కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం అందరూ సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొందరు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న తీరు చూసి ఆవేదన వ్యక్తం చేశారు శ్రుతీహాసన్. ఈ విషయం గురించి శ్రుతి మాట్లాడుతూ – ‘‘సామాజిక దూరం పాటించాల్సిన విషయం గురించి చెబుతున్న ఓ వ్యక్తి వీడియోను నేను సోషల్ మీడియాలో చూశాను. అతని చుట్టూ మరో ఐదుగురు ఉన్నారు. సామాజిక దూరాన్ని పాటించడం అంటే ఇదేనా? అనిపించింది.ఇలా చేయడం సరికాదు. అలాగే నాతో మాట్లాడిన ఓ వ్యక్తి తన స్నేహితుడిని మళ్లీ కలుసుకోవాలని ఉందని చెప్పాడు. ప్రభుత్వం సామాజిక దూరం గురించి పదే పదే చెబుతున్నప్పడు మన స్నేహితులను మళ్లీ కలుసుకోవాలనే ఆలోచనలు సరైనవి కావు. అందరూ బాధ్యతగా ఉండాల్సిన తరుణం ఇది. ప్రస్తుతం ఇంట్లో నేను, క్లారా (శ్రుతీ పెంచుకుంటున్న పిల్లి పిల్ల) మాత్రమే ఉన్నాం. మా ఫ్యామిలీ సభ్యులు కూడా స్వీయగృహనిర్భందంలో ఉన్నారు’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. తెలుగులో రవితేజ ‘క్రాక్’, తమిళంలో విజయ్‌సేతుపతి ‘లాభం’ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు శ్రుతీహాసన్.
బాధ్యత లేదా?
Related tags :