NRI-NRT

టాంపాలో జీవిత బీమాపై నాట్స్ సదస్సు

Tampa Florida Telugu News-NATS Seminar On Life Insurnace

అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ .. అమెరికాలో అత్యంత కీలకమైన జీవిత బీమా పై అవగాహన కల్పించేందుకు వెబినార్ నిర్వహించింది. ప్రముఖ న్యాయనిపుణులు అలన్ ఎస్ గస్‌మన్, బీమా రంగంలో నిపుణులైన పౌలా రీవిస్ ఈ వెబినార్‌లో తెలుగువారికి కీలకమైన సలహాలు,సూచనలు అందించారు. అమెరికాలో తెలుగువారు ప్రమాదాల బారిన పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. వివిధ ఘటనల్లో జరిగిన ప్రాణనష్టంతో బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ క్రమంలో తెలుగువారికి జీవితబీమాపై అవగాహన కల్పించి.. వారి కుటుంబాలకు భద్రత, భరోసా ఎలా కల్పించుకోవాలనే దానిపై దృష్టిసారించే విధంగా నాట్స్ ఈ వెబినార్‌ను ఏర్పాటు చేసింది. నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ టెంపా చాప్టర్ అడ్వైజరీ చైర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ టెంపా విభాగం సమన్వయకర్త రాజేశ్ కాండ్రు, సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, శ్రీధర్ చలసాని తదితరులు ఈ వెబినార్‌కు విచ్చేశారు. వెబినార్ ద్వారా వందల మంది తెలుగువారు జీవిత బీమాపై తమకున్న సందేహాలను నిపుణుల ద్వారా నివృత్తి చేసుకున్నారు. జీవితబీమా అమెరికాలో ఎంత అవశ్యకమన్నది తెలుసుకున్నారు. నాట్స్ వెబినార్ విజయవంతం చేయడంలో టెంపా విభాగం చేసిన కృషిని నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి అభినందించారు. కరోనా వ్యాప్తి జరుగుతుందనే ఉద్దేశంతో వ్యక్తుల మధ్య సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ నాట్స్ ఈ వెబినార్ నిర్వహించింది. పిన్నమనేని ప్రశాంత్ ఈ కార్యక్రమానికి సంధాన కర్త గా వ్యవహరించారు.