటే.. పరపతి విధాన నిర్ణయాలతో పాటు ఆర్థికపరమైన సహకారాన్ని ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉందని సర్వే అభిప్రాయపడింది.